logo

ఊరేగింపులు నిషేధం

ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ఎనిమిది గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాలలో ప్రారంభం కానుంది.

Published : 13 May 2023 06:10 IST

ఉదయమే ఓట్ల లెక్కింపు షురూ
రష్ట్ర వ్యాప్తంగా గట్టి బందోబస్తు

బెలగావి: నిఘా కెమెరాల నీడలో లెక్కింపు కేంద్రాలు.. పరిశీలిస్తున్న సిబ్బంది

మల్లేశ్వరం, యశ్వంతపుర, న్యూస్‌టుడే : ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ఎనిమిది గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాలలో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఫలితాలపై స్పష్టత రానుంది. పదహారో విధానసభలో అడుగు పెట్టేందుకు 2615 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అతిరథ మహారథుల్లో ఎవరు గెలుస్తారో నేటి మధ్యాహ్నానికి తేటతెల్లం కానుంది. లెక్కింపు కేంద్రాల చుట్టూ వాహనాల పార్కింగ్‌పై పోలీసులు నిషేధాన్ని జారీ చేశారు. ఫలితాలు వెల్లడైన తర్వాత, కేంద్రాలకు చుట్టుపక్కల ప్రాంతాలలో ఊరేగింపు, జాతర, బాణసంచా కాల్పులపైనా నిషేధం జారీలోకి రానుంది. ఓటరు మనసులోని గుట్టు నేడు రట్టు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 73.19 శాతం పోలింగ్‌ జరిగింది. బెంగళూరులో నాలుగు కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి గదికి 10-14 టేబుళ్లు ఉంటాయి. పోలింగ్‌ కేంద్రాలు, చుట్టుపక్కల సీసీ కెమెరాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. గెలుపు ఓటములపై జోరుగా పందేలు కొనసాగుతున్నాయి. ఫలితాల అనంతరం ఎవరికీ మెజార్టీ రాకపోతే రిసార్టు రాజకీయాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

గట్టి భద్రత

కీలక నగరం బెళగావిలో మొహరించిన సాయుధ బలగాలు

* ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి పోలీసు భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ ప్రవీణ్‌సూద్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రదేశాల్లో ఓట్లు లెక్కిస్తున్న క్రమంలో నిషేధాజ్ఞలు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి లెక్కింపు కేంద్రం వద్ద జిల్లా ఎస్‌పీ, డీవైఎస్‌పీలు, ఇన్‌స్పెక్టర్లు, కనీసం ఐదొందల మంది పోలీసులతో పాటు మూడు కేంద్ర పారా మిలటరీ దళాలు, పది రాష్ట్ర రిజర్వుడ్‌ పోలీసు దళాలను భద్రత కోసం నియమించినట్లు వివరించారు. వారితో పాటు 15 సంచార భద్రత దళాలు అందుబాటులో ఉంటాయన్నారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే నియంత్రించేందుకు జిల్లా కేంద్రాల్లో కేంద్ర పారామిలటరీ దళాలు, రాష్ట్ర రిజర్వు పోలీసు దళాలను సిద్ధంగా ఉంచామన్నారు. ఒక్క లెక్కింపు ప్రక్రియ అవసరాలకే 38 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని