logo

ఇలాగైతే ఓటేసేదెలా?

సినిమా థియేటర్‌లో సీట్ల సంఖ్యను బట్టి టిక్కెట్లు విక్రయిస్తారు. ప్రేక్షకుల్లో ఆదరణను అంచనా వేస్తూ అదే సినిమాను రెండు, మూడు థియేటర్లలోనూ ఆడిస్తారు.

Updated : 07 May 2024 06:03 IST

ప్రత్యేక రైళ్లతోనే వలస జీవులకు వెసులుబాటు

ప్రయాణ కష్టాలు తీరిస్తేనే పెరగనున్న పోలింగ్‌ శాతం

పెద్దపల్లిలో భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ వద్ద ప్రయాణికుల రద్దీ

న్యూస్‌టుడే, పెద్దపల్లి: సినిమా థియేటర్‌లో సీట్ల సంఖ్యను బట్టి టిక్కెట్లు విక్రయిస్తారు. ప్రేక్షకుల్లో ఆదరణను అంచనా వేస్తూ అదే సినిమాను రెండు, మూడు థియేటర్లలోనూ ఆడిస్తారు. ఆర్టీసీ అధికారులు కూడా రద్దీని బట్టి అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు నడిపిస్తుంటారు. కానీ రైలు ప్రయాణం మాత్రం ఇందుకు భిన్నం. ఎంత మంది ప్రయాణికులున్నా, ఏ సీజన్‌ అయినా అవే రైళ్లు, అవే బోగీలు.

 అపరిమితంగా అమ్మే టిక్కెట్లతో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేని బోగీలో ప్రయాణించే పరిస్థితి మన భారతీయ రైల్వేలోనే కనిపిస్తుంది. మరుగుదొడ్లలోనూ కూర్చొని వెళ్లాల్సిన దుస్థితి. విద్యుద్దీకరణ జరగడంతో బోగీపై కూర్చునే పరిస్థితి మాత్రం తప్పింది. బోగీ లోపల కాలు పెట్టేంత స్థలం కూడా ఉండటం లేదు. కిక్కిరిసిన బోగీలోనే వందలాది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి లోక్‌సభ సభ్యులు చొరవ చూపాల్సి ఉంటుంది. దశాబ్దాల తరబడి వెంటాడుతున్న ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వే శాఖ ప్రయత్నించకపోవడంతో ఏటికేడు సమస్య తీవ్రమవుతోంది.

ఏక కాలంలో ప్రయాణాలతో..

ఉమ్మడి జిల్లాలో వివిధ రంగాల్లో స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ కార్మికులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది పని చేస్తున్నారు. వీరంతా ఇక్కడే శాశ్వత ఉపాధి పొందుతున్నారు. ఇటుక బట్టీలు, వ్యవసాయ పనులకు వచ్చే సీజనల్‌ కూలీలు వేలల్లో ఉంటారు. వీరు తరచూ స్వస్థలాలకు వెళ్లి వస్తుంటారు. ఇందుకోసం రైలు టికెట్లను రిజర్వు చేసుకుంటారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయడానికి వలస కూలీలు ఏకకాలంలో వెళ్లాల్సి రావడంతో రద్దీ కష్టాలు తప్పేలా లేవు. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉమ్మడి జిల్లాలో అధికంగా ఉన్నారు. మహారాష్ట్ర, యూపీ, ఎంపీలలో మొదటి రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. ఈ నెల 7న మూడో విడత పోలింగ్‌ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో మూడో విడతలో, మధ్యప్రదేశ్‌లో 3, 4, మహారాష్ట్రలో 3, 4, 5 విడతల్లో పోలింగ్‌ జరగనుంది. మిగిలిన రాష్ట్రాల్లో 4, 5, 6, 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాలకు వెళ్లే కూలీలను ప్రయాణ కష్టాలు వెంటాడుతున్నాయి.

బోగీల సంఖ్య పెంచితేనే ఉపశమనం

  • పెద్దపల్లి స్టేషన్‌ నుంచి నవజీవన్‌, దానాపూర్‌, జీటీ, దక్షిణ్‌, రాయ్‌పూర్‌, పాట్నా, రక్సోల్‌ తదితర ఎక్స్‌ప్రెస్‌లు రాకపోకలు సాగిస్తున్నాయి. ముందస్తు రిజర్వేషన్లుంటే తప్ప వీటిలో సీటు దొరకని పరిస్థితి. ఈ ఎక్స్‌ప్రెస్‌లలో సగం వరకు జనరల్‌ బోగీలు వేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. ఇటీవల ప్రవేశపెట్టిన వేసవి ప్రత్యేక రైళ్లతో కొంత ఉపశమనం కలగనుంది.
  • ఉమ్మడి జిల్లాకు చెందిన వందలాది మంది మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఉపాధి పొందుతున్నారు. వీరందరికీ స్వగ్రామాల్లో ఓటు హక్కుంది. ఇందులో చాలా మంది రైళ్ల కంటే బస్సు ప్రయాణాన్నే నమ్ముకుంటున్నారు. ఇటీవల ముంబాయి నుంచి కరీంనగర్‌కు ప్రవేశపెట్టిన వేసవి ప్రత్యేక రైలును ఎన్నికల కోసమైనా ప్రతి రోజు నడిపిస్తే కొంత ప్రయోజనం కలుగుతుంది.
  • తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న జరిగే నాలుగో విడత పోలింగ్‌ కోసం ఇక్కడ పని చేసే వారు అటు వెళ్లడానికి, అక్కడ ఉపాధి పొందుతున్న వారు ఇటు రావడానికి కూడా రైలు కష్టాలు తప్పడం లేదు. రెండు రాష్ట్రాలకు కాజీపేట కూడలిగా ఉంటోంది. ఇక్కడి నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు, అటు నుంచి వచ్చే రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి వస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు ద.మ.రై. ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

    రిజర్వు చేసుకున్న వారికీ అవస్థలే..

రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో రిజర్వు బోగీల్లోనూ ప్రయాణికులు ఎక్కి సీట్లను ఆక్రమించుకుంటున్నారు. దీంతో ముందస్తు రిజర్వు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా స్పందించడం లేదు.
- కె.శ్రావణ్‌, ద.మ.రైల్వే డీఆర్‌యూసీసీ సభ్యుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని