logo

తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా

భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు.

Published : 26 Apr 2024 03:15 IST

కూసుమంచి, న్యూస్‌టుడే:  భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. పాలేరులో గురువారం నిర్వహించిన కూసుమంచి మండల భారాస విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందన్నారు. మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించలేదని చెప్పారు. రంజాన్‌ మాసంలో ముస్లింలకు తోఫా ఇవ్వకుండా అవమానించారన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ పదేళ్లు కరవు లేని పాలన అందించారన్నారు. గత ఎన్నికల హామీలను అమలుపర్చలేని తనను జనం నమ్మే పరిస్థితి లేదని గ్రహించిన ముఖ్యమంత్రి దేవుళ్ల మీద ప్రమాణాలు చేసి ఓట్లడుగుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ మాట్లాడుతూ రైతు బిడ్డ నామా నాగేశ్వరరావు, గడి దొరల బిడ్డకు మధ్య పోటీ జరుగుతోందని, నామాను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలంతా తన కుటుంబ సభ్యులనే సేవలందించానని, ఎన్నికల్లో మాత్రం తనను ఆదరించలేదన్నారు. తన ఓటమిలో పార్టీ కార్యకర్తలు, నాయకత్వం అలసత్వం కూడా ఉందని చెప్పారు. నష్టాన్ని పూడ్చుకోవడం అందరి కర్తవ్యమని, నామా నాగేశ్వరరావుకు పాలేరు నుంచి ఆధిక్యతను తెచ్చిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.  ఎంపీపీ బానోతు శ్రీనివాస్‌, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌, పార్టీ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, కార్యదర్శి ఆసిఫ్‌పాషా, ఎంపీటీసీ సభ్యుడు బజ్జూరి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని