logo

అనుభవానికి ప్రాధాన్యం.. విధేయతకు పట్టం

ఎట్టకేలకు అధికార తెరాస నాలుగు జిల్లాలకు నూతన రథ సారథులను నియమించింది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాధ్యతల్ని కీలక నేతలకు అప్పగిస్తూ గులాబీ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన చాలా రోజుల తర్వాత పార్టీ అధ్యక్షుల నియామకం జరగడంతో

Published : 27 Jan 2022 04:49 IST

రెండుచోట్ల ఎమ్మెల్యేలకే జిల్లాధ్యక్ష పదవి
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

ట్టకేలకు అధికార తెరాస నాలుగు జిల్లాలకు నూతన రథ సారథులను నియమించింది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాధ్యతల్ని కీలక నేతలకు అప్పగిస్తూ గులాబీ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన చాలా రోజుల తర్వాత పార్టీ అధ్యక్షుల నియామకం జరగడంతో ఒకింత నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఇప్పటికే గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ, మండల స్థాయి కమిటీలు పూర్తయ్యాయి. ఆయా జిల్లాల కమిటీల అధ్యక్షుల స్థానం కోసం ఉమ్మడి జిల్లాలో గట్టిపోటీ ఇచ్చేలా పలువురి పేర్లని పార్టీ అధిష్ఠానం పరిశీలించింది. కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి సుమారు 30 మంది నాయకులు ఈ పదవిని అందుకునేందుకు ఆశపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటివరకు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారికే పార్టీ ఈసారి కీలకమైన పీఠాన్ని అప్పగించింది. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లాలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి జిల్లాధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లను ఎంపిక చేయడంలో పార్టీ వైఖరి స్పష్టంగా తెలిసొచ్చింది. మరోవైపు అందరిని సమన్వయపర్చుకుని ముందుకు తీసుకెళ్లగలిగే నేతల వైపునకే మొగ్గుచూపింది. ఇదే తరహాలో రాజన్నసిరిసిల్ల జిల్లా గులాబీ రథసారథిగా తోట ఆగయ్య, కరీంనగర్‌ జిల్లాధ్యక్షుడిగా సుడా ఛైర్మన్‌ జీవీ రామకృష్ణారావులను నియమించింది. పార్టీ ఆవిర్భావం నుంచి తోడ్పాటును అందించిన వీరిద్దరికి జిల్లాధ్యక్ష పీఠాన్ని అప్పగించి ఉద్యమకారులకు సమున్నత స్థానాన్ని తెరాస కట్టబెట్టింది. యువనాయకులుగా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేలా బాధ్యతల్ని వీరి భుజానకెత్తింది.


సరికొత్త వైభవం దిశగా..

తెరాస వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తుందనేందుకు తాజాగా చేపట్టిన నియామకాలే నిదర్శనం. ఇన్నాళ్లు అనుసరించిన వ్యూహాలకు భిన్నంగా ఇకపై పార్టీ జోరుని పెంచబోతోంది. పార్టీ సభ్యత్వ నమోదు విషయంలోనూ ఆదర్శమనే తీరు ఉమ్మడి జిల్లాలో చూపించిన పార్టీ శ్రేణులకు ఇన్నాళ్లుగా తమ పార్టీ కార్యక్రమాల్లో జిల్లాధ్యక్షుడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్థి పార్టీల వైఖరిని ఎండగట్టేందుకు పార్టీ పక్షాన స్వరాన్ని వినిపించేలా జిల్లాధ్యక్షులు తమ జోరుని చూపించే వీలుంటుంది. పైగా అన్ని జిల్లాల్లో తెరాస కార్యాలయాలు నిర్మితమవడంతో అక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలు తరచూ ఉండేలా పార్టీ ముఖ్యనేతలు ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే గ్రామాలు, మండల స్థాయిలో యువజన, రైతు, మహిళా, మైనారిటీ, విద్యార్థి, కార్మిక విభాగాలను ఏర్పాటు చేసి కొందరికి ఆయా పదవులతో పార్టీ న్యాయం చేసింది. ఇంకొందరి నియామకాల్ని కొత్తగా బాధ్యతల్ని తీసుకోనున్న అధ్యక్షులు సమీప భవిష్యత్తులో ఏర్పాటు చేసేలా అవకాశాన్ని పార్టీ కల్పించబోతోంది. కొత్తగా ఎన్నికైన జిల్లాల అధ్యక్షులతో త్వరలోనే తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం నిర్వహించి పార్టీపరంగా పలు సూచనల్ని చేయనున్నట్లు తెలిసింది. మొత్తంగా గులాబీ పార్టీని మరింతగా నాలుగు జిల్లాలో గుబాళించేలా నూతన అధ్యక్షుల నియామక నిర్ణయంతో తెరాసలో కొత్త జోష్‌ నెలకొంది.


జిల్లా సారథిగా జీవీ రామకృష్ణారావు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: తెరాస కరీంనగర్‌ జిల్లాధ్యక్షుడిగా సుడాఛైర్మన్‌ జీవీ రామకృష్ణారావు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి గులాబీ జెండా పట్టుకుని పార్టీ పటిష్ఠతకు కృషి చేసిన ఆయనకే ఈ కీలక బాధ్యతల్ని అధిష్ఠానం కట్టబెట్టింది. మానకొండూర్‌ గ్రామానికి చెందిన ఈయన 2018 నుంచి సుడా ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2001లో కరీంనగర్‌లో నిర్వహించిన సింహగర్జన సమయంలో జన సమీకరణతో పాటు ఇక్కడి ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించారు. 2002-2006 వరకు తెరాస రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతల్ని నిర్వర్తించారు. 2006 నుంచి 2011 వరకు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగారు. ఎన్నికల సమయంలో అప్పగించిన బాధ్యతల్ని ఇతర జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించారు. పార్టీకి విధేయుడిగా ఉండటంతో పాటు మానకొండూర్‌ నియోజకవర్గంలో తెరాస గెలుపునకు తనవంతు కృషి చేశారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు ముఖ్యనేతలందరి నమ్మకం నిలబెడుతానని జీవీ రామకృష్ణారావు అన్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఆయన్ని అభినందించారు.


తెరాస జిల్లా సారథిగా విద్యాసాగర్‌రావు

జగిత్యాల, న్యూస్‌టుడే: తెరాస జిల్లా అధ్యక్షుడిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం తొలిసారి పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త జిల్లా జగిత్యాల అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావు పేరు ఖరారు చేశారు. జిల్లా అధ్యక్ష పదవికి పలువురు తమ ప్రయత్నాలు సాగించినప్పటికీ నమ్మకం, అనుభవం, ప్రజల్లో పట్టు తదితర అంశాలను లెక్కలోకి తీసుకుని విద్యాసాగర్‌రావుకు పట్టం కట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్రమంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు సైతం విద్యాసాగర్‌రావు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటారని నిర్ణయం తీసుకున్నారు. మల్లాపూర్‌ మండలం రాఘవపేట గ్రామానికి చెందిన కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మెట్‌పల్లిలో స్థిరపడ్డారు. 2002లో తెదేపా తరఫున ఇబ్రహీంపట్నం జడ్పీటీసీగా గెలుపొందారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా ఆర్టీసీ కరీంనగర్‌ రీజనల్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. 1998లో మెట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. 1999 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందారు. ఆ ఎన్నికల్లో విద్యాసాగర్‌రావుకు విమానం గుర్తు రాగా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓ స్వతంత్ర అభ్యర్థికి విమానం గుర్తు వచ్చింది. విద్యాసాగర్‌రావు కంటే లోక్‌సభ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు లభించి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2004లో తెదేపా తరఫున పోటీ చేసి మరోసారి ఓటమి చెందాడు. అనంతరం తెరాసలో చేరి 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తూ వస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి మెట్‌పల్లి ఖాదీబోర్డు సభ్యుడిగా ఉండగా, గత సంవత్సరం ఖాదీ బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల విద్యాసాగర్‌రావుకు తితిదే సభ్యుడిగా అవకాశం కల్పించగా తాజాగా తెరాస జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.

నమ్మకాన్ని నిలబెడతా

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనపై నమ్మకంతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేశారని ఇందుకు కృతజ్ఞతగా ఉంటానని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను గెలిపించడమే తనముందున్న కర్తవ్యమని విద్యాసాగర్‌రావు చెప్పారు.


ఉద్యమ నేతకు గులాబీ పగ్గాలు
తెరాస సారథిగా కోరుకంటి చందర్‌

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: గోదావరిఖని, న్యూస్‌టుడే: ఉద్యమ నాయకుడి చేతికి గులాబీ పార్టీ పగ్గాలు వచ్చాయి. తెరాస జిల్లా అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. గతంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఊషన్నపల్లికి చెందిన ఈద శంకర్‌రెడ్డి పని చేయగా దాదాపు నాలుగేళ్ల అనంతరం కొత్త జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేశారు.

తెరాస జిల్లా అధ్యక్ష పదవిని చాలా మంది నాయకులు ఆశించగా అనూహ్యంగా ఎమ్మెల్యే చందర్‌కు అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ముందుండి పోరాడిన చందర్‌ పలుమార్లు అరెస్టు కాగా ఆయనపై పలు కేసులున్నాయి.  2009లో తెరాస అభ్యర్థిగా రామగుండం నుంచి పోటీ చేసిన చందర్‌ విజయం సాధించలేకపోయారు. 2014లో ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌(ఏఐఎఫ్‌బీ) నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2018 శాసనసభ ఎన్నికల్లో తిరిగి ఏఐఎఫ్‌బీ నుంచి బరిలోకి దిగి తెరాస అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై విజయం సాధించారు. అనంతరం తెరాసలో చేరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన క్రమంలో పెద్దపల్లికి కోరుకంటి చందర్‌ పేరును ఖరారు చేశారు. అధిష్ఠానం వద్ద విధేయుడిగా ఉండటంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండటం ఆయనకు కలిసొచ్చింది. జిల్లా అధ్యక్ష స్థానం కోసం పలువురు నాయకులు తీవ్ర ప్రయత్నాలే చేశారు. పార్టీ అధిష్ఠానం మెప్పు పొందేందుకు మూడు నియోజకవర్గాల నుంచి కొందరు యత్నించారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్‌ మాత్రం తనదైన శైలిలో అధ్యక్షులను ఎంపిక చేశారు.  

పార్టీ బలోపేతానికి సమన్వయంతో పని చేస్తా: కోరుకంటి చందర్‌, ఎమ్మెల్యే

నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ జిల్లా అధ్యక్ష బాధ్యతను అప్పగించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తా. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచనలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సహకారంతో తెరాస బలోపేతానికి కృషి చేస్తాను. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాను.


ఆగయ్యకే పార్టీ పగ్గాలు తెరాస జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: ఉత్కంఠ వీడింది.. అంతా ఊహించినట్లుగానే తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ అధ్యక్షపదవి తోట ఆగయ్యను (51) వరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావం నుంచి పార్టీ ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూది.. ఉద్యమ పోరును రగిలించడమే కాదు. తెరాస ఆవిర్భావం నుంచి సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీకి అండగా నిలిచారు. గణతంత్ర దినోత్సవం రోజున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా అధ్యక్షుల ఎంపిక జాబితాను విడుదల చేశారు. ఇందులో జిల్లా నుంచి తోట ఆగయ్యకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. డిసెంబరు 2012 నుంచి ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఈద శంకరెడ్డి కొనసాగుతూ వచ్చారు. జిల్లా ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లాలకు సారధులను నియమించడం ఇదే ప్రథమం.విద్యార్థి దశలోనే విప్లవ అనుబంధ సంఘాలు (పీడబ్ల్యూజీ)లతో 1991-93 మధ్య పనిచేశారు.

ప్రజాప్రతినిధిగా..

1995లో ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచిగా ఎన్నిక.. 2001లో తెరాస పార్టీ నుంచి ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2006లో తెరాస పార్టీ నుంచి రెండోసారి ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ గెలుపొందారు. అదే సంవత్సరం తర్వాత వచ్చిన సర్పంచి ఎన్నికల్లో ఎంపీటీసీకి రాజీనామాచేసి సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. 2014లో తెరాస పార్టీ నుంచి ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీగా గెలుపొందారు. ఈయనది మున్నూరుకాపు సామాజిక వర్గం. స్వస్థలం ఎల్లారెడ్డిపేట, భార్య ముస్తాబాద్‌ గ్రామంలోని కేజీబీవీలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. కూతురు, కూమారుడు చదువుకుంటున్నారు.


పార్టీ బలోపేతానికి కృషి
-ఆగయ్య, తెరాస జిల్లా అధ్యక్షుడు

విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై అనుభవం ఉంది. పలుమార్లు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధిగా పనిచేశాను. గ్రామ నుంచి జిల్లా వరకు అందరిని సమన్వయం చేసుకుని వెళ్లే అనుభవం ఉంది. పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికి అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని