logo

అదనపు ఈవీఎంలు తప్పవా?

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Published : 26 Apr 2024 03:09 IST

న్యూస్‌టుడే, జగిత్యాల: నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక బ్యాలెట్‌ యూనిట్‌లో నోటాతో కలిపి 16 మంది అభ్యర్థుల పేర్లు పొందుపర్చవచ్చు. అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులుంటే ఎక్కువ ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 183 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 12 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ఒక కంట్రోల్‌ యూనిట్‌కు 51 ఈవీఎంలు ఏర్పాటు చేయవచ్చు. 816 మంది అభ్యర్థులు దాటితే ఈవీఎం ద్వారా పోలింగ్‌ వీలుపడదు. బ్యాలెట్‌ పత్రాలు ముద్రించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం 16 మంది మించకపోవచ్చని ఎన్నికల అధికారులు ఓటింగ్‌ యంత్రాలను జిల్లాస్థాయిలో తనిఖీలు నిర్వహించడమే కాకుండా నియోజకవర్గాల వారీగా ర్యాండమైజేషన్‌ పూర్తి చేసి సిద్ధం చేసుకున్నారు. ఊహించని విధంగా నామినేషన్ల గడువు ముగిసే నాటికి 42 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం వాటిని పరిశీలిస్తారు. సరిగ్గాలేని నామినేషన్లను తిరస్కరిస్తారు. ఉపసంహరణకు గడువు ఈ నెల 29 వరకు ఉంది. అప్పటి వరకు బరిలో ఉండేది ఎంతమంది అనే విషయం తేలుతుంది. 16 మందికి మించి ఉంటే 2 బ్యాలెట్‌ యూనిట్లు 32 మందికి మించి అభ్యర్థులుంటే 3 బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల సంఘం కేవలం ఒక్కోపోలింగ్‌ కేంద్రానికి ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌ని పంపించింది. వాటన్నింటినీ అధికారులు పరిశీలించి పోలింగ్‌ కోసం సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే మళ్లీ అవసరమైన బ్యాలెట్‌ యూనిట్ల కోసం ఎన్నికల సంఘానికి రాయాల్సి ఉంటుంది. అవి రాగానే మళ్లీ తనిఖీలు, ర్యాండమైజేషన్‌ చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పరిశీలనలో తిరస్కరణకు గురి కాకుంటే అభ్యర్థులు ఉపసంహరించుకోకుంటే మళ్లీ పని మొదటికి వచ్చినట్లేనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు