logo

రాజ్‌భవన్‌కు కొత్త తళుకులు!

మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న 24 మంది నేతలూ.. తమ కుటుంబ సభ్యులతో కలిసి రాజ్‌భవన్‌లో సందడి చేశారు. వారికి మూడో వరుస నుంచి ఆసనాలను కేటాయించారు.

Published : 28 May 2023 02:02 IST

కలసికట్టుగా కదలివచ్చిన డి.సుధాకర్‌ కుటుంబ సభ్యులు

బెంగళూరు గ్రామీణ, న్యూస్‌టుడే : మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న 24 మంది నేతలూ.. తమ కుటుంబ సభ్యులతో కలిసి రాజ్‌భవన్‌లో సందడి చేశారు. వారికి మూడో వరుస నుంచి ఆసనాలను కేటాయించారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టేందుకు ముందుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫొటో జర్నలిస్టుల ముందుకు వచ్చారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదిక మీదకు వెళుతున్న వారికి, వారి కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. రాజ్‌భవన్‌లో వారి సందడి పతాక స్థాయికి చేరుకుంది. ఆనందం మిన్నంటింది.

* మంత్రి పదవి దక్కడం నాకు డబుల్‌ ఢమాకా అని లక్ష్మీ హెబ్బాళ్కర్‌ పేర్కొన్నారు. ‘నేడు (ఆదివారం) నా పుట్టిన రోజు. నాకు మనవరాలు పుట్టింది. ఆమె పుట్టిన తర్వాతే నాకు మంత్రిగా అవకాశం లభించింది. ఏ శాఖను కేటాయించినా, శక్తివంచన లేకుండా పని చేస్తా’ అని పేర్కొన్నారు. మరోవైపు.. మంత్రి పదవులు దక్కించుకోని వారి వేదన పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికిప్పుడు నేతలు తీవ్ర నిర్ణయాలు తీసుకోకపోయినా.. అసమ్మతి వెళ్లగక్కారు.

మనసులో బాధే..

బెంగళూరు (శివాజీనగర) : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడమే తనకు సంతోషంగా ఉందని మాజీ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండే వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం మనసులో బాధగా ఉన్నప్పటికీ, ఎటువంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు.

త్వరలో నిర్ణయం..

బెంగళూరు (మల్లేశ్వరం) : మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం బాధ కలిగిస్తుందని పుట్టరంగశెట్టి పేర్కొన్నారు. తనకు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశాన్ని కల్పిస్తున్నామని సిద్ధరామయ్య చెప్పారని తెలిపారు. సీనియర్ల కోసం చివరి క్షణంలో తన పేరును మంత్రివర్గం నుంచి తొలగించారని ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టే అంశమై నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

కార్యకర్తల ధర్నా

మైసూరు : మంత్రివర్గంలో తన్వీర్‌ సేఠ్‌కు అవకాశం కల్పించకపోవడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు మైసూరులో ధర్నాకు దిగారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పినా, బలవంతంగా పోటీ చేయించారని, గెల్చిన తర్వాత పక్కన పెట్టడం బాధ కలిగిస్తున్నట్లు తన్వీర్‌ సేఠ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన నివాసం వద్ద ధర్నాకు దిగిన కార్యకర్తలను ఆయన సముదాయించి, అక్కడి నుంచి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు