logo

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం

స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది.

Published : 26 Apr 2024 03:08 IST

విజయ్‌

ధర్మారం, న్యూస్‌టుడే : స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన చొప్పరి లక్ష్మి, భూమయ్య  దంపతులది పేద కుటుంబం. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు విజయ్‌(24). దంపతులు కూలీ, హమాలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తున్నారు. డిప్లొమా-సివిల్‌ చదువుకున్న విజయ్‌.. తండ్రితో కలిసి కొంతకాలం కూలీ పనులకు వెళ్లాడు. స్థానికంగా పని లేకపోవడంతో రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ వెళ్లాడు. కొంపల్లిలో ఉంటూ ఓ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం బొల్లారం-కొంపల్లి మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని గురువారం నందిమేడారానికి తరలించారు. చేతికందిన ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


అరుణాచల్‌ప్రదేశ్‌లో విశ్రాంత హెచ్‌ఎం...

రాంరెడ్డి

కోనరావుపేట, న్యూస్‌టుడే: స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. కోనరావుపేట మండలకేంద్రానికి చెందిన కొమ్మిటి రాంరెడ్డి (66) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ కరీంనగర్‌లో 30 ఏళ్లుగా నివాసముంటున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేశారు. కరీంనగర్‌లోని తోటి స్నేహితులతో కలిసి నాలుగు రోజుల కిందట తీర్థయాత్రలకు వెళ్లాడు. బుధవారం అరుణాచల్‌ప్రదేశ్‌లో బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి పడటంతో మృతి చెందారు. శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని గురువారం స్వగ్రామం కోనరావుపేటకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య పుష్పలత, కూతురు ప్రసన్న, కుమారుడు వామన్‌ ఉన్నారు.


జీవన్మృతురాలి అవయవ దానం

రమాదేవి

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే : రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవన్మృతురాలు చెందిన మహిళ అవయవాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు ఆమె కుటుంబ సభ్యులు. సుల్తానాబాద్‌ మండలం రేగడిమద్దికుంటకు చెందిన బుర్ర రమాదేవి (42) ఈ నెల 18న తన భర్త కొమురయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై పొలానికి వెళ్తూ వాహనం పైనుంచి జారి పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా 23న జీవన్మృతి చెందింది. విషయం తెలుసుకున్న హైదరాబాద్‌ జీవన్‌దాన్‌ ఆర్గాన్‌ డోనార్‌ సంస్థ అదేరోజు ఆమె కుటుంబసభ్యులను సంప్రదించగా అవయవదానానికి అంగీకరించారు. అవయదానం చేసిన మహిళ కుటుంబసభ్యులను స్థానికులు, సంస్థ ప్రతినిధులు అభినందించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని