logo

ఏలికల శక్తి యుక్తులకు పరీక్ష

రాష్ట్రంలో ఎన్నికల నేపథ్య జాతీయ, రాష్ట్ర నేతల హడావుడి మంగళవారంతో పరిసమాప్తం కానుంది.

Updated : 07 May 2024 06:45 IST

కొప్పళ : గ్రామీణ ప్రాంతాలకు తరలివెళుతున్న సిబ్బంది

ఈనాడు, బెంగళూరు : రాష్ట్రంలో ఎన్నికల నేపథ్య జాతీయ, రాష్ట్ర నేతల హడావుడి మంగళవారంతో పరిసమాప్తం కానుంది. పది రోజుల వ్యవధిలో కన్నడనాట రెండు విడతల ఎన్నికల కోసం పార్టీలు, ఎన్నికల సంఘం కసరత్తుకు తెరపడనుంది. తొలి, మలివిడత ఎన్నికల్లో 14 స్థానాల చొప్పున ఎన్నికలు నిర్వహించగా రెండు విడతలకూ వేర్వేరు వ్యూహాలు అమలు చేసిన పార్టీలు తీర్పు బాధ్యత ఓటర్లకు విడిచిపెట్టాయి. కర్ణాటకలో వచ్చే ఫలితాలు జాతీయ స్థాయిలో ఎంతో ఆసక్తికరం. 2019లో భాజపాకు అత్యధిక స్థానాలను అందించి, విధానసభలో కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపిన కన్నడ ఓటర్లు ఈసారి ఎవరిని విశ్వసిస్తారో తెలియని స్థితి. ఏడాదిలో రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో మార్పులొచ్చాయి. ఆ మార్పులకు ఓటర్లు ఏమేరకు ప్రభావితమయ్యారో జూన్‌ 4 వరకు ఒక్క బ్యాలెట్‌ బాక్సుకు మాత్రమే తెలుస్తుంది.

ఈ ఎన్నికల్లో గెలుపోటములు అభ్యర్థుల భవిష్యత్తును మాత్రమే నిర్ధరిస్తాయనుకుంటే పొరపాటే. వారికి టికెట్లు ఇచ్చిన పార్టీలు, పార్టీలకు సిఫార్సు చేసిన నేతల నాయకత్వానికి కూడా పరీక్షగా మారుతాయి. కాంగ్రెస్‌ అభ్యర్థులుగా బెళగావి నుంచి మృణాల్‌ హెబ్బాళ్కర్‌, చిక్కోడి నుంచి ప్రియాంక జార్ఖిహొళి, బాగల్‌కోటె నుంచి సంయుక్త పాటిల్‌, బీదర్‌ నుంచి సాగర్‌ ఖండ్రేలు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆ అభ్యర్థులు ఓడినా వారంతా వారివారి వ్యాపారాలు, చదువుల్లో కొనసాగుతారు. వారిని నిలబెట్టి, పార్టీలకు భరోసా ఇచ్చిన నేతల తరపున ప్రచారం చేసిన తల్లిదండ్రుల నాయకత్వంపై ప్రభావం పడక తప్పదు. శివమొగ్గలో భాజపా అభ్యర్థి బి.వై.రాఘవేంద్ర ఫలితం అటుఇటు అయితే అది నేరుగా యడియూరప్పకే ప్రమాదం. ఆయన సోదరుడు బి.వై.విజయేంద్ర నాయకత్వానికే మచ్చగా మారనుంది. ధార్వాడ నుంచి బెళగావికి శెట్టర్‌ను, ఉడుపి-చిక్కమగళూరు నుంచి బెంగళూరు ఉత్తరకు వచ్చిన శోభాకరంద్లాజె, హాసన, రామనగర కాదని మండ్యలో పోటీ చేసిన కుమారస్వామి, జేడీఎస్‌ కాదని భాజపా నుంచి పోటీ చేసిన డాక్టర్‌ సి.ఎన్‌.మంజునాథ్‌, బెంగళూరు నుంచి కోలారుకు వెళ్లిన గౌతమ్‌, అంతఃపురంలో రాజాగా ఉన్న యదువీర్‌.. గెలుపోటములు వారికంటే ఆ స్థానాన్ని సూచించిన నేతల వ్యూహాలకు పరీక్షగా మారతాయి.

 సర్కారు భవితవ్యం?

 ఈ ఫలితాలు కేవలం జాతీయ స్థాయిలో అధికారాన్ని నిర్దేశిస్తాయనుకుంటే పొరపాటే. రాష్ట్రంలోని సర్కారుపైనా నేరుగా ప్రభావం చూపుతాయనటంలో అతిశయోక్తి లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మధ్య దోబూచులాడుతున్న ముఖ్యమంత్రి పీఠం ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత కొత్త నేత కోసం ఎదురుచూసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో అధికార పంపిణీ ఉంటుందన్న రహస్యం ప్రస్తుతానికి అధిష్ఠానానికి మాత్రమే తెలుసు. ఆ రహస్యాన్ని బట్టబయలు చేసేవి మాత్రం ఈ ఎన్నికలే. ఈ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులు, పార్టీల వ్యూహాలు ఎవరి నేతృత్వంలో జరిగాయో, వాటికి బాధ్యులెవరిని చేయాలో అధిష్ఠానానికి బాగా తెలుసు. వారికి ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవటంలో ఎవరు సఫలం అవుతారో వారికే పార్టీ పగ్గాలు అందించే అవకాశం ఉంది.

సముదాయాలపై పట్టు

ఈ రెండు విడతల ఎన్నికలు ఎంత కాదన్నా ఒక్కలిగలు, లింగాయత్‌ల మధ్య పోరుగానే భావించాలి. పేరుకు భాజపా, కాంగ్రెస్‌ల మధ్య పోరుగా ఈ ఎన్నికలను పరిగణించినా రాష్ట్రంలో ఈ రెండు కీలక సముదాయాల నాయకత్వానికి కూడా పోరే. ఉత్తర ప్రాంతంలో ఎవరు ఎక్కువ సీట్లను సాధిస్తారో ఆ ఘనత ఇరు పార్టీల్లోని లింగాయత్‌ నాయకులు, అహింద స్థానాల్లో గెలుపోటములు ఆ సముదాయానికి చెందిన నాయకుల ఖాతాలో సులువుగా పడిపోతాయి. ఈ సముదాయాల అభ్యర్థులు గెలిస్తే వారికి కేంద్ర మంత్రివర్గంలోనూ ఎర్రతివాచీ పరవక తప్పదు. ఇలా ఒక్కలిగ నాయకత్వానికి డీకే శివకుమార్‌, కుమారస్వామి మధ్య, లింగాయత్‌ల నాయకత్వానికి యడియూరప్ప కుటుంబం, బెళగావి, దావణగెరె, బీదర్‌, విజయపుర కాంగ్రెస్‌ నేతల మధ్య ఆధిపత్యానికి ఈ ఫలితాలు గీటురాయిగా మారనున్నాయి.

జాతీయ నేతలకూ..

అసలే విధానసభ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షా.. విస్తృతంగా ప్రచారం చేసినా భాజపా అధికారానికి రాలేదంటూ కాంగ్రెస్‌ పదే పదే ఆరోపిస్తుంటుంది. ఈ ఆరోపణ నుంచి బయటపడాలంటే భాజపా గత లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన స్థానాలను మరోసారి గెలవాల్సిందే. లేదంటే జాతీయ స్థాయిలోనూ వీరి నాయకత్వానికి మచ్చరాక మానదు. కాంగ్రెస్‌లోనూ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రంలో ఆశించిన స్థానాల్లో గెలిస్తేనే ఆయన పార్లమెంట్‌లో విపక్ష నేతగా విశ్వాసంతో బాధ్యతలు అందించగలరు. లేదంటే ప్రతి నిత్యం ఎన్‌డీఏ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిందే. భారత్‌ జోడోయాత్రను రాష్ట్రంలో ఎక్కువ దూరం కొనసాగించిన రాహుల్‌గాంధీ నాయకత్వానికీ ఈ ఎన్నికలు ఓ పరీక్షే. కేవలం విధానసభ ఎన్నికల్లోనే కాదు భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ సత్తా చాటనుందని ప్రకటించుకోవాలంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎంతో కీలకం.

జేడీఎస్‌కు సంక్లిష్టం..

ఎన్‌డీఏ భాగస్వామ్యంతో మూడు చోట్ల, భాజపా గుర్తుతో మరో చోట పోటీ చేసిన జేడీఎస్‌ ఈ నాలుగు స్థానాల్లో కనీసం మూడు స్థానాల్లో మరీ లేదంటే రెండు స్థానాల్లో గెలిస్తేనే రాష్ట్రంలో మనుగడ సాధిస్తుంది. లౌకికవాదానికి తిలోదకాలిచ్చిందని పదేపదే కాంగ్రెస్‌ నుంచి సూటిపోటి మాటలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌.. తాము ఎన్‌డీఏలో చేరి మంచి పని చేశామని చెప్పుకోవాలంటే తాము పోటీ చేసిన స్థానాల్లో కనీసం రెండు స్థానాలైనా గెలవాల్సిందే. పైగా ఒక్కలిగ నాయకత్వంపై దేవేగౌడ, డీకే శివకుమార్‌ కుటుంబం కొనసాగిస్తున్న పోరులోనూ విజయం ఎవరిదో తెలియాలన్నా, మా ఓటు బ్యాంకు మమ్మల్ని విడిచిపోలేదని నిరూపించుకోవాలన్నా జేడీఎస్‌కు ఈ ఎన్నికల్లో గెలుపు అత్యంత అనివార్యం.

గ్యారంటీల కోసం..

రాష్ట్రంలో ప్రతి గృహిణి, ప్రతి గృహం రాష్ట్ర సర్కారు అందించే గ్యారంటీ పథకాలతో కళకళలాడుతోంది. కష్టమైనా ఈ పథకాలను రాష్ట్ర సర్కారు సజావుగానే అమలు చేసింది. ఈ పథకాల భవిష్యత్తును కూడా ఈ ఫలితాలే నిర్దరిస్తాయి. ఫలితాలతో సంబంధం లేకుండా ఐదేళ్ల పాటు గ్యారంటీలు ఉంటాయని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నా.. సర్కారులోని మంత్రివర్గ సభ్యులు అక్కడక్కడా ఈ గ్యారంటీలపై వాస్తవాలు చెప్పకనే చెబుతున్నారు. కాంగ్రెస్‌కు ఓటేయలేదంటే మీకు గ్యారంటీలపై నమ్మకం లేదన్నట్లేనని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు భాజపా సామాజిక మాధ్యమ గ్రంథాలయంలో భద్రంగా ఉన్నాయి. ఈ ఫలితాల ఆధారంగానే గ్యారంటీలు కొనసాగించాలా? నిలిపి వేయాలా అన్నది తేలుతుంది.


ఆశల మేడలో కాంగ్రెస్‌

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఈ ఎన్నికలను ఆత్మవిశ్వాసంతోనే ఎదుర్కొంటోంది. ఇప్పటికే అమలు చేస్తున్న ఐదు గ్యారంటీ పథకాలకు అధిష్ఠానం ప్రకటించిన 25 గ్యారంటీలను చేర్చుకుని ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని ఉరకలెత్తించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొండంత అండగా ఉండగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కలసికట్టుగా ఈ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. కిత్తూరు కర్ణాటక భాజపాకు కంచుకోట అయినా అహింద, ఎస్‌టీ, అల్ప సంఖ్యా ఓట్లు సమృద్ధిగా ఉన్న కల్యాణ కర్ణాటకలో ఆ పార్టీకి గట్టి నాయకత్వం ఉండటం ప్రధాన బలం. పూర్తిగా వెనుకబడిన ప్రాంతమైన కల్యాణ కర్ణాటకలో ఎక్కువ మొత్తంలో గ్యారంటీ లబ్ధిదారులు ఉండటంతో కాంగ్రెస్‌ వాటిని విస్తృతంగా ప్రచారం చేయగలిగింది. కరవు ప్రభావంతో ఎక్కువగా నష్టపోయిన కల్యాణ కర్ణాటకలోని ఆరు నియోజకవర్గాల్లో కేంద్రం కరవు పరిహారాన్ని ఇవ్వలేదని, 14 ఎంపీలున్నా ఈ ప్రాంతాల గురించి మోదీతో నోరు మెదపలేదని కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ అన్ని స్థానాల్లో ప్రచారం చేయగా, పార్టీ రాష్ట్ర బాధ్యుడు రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా విధానసభ ఎన్నికల మాదిరిగానే సమస్యాత్మక స్థానాల్లో తిష్టవేసి పార్టీని సమైక్య పరచే ప్రయత్నం చేశారు. చివరిగా ప్రజ్వల్‌ కేసు ఎన్నికల సమయంలో తెరపైకి రావటంతో భాజపా, జేడీఎస్‌లను ఒకే దెబ్బతో నష్టపరచాలన్న వ్యూహానికి కాంగ్రెస్‌ పదునుపెట్టింది.

బలహీనతలు..

ప్రధాని అభ్యర్థిగా మోదీకి ప్రత్యామమ్నయం ఎవరూ లేరన్న ప్రచారం ఈ ఎన్నికల్లోనూ జోరుగా సాగింది. ఇదే అంశం కాంగ్రెస్‌ను పట్టి పీడించింది. భాజపా ప్రచారం చేసిన ప్రతి చోటా ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరంటూ ప్రశ్నిస్తూనే ఉంది. ఖర్గే సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కుటుంబ సభ్యుడిని బరిలో దింపటం కొంత విమర్శకు దారితీసింది. మంత్రుల పిల్లలు, వారసత్వ రాజకీయాలనే విమర్శను కాంగ్రెస్‌ గట్టిగానే ఎదుర్కొంది. ఈ 14 నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా కాంగ్రెస్‌కు సిట్టింగ్‌ ఎంపీ లేకపోవటం ఓ బలహీనతే. సరిగ్గా ఎన్నికల సమయంలో బెంగళూరులో బాంబు పేలుడు, హుబ్బళ్లిలో నేహా హత్య, బెంగళూరులో నీటి సమస్యను భాజపా ఎక్కువగా ప్రచారం చేయటంతో కాంగ్రెస్‌ గట్టిగా బదులివ్వలేకపోయింది. బాగల్‌కోటెలో టికెట్‌ దక్కని వీణా కాశెప్పనవర్‌, దావణగెరెలో స్వతంత్రుడిగా పోటీ చేసిన వినయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపును సవాలు చేస్తున్నారు.


చేవ చూపాలని భాజపా

భాజపా ఈ ఎన్నికల్లోనూ ఎప్పటిలాగానే కేంద్ర సర్కారు పాలన, ప్రగతి అంశాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం, హోం మంత్రి అమిత్‌ షా రాజకీయ వ్యూహాలపై ఆధారపడింది. కర్ణాటకలో ఎన్నికలంటే పార్టీ జాతీయ నాయకులు ఎక్కువగా దృష్టి సారిస్తుంటారు. ఈ ఎన్నికల్లోనూ మోదీ, అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఒక్కొక్కరు మూడుసార్లు ఈ 14 నియోజకవర్గాల్లో పర్యటించారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో ప్రచారాన్ని కిత్తూరు కర్ణాటకలోని కలబురగి నుంచే ప్రారంభించగా, మలివిడతలోనూ ఏప్రిల్‌ 28, 29తేదీల్లో 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మధ్యలో అమిత్‌ షా, జేపీ నడ్డా, తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై రోడ్‌షోలు, బహిరంగ సభలతో ప్రచారానికి వేగం పెంచారు. ఇలా గత నెల 26న తొలి విడత ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆదివారం వరకు ప్రతి రోజూ ఎవరో ఒక జాతీయ నేత రాష్ట్రంలో పర్యటించేలా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి.వై.విజయేంద్ర, విపక్ష నేత ఆర్‌.అశోక్‌తో పాటు 23 మంది కీలక ప్రచారకులు ఈ ఎన్నికల్లో ప్రచార బాధ్యతను విజయవంతంగా ముగించారు. 2019 ఎన్నికల్లో ఉత్తర ప్రాంతంలోని 14 స్థానాల్లో 87 శాతం లింగాయత ఓట్లను సాధించిన భాజపా ఈసారి అదే స్థాయి ఓట్లను పొందేందుకు ఆ సముదాయ నేత మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్పకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి మరోవైపు ఇదే సముదాయానికి చెందిన జగదీశ్‌ శెట్టర్‌, బసవరాజ బొమ్మైలను లోక్‌సభ బరిలో దింపింది.

బలహీనత..

మోదీ నాయకత్వంపైనే పూర్తిగా ఆధారపడే భాజపాకు ఈ బలమే బలహీనతగా మారిందని 2023 విధానసభ ఎన్నికలు తెలిసొచ్చేలా చేశాయి. ఆ పార్టీకి నేటికీ రాష్ట్రంలో సాధికారికంగా నాయకత్వం వహించే నేత లేరనే చెప్పాలి. యడియూరప్ప వయోభారంతో అన్ని ప్రాంతాల్లో పర్యటించలేకపోయారు. ఆయన కుమారుడు బి.వై.విజయేంద్రకు సీనియర్ల నుంచి మద్దతు కరవు కావడమూ ఓ బలహీనతే. కీలక నేతలు డి.వి.సదానందగౌడ, బసవనగౌడ యత్నాళ్‌, సి.టి.రవి వంటి నేతలు టికెట్లు దక్కకపోవటం, యడియూరప్పతో విభేదాల కారణంగా వారి సేవలు ఈ ఎన్నికల్లో పరిమితంగానే ఉన్నాయి. బొమ్మై, జగదీశ్‌ శెట్టర్‌ తమ స్థానాలకే పరిమితమయ్యారు. ఈ కారణంగా కాంగ్రెస్‌కు పట్టున్న కల్యాణ కర్ణాటకలో భాజపా అంతగా ప్రచారం చేయలేదనే చెప్పాలి. ఇక ఎన్నికల ముందు ఏ పార్టీతో పొత్తు బలం కాగలదని భావించిందో అదే జేడీఎస్‌ ఎన్నికల సమయానికి ఓ సమస్యగా మారింది. హాసన ఎంపీ ప్రజ్వల్‌ ఉదంతం జాతీయ నేతలు కూడా విమర్శలు ఎదుర్కొనేంత వివాదంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని