logo

గనులు తెరమరుగు..

సింగరేణి పుట్టినిళ్లైన బొగ్గుట్ట(ఇల్లెందు) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణి ద్వారా బొగ్గు ఉత్పత్తిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన బొగ్గుట్టలో గనులు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న భూగర్భ గనులు నేడు

Published : 27 Jan 2022 03:58 IST

జేకే-5 ఉపరితల గని

ఇల్లెందు, న్యూస్‌టుడే: సింగరేణి పుట్టినిళ్లైన బొగ్గుట్ట(ఇల్లెందు) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణి ద్వారా బొగ్గు ఉత్పత్తిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన బొగ్గుట్టలో గనులు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న భూగర్భ గనులు నేడు పూర్తిగా కనుమరుగయ్యాయి. కేవలం ఏరియాలోని జేకే-5, కోయగూడెం ఉపరితల గనుల ద్వారానే బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. పరిశ్రమ ఏదైనా ఉంటే ఆ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో రంగాల మందికి ఉపాధి లభిస్తుంది. ఎన్నో వ్యాపారాలు కొనసాగుతాయి. కానీ పరిశ్రమలు అంతరించిపోతే పలు రంగాలపై ఆధారపడిన ఎంతో మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకొంది.

ఎదురుచూపులు..: బొగ్గుట్టకు పూర్వవైభవం రావాలంటే సింగరేణి నూతన గనుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. భూగర్భ, ఉపరితల గనులు ఏర్పడితేనే బొగ్గుట్ట మళ్లీ కళకళలాడుతుంది. ప్రస్తుతం సింగరేణి సంస్థ జేకే-5 గని విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు చర్యలు చేపడుతుంది. సుమారు 12 ఏళ్ల జీవితకాలం ఉండే విధంగా గనిని ఏర్పాటు చేయాలని చర్యలు చేపడుతున్నారు. అందుకోసం జీఎం మల్లెల సుబ్బారావు ఆధ్వర్యంలో అధికారులు నిత్యం కృషి చేస్తున్నారు. ఈ గని ద్వారా సంవత్సరానికి 25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. మొత్తం 128 మంది నిర్వాసితులు ఉన్నట్లు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
మూతపడనున్న ఉపరితల గని
ఇల్లెందు ఏరియాలో రెండు ఉపరితల గనులు, ఒక భూగర్భ గని ఉండేది. అయితే 21 ఇంక్లైన్‌ భూగర్భ గని కారణంగా సంస్థ నష్టాలపాలవుతుందనీ దాన్ని ఇటీవల పూర్తి స్థాయిలో మూసేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న జేకే 5 ఉపరితల గని జీవితకాలం మరో 8 నెలలు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి, ఓబీ పనులను సింగరేణి సంస్థ చేపడుతుంది. ఒక వేళ ఓబీ పనులు ప్రైవేటు సంస్థ చేపడితే దాని జీవిత కాలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ గనిలో ప్రస్తుతం అధికారులు, కార్మికులు కలిపి మొత్తం 280 మంది పని చేస్తున్నారు. ఈ గని కారణంగా కార్మికులతోపాటు ఒప్పంద కార్మికులైన సివిల్‌, వాటర్‌ సప్లై, లోడింగ్‌, ఆన్‌లోడింగ్‌, లారీల ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర వ్యాపార రంగాలు, హోటళ్లు సుమారు 4 వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఈ గని మూతపడితే వీరందరూ తీవ్ర ఇబ్బందులు పడుతారు. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని