logo

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇష్టం లేదా?

కరీంనగర్‌ ఎంపీలుగా బోయినపల్లి వినోద్‌కుమార్‌, బండి సంజయ్‌లు నియోజకవర్గానికి చేసిందేమి లేదని,

Published : 06 May 2024 06:34 IST

హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న మంత్రి ప్రభాకర్‌, చిత్రంలో అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు

హుజూరాబాద్‌ గ్రామీణం, పట్టణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ ఎంపీలుగా బోయినపల్లి వినోద్‌కుమార్‌, బండి సంజయ్‌లు నియోజకవర్గానికి చేసిందేమి లేదని, తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు కనిపిస్తున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా మంత్రి ఆదివారం హుజూరాబాద్‌లోని బృందావన్‌ చౌరస్తాలో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించటం ఇష్టం లేదా అని కేసీఆర్‌ని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను అమలు చేస్తుందన్నారు. కేసీఆర్‌ దిల్లీకి పోతే తెలంగాణ రాలేదని, సోనియాగాంధీతోనే వచ్చిందని గుర్తు చేశారు. తమ పార్టీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించిన తర్వాత నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థి రాజేందర్‌రావు మాట్లాడుతూ కరీంనగర్‌ నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబమేనని.. తాను సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. గతంలో భారాస, భాజపా అభ్యర్థులకు అవకాశాలిచ్చారని, ఇప్పుడు తనకు ఇవ్వాలని ఓటర్లను కోరారు. పార్టీ నియోజకవర్గ బాధ్యుడు వొడితల ప్రణవ్‌ మాట్లాడుతూ ఎంపీగా బండి సంజయ్‌ ఇల్లందకుంట, వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి ఏమైనా నిధులు తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే యువతకు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా దరువు ఎల్లన్న ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చెల్పూరుకు చెందిన నాయకుడు మహేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పలువురు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతకముందు పరకాల అడ్డదారి చెక్‌పోస్టు వద్ద మంత్రి వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. నాయకులు సమ్మిరెడ్డి, స్వామిరెడ్డి, బాబు, పుష్పలత, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

నా బలం.. బలగం. కరీంనగర్‌ ప్రజలు

కరీంనగర్‌ పట్టణం : తన బలం..బలగం..కరీంనగర్‌ ప్రజలేనని తన విజయాన్ని ఎవరూ ఆపలేరని కరీంనగర్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. ఆదివారం నగరంలో ముఖ్యులను కలిసి తనను ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. తన స్థానికతపై మాట్లాడే అర్హత ఎంపీ బండి సంజయ్‌కు లేదన్నారు. భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ చెప్పే మాటలలో అర్థం లేదని ఖండించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని