Arvind Kejriwal: ఎన్నికల ముందే కేజ్రీవాల్‌ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న

ఎన్నికల ముందే దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంపై ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Published : 30 Apr 2024 18:53 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ముందు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను అరెస్టు చేయడంపై ఈడీ (ED)ని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. ‘‘జీవితం, స్వేచ్ఛ చాలా ముఖ్యమైనవి. మీరు వాటిని కాదనలేరు’’ అని పేర్కొంటూ.. అరెస్టు చేసిన సందర్భంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో న్యాయపరమైన విచారణలు లేకుండా క్రిమినల్ చర్యలను కేంద్ర ఏజెన్సీ చేపట్టవచ్చో? లేదో? చెప్పాలని తెలిపింది. దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.

కేజ్రీవాల్‌ను కలిసిన పంజాబ్‌ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?

ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి జప్తు చర్యలు తీసుకోలేదని, ఒకవేళ తీసుకుంటే.. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ ప్రమేయం ఏవిధంగా ఉందో చూపించాలని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ రాజుకు జస్టిస్ ఖన్నా తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అరెస్టు ఎందుకు? అని ప్రశ్నించారు. దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీ కింద తిహాడ్ జైల్లో ఉన్నారు. అంతకుముందు ఆయన్ను ఈడీ అరెస్టు చేయడాన్ని హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని