logo

భాజపాకు గ్యారంటీల భయం.. హస్తానికదే అభయం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలు కొట్టుకుని పోతాయని ప్రచారంలో ముందుకు వెళ్తున్న భాజపాకు ఎక్కడో అదే గ్యారంటీల భయం వెంటాడుతోందని సర్వత్రా చర్చనీయాంశమైంది.

Published : 18 Apr 2024 02:54 IST

దళిత, ఓబీసీ, ముస్లిం ఓట్లు బ్యాంకుపై ధీమా
గనినాడులో పోటీ ఆసక్తికరం

బళ్లారి, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలు కొట్టుకుని పోతాయని ప్రచారంలో ముందుకు వెళ్తున్న భాజపాకు ఎక్కడో అదే గ్యారంటీల భయం వెంటాడుతోందని సర్వత్రా చర్చనీయాంశమైంది. గత విధానసభ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ విధానసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా..బి.శ్రీరాములు, ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు గ్యారంటీలతో ఓడిపోయినట్లు గతంలో పలుమార్లు ప్రకటించారు. గ్యారంటీలు ప్రవేశపెట్టక ముందే ఓటమి పాలైనట్లు ప్రకటించారు.

నేడు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ప్రవేశపెట్టడంతో బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి బి.శ్రీరాములుకు ప్రచారంలో అదే భయం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకుల మాట. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీల్లో మహిళలకు లబ్ధిచేకూరే పథకాలు ఎక్కువగా ఉన్నాయి. బళ్లారి జిల్లాలో మొత్తం ఓటర్లు 18,77,751 మంది ఉండగా, వారిలో పురుషులు 9,26,229 మంది, మహిళలు 9,51,572 మంది ఉండగా, పురుషుల కంటే మహిళా ఓటర్లు 25,293 మంది ఎక్కువగా ఉన్నారు. గ్యారంటీలను సద్వినియోగం చేసుకున్న మహిళలు లోక్‌సభ ఎన్నికల్లో ఓటువైపు మొగ్గుచూపుతారో..అని అభ్యర్థులను భయం వెంటాడుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి మాత్రం ఈ పథకాలే తమ గెలుపునకు పనిచేస్తాయని ధీమాతో ఉన్నారు. 

మైనార్టీ ఓటర్లే కీలకం

బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో అల్పసంఖ్యాక (ముస్లిం) ఓటర్లు కీలకంగా మారారు. బళ్లారి, విజయనగర జిల్లాల్లో ముస్లిం, క్రిస్టియన్‌ ఓటర్లు 3.70 లక్షలు వరకు ఉన్నట్లు సమాచారం. దళిత, కురుబర ఓటర్లు కూడా కీలకంగా మారారు. ఈ మూడు వర్గాల ఓటర్ల కాంగ్రెస్‌ వైపు మొగ్గుచుతున్నట్లు సొంత పార్టీలోని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. వాల్మీకి, లింగాయత సముదాయం ఓటర్లు  కీలకమే..లోక్‌సభ నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు వాల్మీకి సముదాయం కావడంతో వారి ఓట్లపై ఇద్దరి ప్రభావం ఉంటుంది. వీరశైవ లింగాయత సముదయానికి చెందిన అల్లం ప్రశాంత్‌కు ఎన్నికల ముందు డీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. విజయనగర జిల్లాలో అదే సముదాయానికి చెందిన శివయోగిస్వామి డీసీసీ అధ్యక్షులుగా కట్టబెట్టారు. అల్లం వీరభద్రప్ప కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉండగా, భాజపాలో ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌ ఉంటున్నారు. వీరశైవ లింగాయత ఓటర్లుపై భాజపా కోటి ఆశలు పెట్టుకుంది. వారి ఓట్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపుతాయో అని పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. జిల్లాలో ఉన్న కురుబర ఓటర్లలో గతంలో 30 శాతం భాజపా వైపు మొగ్గుతున్నట్లు ప్రచారం ఉండేది..లోక్‌సభ ఎన్నికల్లో కురుబ సముదాయానికి చెందిన కె.ఎస్‌.ఈశ్వరప్పకు టికెట్‌ నిరాకరించడంతో కురుబర ఓటర్లు సిద్దరామయ్య వైపు మొగ్గు చూపుతున్నట్లు కురుబ సముదాయం నేతలు మాట్లాడుతున్నారు.

బళ్లారి కొండ

ఎమ్మెల్యేల ప్రభావం ఎంత?

బళ్లారి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి బళ్లారి నగర, బళ్లారి గ్రామీణ, కంప్లి, సండూరు, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, విజయనగర (హొసపేటె), హూవినహడగలి విధానసభ నియోజకవర్గాలు వస్తాయి. ఈ క్షేత్రాల్లో హూవినహడగలిలో భాజపా ఎమ్మెల్యే కృష్ణనాయక్‌, హగరిబొమ్మనహళ్లి నియోజకవర్గంలో జేడీఎస్‌ ఎమ్మెల్యే నేమిరాజనాయక్‌ ఉన్నారు. మిగిలిన ఆరు విధానసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. గత విధానసభ ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యత కంటే ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ చూపించాలని కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గట్టిగా చెప్పారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యేలు స్థానికంగానే ఉంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. బి.శ్రీరాములుకు విధానసభ నియోజకవర్గాల్లో నాయకుల కొరత కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మతోనే ముందుకు వెళ్తున్నారు. ఇది ఎంత వరకు పనిచేస్తోందో? లేదో ఓటర్ల తీర్పుపైనే ఆధారపడి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని