logo

ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?

దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్‌సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతోంది.

Updated : 26 Apr 2024 02:37 IST

తొలివిడత సమరం.. ఉత్కంఠభరితం 

ఈనాడు, బెంగళూరు : దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్‌సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్రంలో పోటీ చేసిన మూడింటిలోనూ గెలవాలన్న పట్టుదలతో జేడీఎస్‌ శ్రమించింది. ఈ పార్టీలు నిర్దేశించుకున్న లక్ష్యానికి ఓటర్ల నుంచి స్పందన ఏమిటో తేలే రోజు వచ్చేసింది. శుక్రవారం దక్షిణ కన్నడ ప్రాంతం సిద్ధంగా ఉంది. ఓ వైపు ఎన్నికల సంఘం పోలింగ్‌ కోసం అన్ని వ్యవస్థలను సిద్ధంగా ఉంచగా, పార్టీలన్నీ తమ ప్రచారాలను ముగించి ఓటర్ల తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి. గడచిన 45 రోజులుగా అలుపెరగక ప్రచారాన్ని సాగించిన నేతలంతా నేడు తమ నియోజకవర్గాల్లోనే తిష్ట వేసి పోలింగ్‌ సరళిని సమీక్షించే పనిలో నిమగ్నం కానున్నారు.

మహిళలు ఇద్దరే..

మొత్తం 14 స్థానాల్లో 247 మంది పోటీ చేస్తుండగా, మూడు ప్రధాన పార్టీల నుంచి 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పురుషులు 226, మహిళలు 21 మంది పోటీ చేస్తుండగా తొలి విడతలో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు బెంగళూరు ఉత్తర నుంచి పోటీ చేసే భాజపా అభ్యర్థి శోభా కరంద్లాజె, బెంగళూరు దక్షిణ కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యారెడ్డి. రెండో విడతలో ఎక్కువ సంఖ్యలో మహిళలు పోటీ చేస్తుండగా తొలివిడతలో కేవలం రాష్ట్ర రాజధాని బెంగళూరు నుంచే మహిళలు బరిలో ఉన్నారు. ఈ దశలో ప్రధాన పార్టీలకు గట్టిగా పోటీ ఇవ్వగలిగిన స్వతంత్రులు, అసంతృప్తులు లేనట్లే. టికెట్లు ఆశించి కాస్త నిరాశకు గురైన వారు కోలారులో మంత్రి కె.హెచ్‌.మునియప్ప కాంగ్రెస్‌కు కాస్త ఇబ్బంది పెట్టనుండగా, మైసూరులో ప్రతాప్‌సింహ, తుమకూరులో మాధుస్వామి, చిక్కబళ్లాపురలో విశ్వనాథ్‌, ఉడుపి-చిక్కమగళూరులో సి.టి.రవి నుంచి భాజపా అభ్యర్థులకు కాస్త సహాయ నిరాకరణ ఎదురవనుంది. వీరంతా పైకి పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్లే కనిపిస్తుండటం గమనార్హం. జేడీఎస్‌కు అలాంటి సమస్య లేకున్నా వీరికి భాజపా కార్యకర్తల నుంచి మద్దతు దొరకటంపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.

బెంగళూరు నేషనల్‌ కళాశాల ప్రాంగణం నుంచి ఎన్నికల విధులకు బయలుదేరిన సిబ్బంది

ఎవరి లెక్కవారిదే..

పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కొందరు విధానసభ ఎన్నికల్లో ఓటమి పాలై.. ఈసారైనా విజయం సాధించాలన్న ఆశయంతో బరిలో దిగారు. చిక్కబళ్లాపుర నుంచి డాక్టర్‌ కె.సుధాకర్‌, తుమకూరులో వి.సోమణ్ణ, చిత్రదుర్గలో గోవింద కారజోళ, బెంగళూరు దక్షిణలో సౌమ్యారెడ్డి ఇదే కోవకు చెందినవారు. ఇక తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న వారిలో డాక్టర్‌ సి.ఎన్‌.మంజునాథ్‌ ఒకరు. ఆయన బెంగళూరు గ్రామీణ నుంచి భాజపా అభ్యర్థి బరిలో దిగగా ఆయనకు వైద్య రంగంలో అందించిన విశిష్ట సేవలు, దేవేగౌడ, కుమారస్వామి నుంచి కొండంత అండ మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు విజయానికి దగ్గరిదారిగా మారనున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌లో దిగ్గజ నేత డీకే శివకుమార్‌ సోదరుడు, కనకపురలో తిరుగులేని రాజకీయ నేపథ్యం ఉన్న డీకే సురేశ్‌ను ఎదుర్కోవటం మంజునాథ్‌కు అంత సులువైతే కాదు.

రాజధాని నగర శాంతినగరలో అందంగా రూపుదాల్చిన పోలింగ్‌ కేంద్రం

  •  మైసూరులో యువరాజు యదువీర్‌ కృష్ణదత్త తనకున్న రాజరిక నేపథ్యంతో పోరును ఆసక్తిగా మలిచారు. రాజకీయాలకు అతీతమైన ఈ వంశం నుంచి ఓ యువనేత బరిలో ఉండటంతో ప్రజల్లో ఆయనకున్న గౌరవం ఓటు రూపంలో ఎలా మారగలదోనన్న ఆసక్తి నెలకొంది. ఆయనకు పోటీగా ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్త ఎం.లక్ష్మణ్‌కు సాధారణ నేతగా బరిలో దిగినా ఆయనకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరు ఓ బలమైన శక్తిగా మారనుంది.
  •  భాజపా, జేడీఎస్‌ పొత్తుల సమీకరణాల ఫలితంగా మండ్య బరిలో దిగిన హెచ్‌డీ కుమారస్వామి గెలుపు నల్లేరుపై నడక మాత్రం కాదు. ఆయనతో పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటరమణెగౌడ రాజకీయాలకు కొత్తముఖమైనా ఇక్కడ కాంగ్రెస్‌ గెలుపు పార్టీకే సవాలు వంటిది. దేవేగౌడ కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్‌కు కుమారస్వామి గట్టిపోటీ ఇచ్చినా ఆయనకు గతంలో బద్దశత్రువుగా ఉన్న సుమలత, జేడీఎస్‌ శిబిరం నుంచి బయటకు వెళ్లిన చెలువరాయస్వామి, నారాయణగౌడ, నరేంద్రస్వామి, బాలకృష్ణ వంటి నేతలంతా అవరోధాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు.
  •  వరుసగా రెండుసార్లు గెలిచిన ఉడుపి-చిక్కమగళూరులో వ్యతిరేకత ఎదుర్కొన్న మంత్రి శోభాకరంద్లాజెకు యడియూరప్పతో పాటు అధిష్ఠానం అండ దండి. ఆమెకు విద్యావేత్త, మేధావి వర్గంలో కనిపించే రాజీవ్‌గౌడ నుంచి ప్రస్తుతం బెంగళూరు ఉత్తరలో పోటీ గట్టిగానే ఎదురవుతోంది. టికెట్‌ కోసం ఆశించి భంగపడిన డి.వి.సందానందగౌడ నుంచి ఆమెకు అందే సహకారం నిర్ణయాత్మకంగా మారగలదు.
  •  విధానసభకు పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిన తుమకూరు భాజపా అభ్యర్థి వి.సోమణ్ణ గెలుపు అంత సులువైతే కాదు. అసలే స్థానికేతరుడన్న ప్రచారాన్ని మోస్తున్న ఆయనకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. భాజపా నుంచి కేవలం మాధుస్వామి మాత్రమే అవాంతరాలు సృష్టిస్తే.. కాంగ్రెస్‌ నుంచి కె.రాజణ్ణ, డా.జి.పరమేశ్వర్‌, గుబ్బి శ్రీనివాస్‌ వంటి సీనియర్ల బలగాన్ని తట్టుకుని, ముద్ద హనుమేగౌడను ఓడించటం అంత సులువు కాదు. స్థానికేతరుడు, పోరాట పటిమ లేదన్న అపవాదును మోస్తున్న చిత్రదుర్గ అభ్యర్థి గోవిందకారజోళకూ మోదీ ప్రభావమే బలం.
  •  మొన్నటి ఎన్నికల్లో మోదీ ప్రభావంతో గెలిచిన తేజస్విసూర్యకు మార్పు కోరుకుంటే మాత్రం బెంగళూరు దక్షిణలో సౌమ్యారెడ్డి నుంచి ఎదురుగాలి తప్పదు. బెంగళూరు కేంద్రంలో పి.సి.మోహన్‌ కూడా కొత్తదనం కావాలని ఓటర్లు భావిస్తే గెలుపు కోసం శ్రమించాల్సిందే.
  •  పార్టీ కార్యకర్తలతో పాటు పెద్ద అండ ఉన్న హాసన జేడీఎస్‌ అభ్యర్థి ప్రజ్వల్‌ రేవణ్ణకు ఎన్‌డీఏ నుంచి ప్రీతమ్‌గౌడ సహకారం, ఉడుపి చిక్కమగళూరు భాజపా అభ్యర్థి శ్రీనివాసపూజారీకి సి.టి.రవి నుంచి మద్దతు ఉంటే పోటీని తట్టుకోగలరు. ఇదే స్థానాల నుంచి పోటీ చేసే శ్రేయస్‌ పాటిల్‌, జయప్రకాశ్‌ హెగ్డేలకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల అండ లభిస్తోంది.

పోటీ చేసే ప్రముఖులు

  •  భాజపా: యదువీర్‌ కృష్ణదత్త (మైసూరు), డాక్టర్‌ సి.ఎన్‌.మంజునాథ్‌ (బెంగళూరు గ్రామీణ), తేజస్విసూర్య (బెంగళూరు దక్షిణ), వి.సోమణ్ణ (తుమకూరు), తేజస్విసూర్య (బెంగళూరు దక్షిణ), శోభా కరంద్లాజె (బెంగళూరు ఉత్తర), పి.సి.మోహన్‌ (బెంగళూరు కేంద్రం), డాక్టర్‌ కె.సుధాకర్‌ (చిక్కబళ్లాపుర), గోవింద కారజోళ (చిత్రదుర్గ).
  •  కాంగ్రెస్‌: డీకే సురేశ్‌ (బెంగళూరు గ్రామీణ), డాక్టర్‌ రాజీవ్‌గౌడ (బెంగళూరు ఉత్తర), ముద్ద హనుమేగౌడ (తుమకూరు), ఎం.లక్ష్మణ్‌ (మైసూరు), స్టార్‌ చంద్రు (మండ్య), సౌమ్యారెడ్డి (బెంగళూరు దక్షిణ) జయప్రకాశ్‌ హెగ్డే (ఉడుపి- చిక్కమగళూరు).
  •  జేడీఎస్‌: హెచ్‌డీ కుమారస్వామి (మండ్య), ప్రజ్వల్‌ రేవణ్ణ (హాసన)

ఎల్లెడలా భధ్రత కట్టుదిట్టం

తుమకూరులో భద్రత కోసం సిద్ధమైన రక్షకభటులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాష్ట్రంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం పోలింగ్‌.. గురువారం నుంచే సాయుధులు విధుల్లో చేరిపోయారు. కనీసం 50 వేల మంది పోలీసులను భధ్రతకు ప్రత్యేకించినట్లు డీజీపీ డాక్టర్‌ అలోక్‌కుమార్‌ తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర భద్రత దళాలు, స్థానిక పోలీసులు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర పోలీసులను ఈ పనికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఉడుపి-చిక్కమగళూరు, హసన, దక్షిణకన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, మండ్య, మైసూరు, చామరాజనగర, బెంగళూరు గ్రామీణ, బెంగళూరు దక్షిణ, బెంగళూరు ఉత్తర, బెంగళూరు కేంద్ర, చిక్కబళ్లాపుర, కోలారు (ఎస్‌సీ) లోక్‌సభ స్థానాలకు సిబ్బందిని సర్దుబాటు చేశామన్నారు. బెంగళూరు నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఐదు లోక్‌సభ స్థానాలున్నాయని, ఇక్కడ 13 వేల మంది పోలీసులను భద్రతకు వినియోగిస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ దయానంద్‌ తెలిపారు. నగర పరిధిలో 144వ సెక్షన్‌ విధించామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు