logo

రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు

కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్‌ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్‌బాబు విమర్శించారు.

Updated : 26 Apr 2024 06:06 IST

చిత్తశుద్ధి ఉంటే కూతురుపై ఒట్టేయాలి: ఎమ్మెల్యే హరీశ్‌బాబు

ప్రచార రథంపై గోమాసె శ్రీనివాస్‌, రామకృష్ణారెడ్డి, హరీశ్‌బాబు, ప్రదీప్‌కుమార్‌

ఈనాడు, పెద్దపల్లి(పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే): కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్‌ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్‌బాబు విమర్శించారు. పెద్దపల్లిలో గురువారం భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ నామినేషన్‌, బీఫామ్‌ సమర్పణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని మీడియా పాయింట్‌ వద్ద హరీశ్‌బాబు విలేకరులతో మాట్లాడారు. పంద్రాగస్టు నాటికి రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తానంటూ రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే కూతురుపై ఒట్టు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ‘ఓటుకు నోటు’ కేసులో జులైలో సుప్రీంకోర్డు విచారణ ఉందని, ఈ కేసులో సీఎం జైలుకు వెళ్లే అవకాశాలున్నాయన్నారు. ఆగస్టు నాటికి పదవిలో ఉండనన్న భయంతోనే సీఎం పదేపదే ఆగస్టు జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ మోసకారి పార్టీ: గోమాసె

నియోజకవర్గంలో 40 ఏళ్లుగా గడ్డం వెంకటస్వామి నుంచి వంశీ వరకు రాజకీయ దోపిడీ చేశారని భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ విమర్శించారు. అలాంటి వారికి టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌.. మోసకారి పార్టీ అని ఆరోపించారు. చెన్నూరులో వివేక్‌, బెల్లంపల్లిలో వినోద్‌లు శాసనసభ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా లోక్‌సభ ఎన్నికల్లో వంశీకృష్ణను అభ్యర్థిగా నిలబెట్టి మరోసారి మోసగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

పెద్దపల్లిలో భాజపా ర్యాలీ

ర్యాలీలో భగ్గుమన్న విభేదాలు

ర్యాలీలో భాజపా శ్రేణుల తోపులాట

భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ నామినేషన్‌ ర్యాలీకి ముందు పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి పార్టీ నేతలు హరీశ్‌బాబు, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, సునీల్‌రెడ్డి తదితరులు ప్రచార రథంపై ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య, నాయకుడు మీస అర్జున్‌రావులను తీసుకొని గోమాసె శ్రీనివాస్‌ అక్కడికి చేరుకున్నారు. గోమాసె రథంపైకి రాగానే ముందుకెళ్లాలని సునీల్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌ శ్రేణులకు సూచించారు. అయితే గుజ్జుల రథంపైకి ఎక్కిన తర్వాతే ముందుకు కదలాలంటూ ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో రథం దిగి వచ్చిన సునీల్‌రెడ్డితో వారు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పార్టీ నాయకులు శ్రీనివాస్‌, సంతోష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కొద్దిసేపటి తర్వాత గుజ్జుల ప్రచార రథంపైకి చేరడంతో ర్యాలీ కొనసాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని