logo

‘ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌దే గెలుపు’

ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.

Published : 26 Apr 2024 03:17 IST

ఈటీవీ, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి గురువారం హాజరై మాట్లాడారు. ఖమ్మం జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే గత శాసనసభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ ఆధిక్యం తీసుకొచ్చేలా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. జిల్లాలో పార్టీ ముఖ్యనేతలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే రఘురాంరెడ్డి అభ్యర్థిత్వాన్ని అదిష్ఠానం ఖరారు చేసిందని పేర్కొన్నారు.    ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ ఖిల్లా అని మరోసారి నిరూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే భారీ విజయం తథ్యమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పదేళ్ల భారాస పాలన దరిద్రాన్ని వదిలించుకున్నామని, కేంద్రంలో పదేళ్ల భాజపా పాలనను వదిలించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్‌తో మనస్ఫూర్తిగానే స్నేహహస్తం కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌ మాట్లాడుతూ భువనగిరి మినహా మిగతా లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు తమ పార్టీ మద్దతిస్తుందని తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి నామినేషన్‌ సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు కాల్వొడ్డు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించాయి. ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాందాస్‌నాయక్‌, మట్టా రాగమయి, జారె ఆదినారాయణ, డీసీసీ     అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌, ఖమ్మం నగర అధ్యక్షుడు జావిద్‌, నాయకులు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్‌, నిరంజన్‌రెడ్డి, కమర్తపు మురళి, సాధు రమేశ్‌రెడ్డి, పిడమర్తి రవి, చంద్రశేఖర్‌, జైపాల్‌, సీపీఎం, సీపీఐ నాయకులు నున్నా నాగేశ్వరరావు, బాగం హేమంతరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని