logo

ఆటలు ఆడుకోవాలని ఉంది!

‘వేసవి సెలవుల్లో ఆడుకోవాలని తహతహలాడాం. మా తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకున్నాం. కరీంనగర్‌ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా అంబేడ్కర్‌ స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహించేవారు.

Published : 06 May 2024 06:40 IST

వేసవి శిబిరాలు నిర్వహించాలని నగర బాలల వేడుకోలు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ క్రీడావిభాగం: ‘వేసవి సెలవుల్లో ఆడుకోవాలని తహతహలాడాం. మా తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకున్నాం. కరీంనగర్‌ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా అంబేడ్కర్‌ స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహించేవారు. ఈ ఏడాది వాటి ఊసే లేదు. సంబంధిత టెండర్‌ పనులు జరగలేదని తెలిసింది. మే 1 నుంచే క్రీడా శిబిరాలు ప్రారంభం కాకపోవడంతో నిరుత్సాహంతో ఉన్నాం. పొరుగు జిల్లాలైన సిరిసిల్ల,  వరంగల్‌లో మొదలుకాగా.. మా కరీంనగర్‌లో మాత్రం షురూ కాలేదు.’ కరీంనగర్‌ నగర బాలల ఆవేదన ఇది.  ఇంకా ఏం అనుకుంటున్నారో వారి మాటల్లోనే..

2017లో ప్రారంభం

వేసవి సెలవుల్లో మేము టీవీలు, చరవాణులకు బానిసలు కాకుండా క్రీడలపై ఆకర్షితులను చేయాలనే ఉద్దేశంతో 2017లో అప్పటి కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ కె.శశాంక ప్రత్యేక చొరవతో జిల్లాలోని క్రీడా సంఘాలు, స్పోర్ట్స్‌ అథారిటీ సమన్వయంతో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌ కార్పొరేషన్లు మాత్రమే ఈ శిబిరాలను నిర్వహిస్తుండగా.. 2017 నుంచి కరోనా సమయంలో మినహా ఏటా కరీంనగర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరాలకు జిల్లాకేంద్రం, శివారు గ్రామాల పిల్లలు భారీగా తరలివచ్చి శిక్షణ పొందేవారు.

ఈ ఏడాది నిరీక్షణ

నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని సుమారు 2500 మంది చిన్నారులు ఏటా నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు హాజరయ్యే వారు. శిక్షణ ఇచ్చేందుకు సుమారు 50 నుంచి 70 మంది కోచ్‌లను క్రీడాశాఖ ఎంపిక చేసేది. కోచ్‌లు నెల రోజుల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, విలువిద్య, బ్యాడ్మింటన్‌, బేస్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, చదరంగం, క్రికెట్‌, సైక్లింగ్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, తైక్వాండో, జూడో, కరాటే, కిక్‌ బాక్సింగ్‌, స్కేటింగ్‌, వాటర్‌స్పోర్ట్స్‌, రెజ్లింగ్‌, సాఫ్ట్‌బాల్‌, వుషు, యోగా, షూటింగ్‌ బాల్‌, రైఫిల్‌ షూటింగ్‌ నేర్పించేవారు. మాకు ఆసక్తి ఉన్న ఆటను నేర్చుకునే వాళ్లం. శిక్షణ అనంతరం మాకు ప్రశంసాపత్రాలు కూడా ఇచ్చేవారు.

మాకు ఓట్లు ఉంటే ఇలాగే ఉండేదా?

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల సమయం.. అధికారులందరూ ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యారు. ప్రజాప్రతినిధులు, నాయకులు తమ అభ్యర్థి గెలుపు కోసం ఇల్లిల్లు తిరుగుతున్నారు. మా అమ్మానాన్నలకు అది చేస్తాం.. ఇది చేస్తామని హామీలు ఇస్తున్నారు. మమ్మల్ని మాత్రం పట్టించుకోవడంలేదు. మాకు ఓటు హక్కు ఉంటే ఇలాగే ఉండేదా?

మంత్రికి విన్నపం

కరీంనగర్‌లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ఇటీవల మా తరఫున జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను వినతిపత్రం అందించింది. అంబేడ్కర్‌ స్టేడియంలో ఏటా నిర్వహిస్తున్న శిబిరాలను యథావిధిగా నిర్వహించాలని ఏప్రిల్‌ 17న ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ కోశాధిÅకారి, అంతర్జాతీయ యోగా స్వర్ణపతక విజేత నాగిరెడ్డి సిద్ధారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, మేయర్‌, కలెక్టర్‌ చొరవ తీసుకొని శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

క్రీడా సామగ్రి కొరత

కరీంనగర్‌ బల్దియా ఆధ్వర్యంలో 2023 మే 5 నుంచి జూన్‌ 7 వరకు నిర్వహించిన క్రీడా శిబిరంలో శిక్షణ ఇచ్చిన గురువులకు ఇప్పటికీ వేతనాలు చెల్లించలేదని తెలిసింది. వారికి వేతనాలు చెల్లిస్తే ఈసారి నేర్పించడానికి ఉత్సాహంగా ముందుకొస్తారు. గత ఏడాది క్రీడా సామగ్రి కొంత మేరకు మాత్రమే అందుబాటులో ఉంది. కొంత కొత్త సామగ్రి కొనిస్తే బాగుంటుంది. గతేడాది నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గుడ్డు, అరటిపండు, తాగునీరు, పాలు పెట్టేవారు. ఈసారి నగర పాలక సంస్థ చొరవ చూపితే క్రీడా శిక్షణ శిబిరానికి దారులు తెరుచుకుంటాయి.  పెద్దలూ ఇకనైనా మా వినతిని విని.. ఆటలు ఆడుకునే సదుపాయం కల్పించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని