logo

కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా

జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్‌ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్‌ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది.

Published : 26 Apr 2024 03:20 IST

వరద ప్రవాహ మార్గాల్లో స్థిరాస్తి వ్యాపారం

కాట్నపల్లి కొమురయ్యకుంట ప్రవాహానికి అడ్డుగా గ్రామ చెరువుశిఖంలో మట్టిపోసిన దృశ్యం

కాట్నపల్లి కొమురయ్యకుంట నుంచి వచ్చే వరద మత్తడి ద్వారా స్థానిక పెద్దచెరువులో చేరుతుంది. కాగా స్థిరాస్తి వ్యాపారులు వరద ప్రవాహానికి అడ్డుగా రాజీవ్‌ రహదారికి ఆనుకొని మట్టిని పోసి చదును చేస్తున్నారు. దీంతో వానాకాలంలో వరదతో పక్కనున్న పంట పొలాలు నీట మునిగే పరిస్థితి నెలకొంది.

న్యూస్‌టుడే, సుల్తానాబాద్‌: జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్‌ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్‌ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. ‘ఆక్రమణలకు కాదేదీ అనర్హం’ అన్న చందాన ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. చెరువులు, కుంటలు, పొలాల నుంచి వరద ప్రవహించే కాలువ మార్గాలకు అడ్డుగా మట్టి పోసి విక్రయిస్తున్నారు. దీంతో ఏటా వానాకాలంలో పంట పొలాలను వరద ముంచెత్తి రైతులు నష్టపోతున్నారు.

కాలువల కబ్జా

  • మండలంలో మానేరు, హుస్సేన్‌మియా వాగులతో పాటు చెరువులు, వాగుల నుంచి వాగులు, కాలువలు పారుతున్నాయి.
  • దుబ్బపల్లి వద్ద ఎగువ పొలాల నుంచి వచ్చే వరద చిన్నవాగు ద్వారా గర్రెపల్లి చెరువులో చేరుతోంది. కాగా ఈ వాగు స్థిరాస్తి వ్యాపారుల చేతిలో ఆక్రమణకు గురైంది.
  • భూపతిపూర్‌ చెరువు, కుంటల నుంచి వరద కాలువ ద్వారా గర్రెపల్లి చెరువులో చెరుతోంది. ఈ కాలువను పలు చోట్ల ఆక్రమించారు.
  • సుల్తానాబాద్‌ గ్రామ చెరువు నుంచి వరద పొలాల్లో కాలువ ద్వారా కిందకు పారుతుంది. ఈ కాలువను కబ్జా చేశారు.
  • చిన్నకల్వల వద్ద హుస్సేన్‌మియా వాగు స్థలాన్ని ఆక్రమించి స్థిరాస్తి వెంచర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

సుగ్లాంపల్లి వాగులో మట్టి పోసి చదును చేస్తున్న దృశ్యం

సుల్తానాబాద్‌ పెద్ద చెరువు నిండి మత్తడి పారినపుడు వరద హుస్సేన్‌మియా వాగులో కలుస్తోంది. అయితే సుగ్లాంపల్లి వద్ద వాగులో స్థిరాస్తి వ్యాపారులు మట్టి పోసి చదును చేస్తూ అమ్ముకొంటున్నారు. దీంతో వర్షాకాలంలో వరద ఎక్కువైనప్పుడు వాగు పక్కన పొలాల్లోకి చేరి నష్టం వాటిల్లుతోంది.

సుల్తానాబాద్‌ చెరువుకింద పొలాల నుంచి వచ్చే వరద ప్రవాహానికి అడ్డుగా పోసిన మట్టి, వేస్తున్న పైపులు

ఏటా వానాకాలంలో సుల్తానాబాద్‌ పెద్దచెరువు నుంచి వరద పొలాల మీదుగా దిగువకు వెళ్తుంది. ఈ కాలువకు అడ్డుగా రాజీవ్‌ రహదారిని ఆనుకొని మట్టిని పోసి, పైపులు వేసి కాలువ విస్తీర్ణాన్ని తగ్గిస్తూ ఆక్రమించుకుంటున్నారు. దీంతో వానాకాలం వరదకు పొలాలు నీట మునిగే పరిస్థితి నెలకొంది.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

ఈ విషయమై ఎస్సారెస్పీ డీఈ మధుమతిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఆక్రమణకు గురైన కాలువ ప్రాంతాలను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు