logo

భారాస హయాంలో ఖజానా ఖాళీ

భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అయిదేళ్లలో కరీంనగర్‌ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు.

Published : 26 Apr 2024 03:28 IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌

తిమ్మాపూర్‌లో మాట్లాడుతున్న మంత్రి ప్రభాకర్‌, చిత్రంలో ఎంపీ అభ్యర్థి రాజేందర్‌రావు, ఎమ్మెల్యే సత్యనారాయణ

శంకరపట్నం, తిమ్మాపూర్‌, మానకొండూర్‌, న్యూస్‌టుడే: భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అయిదేళ్లలో కరీంనగర్‌ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. కరీంనగర్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు గురువారం తిమ్మాపూర్‌, శంకరపట్నం, మానకొండూర్‌లలో నిర్వహించిన రోడ్‌ షోలలో మంత్రి పాల్గొని మాట్లాడారు. భారాస పాలనలో ఖజానా ఖాళీ అయిందని.. రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. సంజయ్‌ ఓట్ల కోసం రాముడి తలంబ్రాల పేరుతో రాజకీయం చేశారని విమర్శించారు. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఒక్క విద్య సంస్థగాని.. యువతకు ఉద్యోగావకాశాలుగాని కల్పించలేదన్నారు. అవినీతి ముద్రతోనే బండి సంజయ్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. ఆగష్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కూడా నిర్మించి ఇస్తామన్నారు. నియంత కేసీఆర్‌ పాలనకు స్వస్తి పలికి ప్రజాపాలన కోసం కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత తెలంగాణ ప్రజలదేనన్నారు. రెండు పడక గదులు ఇచ్చిన గ్రామాల్లో భారాస నాయకులు ఓట్లు అడగాలని, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకులు అడుగుతారన్నారు. తిమ్మాపూర్‌, మానకొండూర్‌ మండలాల అభివృద్ధికి జగపతిరావు కృషి చేశారని అన్నారు. పేదల అభ్యున్నతికి దివంగత ఎమ్మెల్యే జగపతిరావు కృషి చేశారని గుర్తు చేశారు. విద్యావంతుడు రాజేందర్‌రావును ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా నుస్తులాపూర్‌ మాజీ సర్పంచి శ్రీనివాస్‌రావు భారాస నుంచి కాంగ్రెస్‌లోకి చేరగా మంత్రి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. రాజేందర్‌రావు మాట్లాడుతూ తన తండ్రి ఆశయసాధనకు కృషి చేస్తానని తెలిపారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వివిధ మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు బస్వయ్యగౌడ్‌, రవీంద్రచారి, సంపత్‌గౌడ్‌, తిరుమల్‌రెడ్డి, సంపత్‌, ఎస్‌ఎల్‌గౌడ్‌, మల్లారెడ్డి, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

తిమ్మాపూర్‌లో హాజరైన ప్రజలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని