logo

నిధులున్నా ప్రారంభం కాని పనులు

గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

Published : 23 Apr 2024 02:05 IST

అటవీశాఖ అనుమతి రాక నిలిచిన రోడ్డు నిర్మాణం

మరిమడ్ల-మానాల రహదారి దుస్థితి

న్యూస్‌టుడే, కోనరావుపేట: గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇది జరిగి ఏడాది అవుతున్నా పనులకు మోక్షం లభించటం లేదు. అటవీశాఖ నుంచి అనుమతి రాక పనులు సాగని దుస్థితి నెలకొంది. దీంతో మూడు జిల్లాల ప్రజలకు రవాణా కష్టాలు తీరడం లేదు.

రాజన్న సిరిసిల్ల జిల్లా మరిమడ్ల- నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పేట మండలం మానాల, గిరిజన గ్రామాలను అనుసంధానం చేసి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ప్రభుత్వం సుమారు 5 కిలో మీటర్ల తారు రోడ్డుకు రోడ్లు, భవనాల శాఖ నిధులు రూ. 9 కోట్లను ఏడాది క్రితం మంజూరు చేసింది. దీంతో పనులు చేపట్టడానికి అధికారులు గుత్తేదారును ఖరారు చేశారు. అయితే పనులు మాత్రం ఏడాదిగా ప్రారంభం కాలేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు అటవీప్రాంతం మీదుగా మట్టి రోడ్డుపై ద్విచక్రవాహనాలు, కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైతే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. దీంతో సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి చేస్తే ప్రయోజనం ఇలా...

తారు రోడ్డు నిర్మాణంతో మూడు జిల్లాల వారికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలగనున్నది. వాహనదారుల కష్టాలు కూడా తీరనున్నాయి. గతంలో జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపో అధికారులు రుద్రంగి, మానాల, మరిమడ్ల, వీర్నపల్లి మండల కేంద్రం మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం వరకు బస్సులు నడిపేవారు. దశాబ్ద కాలంగా బస్సులు తిరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పక్కా రహదారి ఏర్పాటైతే మరిమడ్లలోని ఏకలవ్య గిరిజన ఆదర్శ పాఠశాలకు బస్సు సౌకర్యం కలగనున్నది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. మూడు జిల్లాల గ్రామీణ, గిరిజన గ్రామాల అభివృద్ధికి బాటలు పడనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులు, కూరగాయలను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా రైతులు ఆర్థికంగా బలపడటానికి దోహదపడుతుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు దృష్టిసారించి సకాలంలో తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

త్వరలో  ప్రారంభం

తారు రోడ్డు పనులు చేపట్టడానికి గుత్తేదారును ఖరారు చేశాం. పనులు అటవీ ప్రాంతం మీదుగా చేపట్టాల్సి ఉండటంతో అటవీశాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టమైన హామీ వచ్చే అవకాశం ఉంది. పనులు చేపట్టడానికి గుత్తేదారు యంత్రాలు, సామగ్రిని తరలించారు. మరిమడ్లకు చెందిన పలువురి రైతుల వరి పొలాలు కోతకు వచ్చాయి. వారు వారం రోజులు గడువు కోరారు. పది రోజుల్లో పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. 

సతీశ్‌, ఏఈ, ఆర్‌అండ్‌బీ, కోనరావుపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని