logo

బాలింత మృతి..

కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్‌)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.

Published : 26 Apr 2024 02:59 IST

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళన

కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్‌)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతిచెందిందని బంధువులు ఆరోపించారు. జూలూరుపాడు మండలం టోక్యాతండాకు చెందిన బానోతు చంద్ర(27) తొలి కాన్పు కోసం ఎంసీహెచ్‌లో బుధవారం చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి 11 గంటల సమయంలో సాధారణ ప్రసవం చేశారు. అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భసంచి తొలగించాల్సి వచ్చింది. అపస్మారక స్థితికి చేరుకున్న బాలింతకు ఆక్సిజన్‌ అందించి వైద్యం చేశారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు పేర్కొన్నారు. ఎంసీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణం సంభవించిందని, బాలింత చనిపోయినా ఆ విషయం చెప్పకుండా పెద్దాసుపత్రికి తరలించారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధామోహన్‌ను వివరణ కోరగా.. ప్రసవం అనంతరం చంద్రకు అధిక రక్తస్రావం జరిగిందని, ఈ కారణంగా కార్డియాక్‌ అరెస్టుతో ఆమె మృతిచెందినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే మరణం సంభవించిందని, సేవల్లో వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదన్నారు.


గంధసిరిలో యువకుడి దారుణ హత్య

ముదిగొండ, న్యూస్‌టుడే: పాత గొడవల నేపథ్యంలో పథకం ప్రకారం ఓ యువకుణ్ని దారుణంగా హతమార్చిన ఘటన ముదిగొండ మండలంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గంధసిరికి చెందిన షేక్‌ సొందుబీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. ఆమెకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు షేక్‌ షరీఫ్‌(25) రెండు నెలలుగా హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఓ వివాహేతర సంబంధం విషయంలో గంధసిరికి చెందిన మామిడి వెంకటేశ్వరరావు, మామిడి వంశీతో ఇతనికి కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షరీఫ్‌ బుధవారం ఉదయం గంధసిరి వచ్చాడు. తన స్నేహితుడు గోపితో కలిసి కూల్‌డ్రింక్‌ తాగేందుకు రాత్రి వేళలో బైక్‌పై వెళ్లాడు. పాఠశాల సెంటర్‌లో ఉన్న మామిడి వెంకటేశ్వరరావు, వంశీలు పాత వివాదాలు మనసులో పెట్టుకుని పథకం ప్రకారం గొడవపడ్డారు. బైక్‌ వెనక కూర్చున్న షరీఫ్‌ను కిందపడేసి కాళ్లతో తన్నుతూ, చేతులతో కొడుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. మర్మాంగాలు, పొట్టపై ఇద్దరూ బలంగా కొట్టడంతో బాధితుడు స్పృహ కోల్పోయాడు. దీంతో నిందితులిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం నిమిషాల వ్యవధిలో షరీఫ్‌ చనిపోయాడు. సమాచారం అందుకున్న ఖమ్మం గ్రామీణం సీఐ రాజిరెడ్డి, ఎస్‌ఐ నరేశ్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పథకం ప్రకారమే తన కుమారుడు షరీఫ్‌ను వెంకటేశ్వరరావు, వంశీలు చంపారని మృతుడి తల్లి సొందుబీ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేశ్‌ తెలిపారు.


రూ.2.18 కోట్లకు స్థిరాస్తి వ్యాపారి ఐపీ

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం పాకబండ బజార్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి క్షత్రియ రవీంద్రనాథ్‌సింగ్‌ స్థానిక ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో రూ.2,18,10,000లకు గురువారం ఐపీ దాఖలు చేశారు. గత కొన్నేళ్లుగా ఖమ్మంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న పిటిషనర్‌ రవీంద్రనాథ్‌.. ప్రతివాదుల వద్ద అప్పులు తీసుకున్నాడు. కొవిడ్‌ తదితర కారణాల వల్ల నష్టాలు రావడంతో రుణదాతలకు బాకీలు చెల్లించే పరిస్థితి లేదని పేర్కొంటూ న్యాయవాది ద్వారా కోర్టులో ఐపీ దాఖలు చేశాడు.


అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక బ్రిడ్జి పాయింట్‌లో అభయాంజనేయస్వామి వారి ఆలయం పక్కన ఉన్న బస్‌ షెల్టర్‌లో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండటాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. వృద్ధుడు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బంధు సత్యనారాయణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భద్రాచలం వచ్చిన అతని కుమారుడు రవీంద్ర ఫిర్యాదు మేరకు ఎస్సై విజయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన తండ్రి సత్యనారాయణ ఈ నెల 18 ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదని అతని కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. వడదెబ్బ కారణంగానా? లేక ఇతర కారణాలేమేనా ఉన్నాయా? అని పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని