logo

కోతకొస్తోంది.. కాస్త ఆగరూ..!

ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డు రహదారి నిర్మాణానికి భూసేకరణ పూర్తయింది. జిల్లాలో 60 మీటర్ల వెడల్పుతో 89 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మించనున్నారు.

Published : 23 Jan 2023 03:27 IST

గ్రీన్‌ఫీల్డు మార్గంలో మొదలైన నిర్మాణ పనులు
కొణిజర్ల, వేంసూరు, న్యూస్‌టుడే

దుద్దెపూడి సమీపంలో రహదారికి సేకరించిన భూమిలో సాగవుతున్న మొక్కజొన్న

ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డు రహదారి నిర్మాణానికి భూసేకరణ పూర్తయింది. జిల్లాలో 60 మీటర్ల వెడల్పుతో 89 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మించనున్నారు. భూసేకరణ పూర్తవడంతో అధికారులు పనులు ప్రారంభించారు. డోజర్లతో భూమిని చదును చేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పనులు ఆలస్యమవుతాయనే ఉద్దేశంతో రహదారికి సేకరించిన భూమిలో రైతులు పలు పంటలు సాగు చేశారు. ఆ పంటలు చేతికి రావాలంటే కొన్ని ప్రాంతాల్లో పక్షం నుంచి నెల రోజులు పట్టే అవకాశం ఉంది. రెండో పంట వేసే సమయంలోనే అధికారులు సేకరించిన భూమిలో సాగు చేయొద్దని సూచించినా రైతులు మొక్కజొన్న, మిరప, ఇతర పంటలు వేశారు.

ఆందోళనలో రైతులు

ఖమ్మం- దేవరపల్లి గ్రీన్‌ఫీల్డు మార్గం జిల్లాలో చింతకాని, కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల మీదుగా వెళ్తుంది. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించింది. యాసంగి సమయంలో ఆయా గ్రామాల్లో అధికారులు పంటలు వేయొద్దని సూచనలు చేశారు. కానీ పనులు ప్రారంభానికి ఎక్కువ రోజులు పడుతుందని ఆలోచనతో కొందరు మొక్కజొన్న సాగుచేయగా, మరికొందరు వదిలేశారు. వేంసూరు, కల్లూరు, తల్లాడ మండలాల్లో ఎక్కువ శాతం మాగాణి భూములు ఉండటంతో అక్కడ వానాకాలం వరి కోతలయ్యాక మళ్లీ ఎలాంటి పంటలు సాగులో లేవు. మిగతా మండలాల్లో వానాకాలంలో వేసిన మిరప, పత్తి ఇంకా పొలాల్లోనే ఉంది. కొందరు రైతులు పత్తిని తొలగించి మొక్కజొన్న వేశారు. ఆ పంట చేతికి రావాలంటే కనీసం నెల సమయం పడుతుంది. అప్పటిదాకా పనులు నిలిపివేయాలని రైతులు కోరుతుండగా, ముందే చెప్పాం కదా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పొలాల దగ్గర రహదారి సిబ్బందికి, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటోంది.

పరిహారం అందక ఇక్కట్లు

కొందరు గ్రీన్‌ఫీల్డు నిర్వాసితులకు పరిహారం అందలేదు. సర్వే సమయంలో లోపాలు, ఇతరత్రా సమస్యలే ఇందుకు కారణం. గోపవరంలో ఓ రైతుకు, పెద్ద మునగాలలో శ్రీను అనే రైతుకు పరిహారం దక్కలేదు. వీరంతా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి మండలంలోనూ పదుల సంఖ్యలో ఇలాంటి వారున్నారు. తమ పొలాల్లో పనులు చేపట్టవద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాంటి భూముల్లో పనులు జరగకుండా సిబ్బంది కూడా చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని