logo

Vemulawada: పద్మవ్యూహాన్ని తలపిస్తున్న వేములవాడ

ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలో రోడ్లు పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి.

Updated : 09 Feb 2024 08:38 IST

రహదారుల విస్తరణతోనే సమస్యకు పరిష్కారం

వేములవాడ పట్టణంలోని రహదారిపై రద్దీ

న్యూస్‌టుడే, వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలో రోడ్లు పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి. ఏ మార్గంలో వెళ్లినా ఎక్కడ ట్రాఫిక్‌లో చిక్కుకుంటామో తెలియని పరిస్థితి ఇటు భక్తులను, అటు పట్టణవాసులను నిత్యం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో రోజూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వేలాదిగా తరలి వస్తుంటారు. ఇందులో ఎక్కువగా ఆటోలు, ఇతర వాహనాల్లో వస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో భారీ సంఖ్యలో రావడం జరుగుతుంది. వీరంతా బస్సు దిగి ఉచిత బస్సు, ఆటోల్లో ఆలయానికి చేరుకుంటారు. స్వామివారి దర్శనానంతరం వీరంతా ఆలయ పరిసర వీధుల్లోకి వస్తుంటారు. దీంతో ఆలయ పరిసర రహదారులు పద్మవ్యూహాన్ని తలపిస్తుంటాయి. మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులు ముందుగా రాజన్న దర్శనానికి వస్తున్నారు. రోజూ వేలాదిగా భక్తులు తరలి రావడంతో వందలాది వాహనాలు వస్తున్నాయి. దీంతో ఆలయ పరిసర వీధులు ఆటోలు, ఇతర వాహనాలతో పాటు కాలినడకన ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే వారితో రద్దీగా మారుతున్నాయి. కొందరు పార్కింగ్‌ స్థలంలో వాహనాలు నిలపకుండా ఆలయ పరిసరాలకు తీసుకురావడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనాలు ఎటూ వెళ్లలేని పరిస్థితి భక్తులను, స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రతిపాదనలకు ఆమోదం లభించక..

స్వామివారి దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు తరలి రావడంతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు ఆలయ పరిసర రహదారులను విస్తరించాలని అధికారులు భావించారు. ఇందుకు చాలా కాలం కిందటే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించక రహదారుల విస్తరణ కాక భక్తులు, స్థానికుల కష్టాలు తొలగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో రాజన్న ఆలయం నుంచి మూలవాగు వంతెన వరకు దాదాపు 80 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరించాలని ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీటీఏడీఏ), సర్వే బృందాలు సర్వే చేశాయి. ఏ మేరకు గృహాలకు నష్టం ఏర్పడుతుందనేది గుర్తించి మార్కింగ్‌ చేశారు. రోడ్ల విస్తరణలో నష్టపోయే గృహాల యజమానులకు పరిహారం అందించేందుకు కూడా అంచనాలు సిద్ధం చేశారు. రోడ్ల విస్తరణకు దాదాపు రూ. 35 కోట్లతో అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా అనుమతి రాక పనులు ముందుకు సాగడం లేదు. దీంతో తిప్పలు తప్పడం లేదు. దీంతో చాలా మంది ఆలయం ముందు రోడ్డు నుంచి వెళ్లకుండా దూరాభారమైనప్పటికీ బైపాస్‌ రోడ్ల మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని భక్తులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.

నిధులు విడుదల కాక..

రాజన్న ఆలయం ముందు రోడ్డు విస్తరణ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఆలయం ముందు నుంచి మూలవాగు వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు సర్వే చేసి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే పనులు ముందుకు సాగడానికి అవకాశం ఉంది.

శాంతయ్య, డీఈఈ, ఆర్‌అండ్‌బీ వేములవాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని