logo

పరీక్షలతో పరేషాన్‌..!

శరీరంలో జీవప్రక్రియలను నియంత్రించే థైరాయిడ్‌ గ్రంధికే సమస్యలు వస్తున్నాయి. దీంతో బాధితులు వివిధ రుగ్మతల బారిన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోనూ థైరాయిడ్‌ రోగుల సంఖ్య గణనీయంగానే

Published : 25 May 2022 01:44 IST

మన్యం ప్రాంతంలో అధికంగా థైరాయిడ్‌ గ్రంధి బాధితులు

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

శరీరంలో జీవప్రక్రియలను నియంత్రించే థైరాయిడ్‌ గ్రంధికే సమస్యలు వస్తున్నాయి. దీంతో బాధితులు వివిధ రుగ్మతల బారిన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోనూ థైరాయిడ్‌ రోగుల సంఖ్య గణనీయంగానే ఉన్నట్లు వైద్య పరీక్షలు నిర్ధారిస్తున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ వాసుల్లో ఈ సమస్య అధికంగా ఉంటోంది. చికిత్సల పరంగా అన్ని సదుపాయాలు ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షల నిర్వహణ లేకపోవడం బాధితులకు ఇబ్బందిగా మారింది. నేడు థైరాయిడ్‌ నివారణ దినం సందర్భంగా స్థానిక పరిస్థితులపై కథనం..

డబ్బులు చెల్లించి.. ప్రైవేటుగా

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో థైరాయిడ్‌ పరీక్షల సదుపాయం లేకపోవడంతో వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా ప్రధానాసుపత్రిలోని తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రంలో కొంత కాలం వరకు ఈ పరీక్షలను ఉచితంగా చేశారు. గడిచిన రెండు నెలలుగా నిలిచిపోయాయి. పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి సేకరించిన నమూనాల్లో ప్రతిరోజు 250 మందికి ఈ పరీక్షలు చేయాలి. ముఖ్యంగా గర్భిణుల్లో సమస్యను తరచూ అంచనా వేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటులో డబ్బులు చెల్లించి చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.


‘‘థైరాయిడ్‌ సమస్య ఉన్న వారు క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, పాలకూర, ముల్లంగి, సోయాబీన్‌, స్ట్రాబెర్రీస్‌ తినడం తగ్గించాలి. పాలు, వెన్న, మాంసం, చేపలు, కర్జూరం, గుడ్లు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మందుల ద్వారా సమస్యను అధిగమించే అవకాశం ఉంది. వైద్య సలహాలు పాటిస్తున్న వారు థైరాయిడ్‌ నుంచి విముక్తి పొందుతున్నారు.’

- వైద్య నిపుణుడు


థైరాయిడ్‌ లక్షణాలు ఉన్నవారిని ఎన్‌సీడీ ప్రోగ్రాంలో గుర్తించే ప్రక్రియ సాగుతోంది. బాధితుల్లో పిల్లలు, పెద్దలు ఉంటున్నారు. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. బాధితులను గుర్తించి ప్రాథమిక దశలోనే చికిత్సలు అందించేందుకు కృషి చేస్తున్నాం.’’

-డాక్టర్‌ కోటిరత్నం, ఖమ్మం ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి


ఖమ్మం టీహబ్‌లో థైరాయిడ్‌ పరీక్షల వివరాలు

(జనవరి నుంచి మార్చి వరకు)

పరీక్షలు: 7096

బాధితులు: 1156

మహిళలు: 50 శాతం

పిల్లలు: 20 శాతం

భద్రాద్రి కొత్తగూడెం..

పరీక్షలు: 8 వేలు

బాధితులు: 1476

(ఆరుగురికి థైరాయిడ్‌ క్యాన్సర్‌ చికిత్సలు అందించారు.)


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని