logo

బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తారా.. ఇవ్వరా?

Published : 05 May 2024 04:50 IST

భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

వీర్నపల్లిలో మాట్లాడుతున్న కేటీఆర్‌

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: సిరిసిల్ల నేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తారా, ఇవ్వరా చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రశ్నించారు. శనివారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా కాంగ్రెస్‌ పాలన కొనసాగుతుందని విమర్శించారు. కేసీఆర్‌ ఏం చేస్తే దానికి వ్యతిరేకంగా చేయాలన్న ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారని ఆరోపించారు. సిరిసిల్ల నేతన్నల కోసం కేసీఆర్‌ 3 వేల కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సిరిసిల్ల నేతన్నలను ఆదుకుంటారా, వారు చనిపోతుంటే చూస్తుంటారా చెప్పాలన్నారు. సిరిసిల్ల పర్యటనలో రేవంత్‌రెడ్డి సాగు, తాగు నీటి వనరులపై ఒక్కమాట కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు. ఊసరవెల్లి రంగులు మార్చుతుంటే రేవంత్‌రెడ్డి తారీఖులు మార్చుతున్నారని, డిసెంబర్‌ 9 రుణమాఫీ అని చెప్పి, మళ్లీ ఆగస్టు 15 అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సమావేశంలో భారాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు రమాకాంత్‌రావు, లక్ష్మీనారాయణ, అగ్గి రాములు, మల్లారెడ్డి, పడిగెల రాజు తదితరులు పాల్గొన్నారు.

బంజారా భాష నేర్చుకుంటా...

నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నా నాకు బంజారా భాష రాదని చమత్కరించారు. మళ్లీ వచ్చినప్పుడు ‘గోర్‌’ (బంజారా) భాషలో మాట్లాడుతానని కేటీఆర్‌ చెప్పారు. అవసరమైతే మీతో శిక్షణ తీసుకుంటాననడంతో సభికులు ఈలలు వేశారు. కాంగ్రెస్‌, బీఎస్పీకి చెందిన పలువురు కేటీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. యువకులు సెల్ఫీలు దిగారు. పలువురు సమస్యలపై ఆయనకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య ఛైర్మన్‌ రవీందర్‌రావు, మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కళ, సెస్‌ డైరెక్టర్‌ మల్లేశం, జడ్పీటీసీ సభ్యురాలు కళావతి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు చాంద్‌పాషా, ఎంపీపీ భూల, నాయకులు పాల్గొన్నారు.

నావైపు చిన్నచిన్న పొరపాట్లు

వీర్నపల్లి: భారాస అధికారంలో ఉండగా మంత్రి పదవికే సమయం కేటాయించాల్సి వచ్చిందని, పార్టీ కార్యక్రమాలకు కేటాయించలేకపోయానని కేటీఆర్‌ పేర్కొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో శనివారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నావైపు చిన్నచిన్న పొరపాట్లు ఉన్నాయన్నారు. ఎన్నికలు ముగిసిన పక్షం రోజుల్లో రంగంపేట భూములకు సంబంధించిన హక్కు పత్రాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. అడవిపదిరలో పోడు భూముల విషయంలో అధికారుల వేధింపులతో గ్రామస్థులు బాధపడ్డారని చెప్పారు. అయిదేళ్లలో భాజపా ఎంపీ బండి సంజయ్‌ నియోజకవర్గంలో చేపట్టిన పనులు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఇతర మండలాలతో పోలిస్తే వీర్నపల్లిలో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని