logo

డబ్బా నీరు సురక్షితమేనా!

ప్రభుత్వ అనుమతి లేకుండా.. కనీస ప్రమాణాలు పాటించకుండా యథేచ్ఛగా నీటి శుద్ధి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌(బీఐఎస్‌) అనుమతులు పొందకుండా నీటిని విక్రయిస్తున్నారు.

Updated : 13 Apr 2024 06:08 IST

కనీస ప్రమాణాలు పాటించని నీటి శుద్ధి కేంద్రాలు

ఆటోలో తాగునీటి డబ్బాల రవాణా

న్యూస్‌టుడే, మెట్‌పల్లి, కోరుట్ల :  ప్రభుత్వ అనుమతి లేకుండా.. కనీస ప్రమాణాలు పాటించకుండా యథేచ్ఛగా నీటి శుద్ధి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌(బీఐఎస్‌) అనుమతులు పొందకుండా నీటిని విక్రయిస్తున్నారు. ఇటీవల మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లో మున్సిపల్‌ అధికారులు తనిఖీలు చేయగా మెట్‌పల్లిలో కేవలం ఒక ప్లాంటుకే అనుమతి ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఒకవైపు నీరు సురక్షితమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు శుద్ధికేంద్రాల నీరు తాగేదుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని పదుల సంఖ్యలో నీటిశుద్ధికేంద్రాలు వెలుస్తున్నాయి. వీటితో పాటు నీటిని విక్రయించే దుకాణాలు వీధికొకటి ఉంది. 20 లీటర్ల సాధారణ డబ్బా నీటిని రూ.10, చల్లని నీటిని రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రూ.5కే నింపుతున్నారు. కోరుట్లలో సుమారు 40 వరకు నీటి శుద్ధి ప్లాంట్లు ఉండగా ఒక్కదానికి అనుమతులు లేవు. మెట్‌పల్లిలో అయిదారు నీటి శుద్ధి ప్లాంట్లతో పాటు నీటిని విక్రయించే దుకాణాలు 30 వరకు ఉన్నాయి. వీటిలో ఒక్క దానికి మాత్రమే ఐఎస్‌ఐ లైసెన్సు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పల్లెల్లో సైతం ఊరికొక నీటి శుద్ధి కేంద్రం ఉంది.

నిబంధనలిలా..

ప్రతి నీటిశుద్ధి ప్లాంటుకు బీఐఎస్‌ ధ్రువపత్రం ఉండడంతో పాటు ట్రేడ్‌ లైసెన్సు, ఆహార కల్తీ నియంత్రణ, తూనికల, కొలతల శాఖ అనుమతి తప్పనిసరి. నీటి నాణ్యత ప్రమాణాలు పరిశీలించేందుకు ప్రయోగశాల, పరిశుభ్రత పాటించాలి. వాల్టా చట్టం కింద రెవెన్యూ, భూగర్భ జలవనరుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. పరికరాలను నిబంధనల ప్రకారం ఉపయోగించాలి. నీటిని నింపే డబ్బాలను క్రమం తప్పకుండా శుద్ధిచేయాలి. నిర్ణీత మోతాదులో మినరల్‌్్స ఉండేలా చూసుకోవాలి. ఇందుకు మైక్రోబయాలజీ, కెమిస్టు నిపుణులను నియమించుకోవాలి.

పట్టించుకునేదెవరు?

వేసవి కావడంతో శుద్ధికేంద్రాల్లో నీటి విక్రయాలు జోరందుకున్నాయి. శుభకార్యాలకు సైతం నీటి వినియోగం పెరుగుతోంది. మున్సిపల్‌, పంచాయతీ, రెవెన్యూ, భూగర్భ జలవనరుల శాఖ, ఆహార కల్తీ నియంత్రణ, తూనికల, కొలతల శాఖలు శుద్ధి కేంద్రాల విషయంలో పర్యవేక్షణ చేయాల్సి ఉండగా, తనిఖీలు పూర్తిస్థాయిలో జరపకపోవడం వల్ల నీటి శుద్ధి కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ప్లాంట్ల నిర్వాహకులు నిబంధనలకు తిలోదకాలిస్తుండగా, పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి శుద్ధి కేంద్రాలు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మెట్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ మోహన్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా మెట్‌పల్లిలో ఇటీవల తనిఖీలు చేయగా ఒక్క నీటి శుద్ధి ప్లాంటుకే ఐఎస్‌ఐ లైసెన్సు ఉన్నట్లు గుర్తించామన్నారు. నిబంధనలు పాటించని కొన్ని ప్లాంట్లకు జరిమానా విధించామని, నిర్వాహకులు లైసెన్సు కలిగి ఉండాలని చెప్పామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని