logo

హస్తిన బాటలో తగ్గేదేలే..

లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి భాజపా పాతిక సీట్లను గెల్చుకుంటుందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.

Published : 26 May 2023 03:42 IST

బొమ్మైను సత్కరిస్తున్న భాజపా నేతలు

హావేరి, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి భాజపా పాతిక సీట్లను గెల్చుకుంటుందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగదళ్‌లపై నిషేధం విధిస్తామంటూ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముందుగా ఎస్‌డీపీఐ, ఇతర ముస్లిం తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్న సమాఖ్యలు, సంఘాలపై నిషేధాన్ని విధించి తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని సవాలు విసిరారు. భాజపా ప్రారంభించిన అభివృద్ధి పనులను అడ్డుకుంటే దానికి తగిన విధంగా పోరాటం చేస్తామన్నారు. శిగ్గావి నియోజకవర్గంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నేతలు బొమ్మైను ఘనంగా సత్కరించారు. ఎన్నికల్లో తనను గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపి మాట్లాడారు. గతంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు లోక్‌సభ ఎన్నికలలో భాజపా ఎక్కువ స్థానాలు గెల్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ హామీలను నెరవేర్చుకునేందుకు సిద్ధంగా లేదన్నారు. మంత్రులనూ నోరు మూపించే పని సీఎం సిద్ధరామయ్య చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన పనులను ఏ ప్రభుత్వమూ అడ్డుకోలేదని తెలిపారు. వచ్చే ఐదు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని, అప్పటి వరకు ప్రజలు సహనంతో వేచి ఉండాలని పేర్కొన్నారు.
* కాంగ్రెస్‌ పార్టీది రివర్స్‌ గేర్‌ ప్రభుత్వమని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తాము ప్రజలకు మద్దతుగా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. హుబ్బళ్లిలో గురువారం ఉదయం తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను చేపడుతోందని ఆరోపించారు. బెళ్తంగడి ఎమ్మెల్యే హరీశ్‌ పూంజా, మల్లేశ్వరం ఎమ్మెల్యే అశ్వత్థ నారాయణలపై కేసులు దాఖలు చేయడమే అందుకు ఉదాహరణ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు