logo

ఇంటింటికి ఓటర్‌ చీటీల పంపిణీ

నెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ఇవ్వగా, పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేశారు.

Published : 05 May 2024 04:53 IST

పోలింగ్‌ కేంద్రం సూచించే మ్యాప్‌
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సుభాష్‌నగర్‌

ఓటరు చీటీలను పంపిణీ చేస్తున్న మెప్మా ఉద్యోగినులు

ఈనెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ఇవ్వగా, పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేశారు. ఆ తర్వాత ఓటర్ల కోసం ఓటరు సమాచార చీటీలను పంపిణీ పూర్తి చేసేలా కార్యాచరణ తీసుకున్నారు. ఇంటింటికీ పోల్‌ చీటీలను పంపిణీ చేసేందుకు బూత్‌ లెవల్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా నగరపాలక ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లు, రీసోర్స్‌ పర్సన్లు (ఆర్‌పీలు), వార్డు అధికారులు, బిల్‌కలెక్టర్లు, గ్రామ కార్యదర్శులు వీటిని పంపిణీ చేయడంలో నిమగ్నమయ్యారు.

సులువుగా చేరుకోవడానికి..

ఓటర్‌ సమాచార చీటీలో పోలింగ్‌ స్టేషన్‌కు సులువుగా చేరుకోవడానికి వీలుగా ఓటర్‌ స్లిప్‌పై దారి చూపించేలా గూగుల్‌ మ్యాప్‌ ముద్రించారు. దాంతో ఆ ప్రాంతంలో నివసించే వారికి, అడ్రస్‌ మారి ఇతర చోట నుంచి పోలింగ్‌ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చే వారికి పోలింగ్‌ కేంద్రం గుర్తు పట్టేందుకు వీలుగా ఉంటుంది. పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి బూత్‌ స్థాయి అధికారి పేరు, మొబైల్‌ నంబర్‌ ముద్రించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ జరుగుతుందని, ఓటరు తెలుసుకోవాల్సిన నిబంధనలు అందులో వివరించారు. ఓటరు చీటీతో పాటు ఎన్నికల సంఘం పేర్కొన్న 12రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒకటి తీసుకురావాలని సూచించారు.

కేంద్రాల్లోనే బీఎల్వోలు

పోలింగ్‌ తేదీ దగ్గరికి వస్తుండగా సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఓటర్‌ సమాచార చీటీలను అందించి సంతకాలు తీసుకుంటున్నారు. వీరు వెళ్లే సమయంలో ఓటర్లు అందుబాటులో లేకపోతే పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రంలోనే బీఎల్వోలు అందుబాటులో ఉంటారు. అక్కడ కూడా ఓటరు కార్డు చూపించి పోల్‌ స్లిప్‌ పొందే వీలుంది. ఓటరు జాబితాలో పేరుంటే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు.

తప్పని సమస్యలు

ఓటరు జాబితా మాదిరిగానే ఓటరు సమాచార చీటీ కూడా గందరగోళంగా ఉంటుంది. ఓటరు ఫోటో, ఇంటినంబర్‌ ముద్రించకపోవడం, అక్షరాలు చిన్నగా ఉండటంతో బూత్‌ స్థాయిలో పంపిణీకి ఇబ్బందులు వస్తున్నాయి. ఓటరుజాబితాలో ఎపిక్‌ సంఖ్య ద్వారా పోల్‌ చీటీపై ఇంటినంబర్లు బీఎల్వోలు రాసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త ఓటర్లు ఏ ఇంటిలో ఉంటారనే విషయం బూత్‌ లెవల్‌ స్థాయిలో కూడా తెలియడం లేదు. దీనికి తోడు ఎండలు మండుతుండటంతో పంపిణీ చేసేందుకు ఆలస్యమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని