logo

కన్నడనాట ప్రగతి కేతనం

భారత్‌లో పెట్టుబడులు పెట్టాలన్న విదేశీ సంస్థలకు నేడు కర్ణాటక తొలి ప్రాధాన్యంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

Published : 07 Feb 2023 01:48 IST

పెట్టుబడిదారుల ఎంపిక కర్ణాటకనే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన

ఈ-20 ఇంధనంతో నడిచే వాహనాలకు జెండా ఊపుతున్న ప్రధాని మోదీ

ఈనాడు, బెంగళూరు : భారత్‌లో పెట్టుబడులు పెట్టాలన్న విదేశీ సంస్థలకు నేడు కర్ణాటక తొలి ప్రాధాన్యంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన సోమవారం కర్ణాటక పర్యటనలో భాగంగా బెంగళూరు, తుమకూరుల్లో భారీ ప్రాజెక్టులను ప్రారంభించారు. రక్షణ, ఇంధన రంగాల్లో భారీ ప్రాజెక్టులు ప్రారంభించగా, జలశక్తి మిషన్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇదే సందర్భంగా ఎన్‌డీఏ ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్లలో చేపట్టిన పాలన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు భారత్‌ను విశ్వవ్యాప్తంగా వికసించేలా చేస్తున్నాయన్నారు. ఇదే సందర్భంగా అమృత కాలంలో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు విపక్షాల రూపంలో విమర్శలు వచ్చినా ప్రగతితో సమాధానం ఇచ్చినట్లు ప్రకటించారు. దేశంలో చివరి మనిషి వరకు ప్రగతి ఫలాలు అందాలన్న సంకల్పంతో 2023-24 బడ్జెట్‌లో ప్రకటించిన కార్యక్రమాలను ప్రధాని పేరు పేరునా విశ్లేషించారు.

తుమకూరులో ప్రధానమంత్రికి ఎల్‌సీహెచ్‌ నమూనాను అందిస్తున్న హెచ్‌ఏఎల్‌ ప్రముఖులు

రక్షణలో ‘ఆత్మనిర్భర్‌’

బెంగళూరు నగర పరిసరాల్లోని తమకూరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పథకాలకు కేంద్రంగా మారింది. 2016లో ప్రధాని మోదీ భూమి పూజ చేసిన గ్రీన్‌ఫీల్డ్‌ హెలికాప్టర్‌ ఫ్యాక్టరీ ఏడేళ్లలోనే పూర్తికావటం విశేషం. ఈ కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ.. రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గించేందుకు ‘జాతి మొదలు’(నేషన్‌ ఫస్ట్‌) స్ఫూర్తిని నింపారు. ఆత్మనిర్భర్‌ కార్యక్రమం ద్వారా సాధిస్తున్న లక్ష్యాలకు హెలికాప్టర్‌ ఫ్యాక్టరీ నిదర్శనమని ప్రకటించారు. ఈ ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ సంస్థల్లో చేపట్టే సంస్కరణలకు వేదికగా నిలువగా, ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతం చేసిందన్నారు. రక్షణ రంగంలో హెచ్‌ఏఎల్‌ ఆత్మనిర్భర్‌ ఉత్పత్తులు ప్రపంచాన్ని ఆకర్షిస్తోందని ప్రకటించారు. తమకూరు పారిశ్రామిక వాడ, ముంబయి-చెన్నై, బెంగళూరు కారిడార్‌లు పీఎం గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా సాధించిన ప్రగతికి సాక్ష్యాలన్నారు. జల్‌శక్తి మిషన్‌ ద్వారా 11 కోట్ల గ్రామీణ కుటుంబాలకు తాగునీరు అందించే లక్ష్యం ఉన్నట్లు ప్రధాని ప్రకటించారు. గతేడాది ఈ పథకానికి రూ.22 వేలు కోట్లు కేటాయించగా, ఈ ఏడాది మరిన్ని నిధులు అందించినట్లు వెల్లడించారు.

బెంగళూరు : జీవ ఇంధన కేంద్రాన్ని సాంకేతికంగా ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

సంక్షేమ బడ్జెట్‌..

మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం సమర్థ్‌ భారత్‌, సంపన్న భారత్‌, స్వయంపూర్ణ భారత్‌, శక్తిమాన్‌ భారత్‌, గతివాన్‌ భారత్‌ కార్యక్రమాలతో 2023-24 బడ్జెట్‌ రూపొందించామని ప్రధాని వివరించారు. యువకులు, మహిళలు, రైతుల ఆర్థిక స్వావలంబన, విశ్వకర్మ, కుంబార, కమ్మర, అక్కసాలిగ వంటి వృత్తులు చేపట్టేవారికి పీఎం వికాస్‌ యోజన, నాలుగు కోట్ల మందికి ఉచిత నిత్యావసర సరుకులు, రూ.7 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ, 30 లక్షల మంది వృద్ధులకు ఫించను వంటి కార్యక్రమాలు ఈ బడ్జెట్‌లో ప్రకటించి సంక్షేమ బడ్జెట్‌ను తయారు చేశామన్నారు. ఇదే సందర్భంగా మధ్య కర్ణాటక కరవు ప్రాంతాలైన చిత్రదుర్గ, చిక్కమగళూరు, దావణగెరె, తుమకూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లను కేటాయించినట్లు ప్రధాని గుర్తు చేశారు.

బెంగళూరు: ప్రధాని పచ్చజెండా ఊపాక ఇథనాల్‌ ఆధారిత ఇంధనంతో నడిచే వాహనాల పరుగులు

ఇంధనంలో వికాసం

సహజ వాయువును ఇంధనంలో మిశ్రమం చేసే వన్‌ నేషన్‌ వన్‌ గ్రిడ్‌ పథకం, దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల్లో ఈ-20 ఇంధనం, 10 లక్షల కిలోమీటర్ల వరకు నో-గో వలయాల ఏర్పాటు, వృథాతో ఆదాయ సృష్టి-గోబర్‌థాన్‌ ప్లాంట్లు, 200 బయోగ్యాస్‌ ప్లాంట్లతో పెట్టుబడుల సృష్టి సాధ్యమని ప్రకటించిన మోదీ- ఇంధన రంగం వికసిత్‌ భారత్‌కు మెరుగైన సంస్కరణల వేదిక అన్నారు.

తుమకూరు : తుమకూరు సమీపంలో హెచ్‌ఏఎల్‌ నిర్మించిన హెలికాప్టర్ల తయారీ కర్మాగారాన్ని
మీట నొక్కి ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నారాయణస్వామి, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, రాష్ట్ర మంత్రులు అరగ జ్ఞానేంద్ర, మురగేశ్‌ నిరాణి

ఇదో చరిత్ర

ఒక ప్రధానితో భారీ ప్రాజెక్టుల శంకుస్థాపన, అదే ప్రధానితో వాటిని జాతికి అంకితం చేసిన సంఘటనలు దేశ చరిత్రలో ఇదే ప్రథమమని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. హెచ్‌ఏఎల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ కార్యక్రమం గురించి ఆయన ఈ విధంగా ప్రస్తావించారు. దేశం నేడు రక్షణ రంగ అగ్రగామిగా మారేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సమన్వయ సాధన ఫలితమన్నారు. రాష్ట్రంలో 150 వేల మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పాదన లక్ష్యమని ఆయన ప్రకటించారు. విద్యుత్తు వాహనాల్లో ఒకటో స్థానం, గత పెట్టుబడుల సమావేశం ద్వారా హరిత హైడ్రోజన్‌ విద్యుత్తు ఉత్పాదన కోసం రూ.2 లక్షల కోట్లు, ఇథనాల్‌, బయో ఇంధన తయారీలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి దేశానికి మాదిరిగా మారిందన్నారు. 2046 నాటికి కాలుష్య రహిత విద్యుత్తు తయారీ లక్ష్యంతో బెంగళూరులో భారత్‌ ఇంధన వారోత్సవాలు ప్రారంభించామన్నారు.

బెంగళూరు : ఈ-సైకిల్‌ ప్రదర్శన విభాగాన్ని తిలకిస్తున్న ప్రధానమంత్రి

దశపథం సిద్ధం

రామనగర, న్యూస్‌టుడే : బెంగళూరు- మైసూరు మధ్య పది వరుసల రహదారి మార్గం పనులు ఈ నెలాఖరులకు పూర్తవుతాయి. వచ్చే నెల రెండో వారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రహదారిని ప్రారంభించాలని భాజపా నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్‌లో విధానసభకు ఎన్నికలుంటాయని అంచనాల నేపథ్యంలో.. అంతకు ముందే రహదారిని ప్రారంభించాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు.

బెంగళూరు నగర శివారు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రంలో

ఇంధన వారోత్సవాలకు హాజరైన వివిధ రంగాల ప్రముఖులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని