logo

చిన్న పంచాయతీలపై ఆర్థిక భారం

పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణకు రాష్ట్ర సర్కారు ఇచ్చిన ట్రాక్టర్లు చిన్న పంచాయతీలకు భారంగా తయారయ్యాయి. ప్రతి నెలా బ్యాంకుల్లో వాయిదాలు చెల్లించడం కష్టంగా మారుతోందని పలువురు సర్పంచులు వాపోతున్నారు. పెద్ద పంచాయతీలు ఏదో రకంగా చెల్లిస్తుండగా చిన్న పంచాయతీల

Published : 29 Sep 2022 04:53 IST

ట్రాక్టర్ల నిర్వహణ కష్టమే
కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే


పంచాయతీలో మొక్కలకు నీరు పడుతున్న దృశ్యం

పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణకు రాష్ట్ర సర్కారు ఇచ్చిన ట్రాక్టర్లు చిన్న పంచాయతీలకు భారంగా తయారయ్యాయి. ప్రతి నెలా బ్యాంకుల్లో వాయిదాలు చెల్లించడం కష్టంగా మారుతోందని పలువురు సర్పంచులు వాపోతున్నారు. పెద్ద పంచాయతీలు ఏదో రకంగా చెల్లిస్తుండగా చిన్న పంచాయతీల పరిస్థితి దయనీయంగా తయారైంది. కేవలం 15వ ఆర్థిక సంఘం నిధులు తప్ప మరో అవకాశం లేదని, అభివృద్ధి కోసం వచ్చిన నిధుల్లో పనులకు కోత పెట్టుకొని మరీ ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సర్పంచులు వాపోతున్నారు. డీజిల్‌ వ్యయం, మరమ్మతులు, రహదారి పన్నులు చెల్లించడం, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లించాల్సి ఉండటంతో చిన్న పంచాయతీల్లో వచ్చే నిధుల్లో సింహభాగం వాటికే ఖర్చవుతున్నాయి. వాహనాల కొనుగోలు సమయంలో రహదారి పన్నుల(రోడ్డు ట్యాక్స్‌) రద్దు చేయించాలని సర్పంచులు ప్రతిపాదనలు చేసినా అమలుకు నోచలేదు. ఖర్చుల భారం నుంచి పంచాయతీలను గట్టెక్కించేందుకు రాష్ట్ర సర్కారు నిధులు సమకూర్చాలనే డిమాండ్‌ ఆయా సర్పంచుల నుంచి వినిపిస్తోంది.

పన్నులు నామమాత్రమే..
చిన్న పంచాయతీల్లో వసూలయ్యే ఏడాది ఇంటి పన్ను రెండు నెలల వాయిదాలకు సైతం సరిపోవడం లేదు.తాగునీటికి మిషన్‌ భగీరథ రావడంతో నీటి పన్ను రద్దయింది. ఇక ప్రభుత్వం ఇచ్చే పల్లెప్రగతి నిధులే దిక్కుగా మారుతున్నాయి. పంచాయతీలకు వచ్చే నిధులు ఏడాదికి రూ.15 లక్షల వరకు ఉంటుంది. వాటిలో ట్రాక్టర్ల ఈఎంఐలు, మరమ్మతులు, డీజిల్‌ కోసం ప్రతి ఏటా రూ.6.50 లక్షల వరకు ఖర్చవుతోంది. వచ్చే నిధుల్లో సగం ట్రాక్టర్‌ నిర్వహణకే సరిపోతే గ్రామాభివృద్ధి పనులను చేయడం ఎలా అన్న ఆందోళనలో మెజారిటీ సర్పంచుల్లో వ్యక్తమవుతోంది.

కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని ఓ చిన్న పంచాయతీలో ఇలా..
* ట్రాక్టరు నెల వాయిదాలు : రూ.15,000
* పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.17,000
* ట్రాక్టరు మరమ్మతులు రూ.2,500
* డీజిల్‌ ఖర్చు రూ.8,000
* నెలకు అయ్యే ఖర్చు రూ.42వేలు
* వచ్చే నిధులు నెలకు రూ.85 వేలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని