logo

Bhadrachalam: రామాలయం టికెట్లలో మాయాజాలం..!

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి  ఆలయంలో పాత టికెట్లు బయటపడడం సంచలనంగా మారింది.

Updated : 20 Jul 2023 08:56 IST

రామాలయంలో టికెట్‌ కౌంటర్‌

భద్రాచలం, న్యూస్‌టుడే : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి  ఆలయంలో పాత టికెట్లు బయటపడడం సంచలనంగా మారింది. అధికారుల అనుమతి లేకుండా వీటిని ఇంతకాలం భద్రపర్చడం విమర్శలకు తావిస్తోంది. కొద్ది నెలల కిందట కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. కొత్త రుసుములు అమల్లోకి వస్తే పాత వాటిపై కొత్తగా స్టాంప్‌ తరహాలో ముద్ర వేయాలి. ఆ తర్వాత విక్రయించాలి. లేదా పాత వాటిని అధికారుల అనుమతితో తొలగించాలి. అన్ని రకాల రుసుముల్లో ఇదే విధానం పాటించారు. రూ.50 విలువైన టికెట్‌ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చాటారు. గతేడాది ముద్రించిన టికెట్‌ పుస్తకాలు ఇప్పుడు లభించడం వెనుక అంతు చిక్కని మాయాజాలం ఉందన్నది భక్తుల భావన. ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజులకే కార్యాలయంలో అనధికారిక  టికెట్లు  బయటకు రావడం విస్మయానికి గురి చేస్తోంది.

ఇదీ పద్ధతి

రామాలయంలో రూ.50 నుంచి  రూ.1,500 విలువైన రుసుములతో దర్శనాలు, పూజలకు అవకాశం కల్పిస్తారు. వీటిని అనుమతి పొందిన సంస్థలో ముద్రిస్తారు. ఒక్కో పుస్తకంలో 100 టికెట్లు ఉంటాయి. ఇవి   ఆలయానికి చేరాక ఇందులో అచ్చుకానివి ఉన్నా.. ఒకే నంబర్‌తో ఎక్కువ ఉన్నా వాటిని అధికారుల అనుమతితో తొలగిస్తారు. ఆ తర్వాతే కౌంటర్లలో విక్రయిస్తారు. ఒక రోజుకు ఏ సీరియల్‌ నంబర్‌ నుంచి ఎక్కడి వరకు విక్రయించారో నమోదు చేస్తారు. కింది స్థాయి నుంచి   ఏఈఓల స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది. రూ.కోట్ల    లావాదేవీలు సాగే విభాగం కావడంతో రోజూ సాయంత్రం లెక్కల ప్రక్రియ పూర్తవుతుంది. ఇందులో ఎలాంటి లోపం తలెత్తినా ఈఓకు సమాచారం చేరవేస్తారు.

ఏం జరిగిందో కానీ..

రెండ్రోజుల కిందట ఒక ఉద్యోగి తనిఖీ చేస్తుండగా రూ.50 విలువైన పాత టికెట్‌ పుస్తకాలు మూడు అదనంగా ఉన్నట్లు సమాచారం. కొత్త పుస్తకాల నుంచి     టికెట్లను జారీ చేస్తున్నప్పటికీ పాతవాటిని ఎందుకు ఉంచారన్నది తేలాలి. వీటిని తెలిసో తెలియకో కౌంటర్లకు పంపిస్తే నకిలీ టికెట్లు విక్రయిస్తున్నారనే అపవాదు తప్పదు. ఇది ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశం. ఈ సంగతి తెలుసుకున్న ఈఓ ఓ కీలక ఉద్యోగికి విచారణ    బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

వస్త్రాల విభాగంపై రగడ

ఉత్సవాల నిమిత్తం ముందస్తుగా రామాలయం నుంచి నగదు తీసుకున్న సిబ్బంది వస్త్రాలను కొని ఆలయానికి అప్పగించారు. ఇలా వస్త్రాలను అప్పగించినట్లు పుస్తకాల్లో పొందుపర్చారు. ఆ పుస్తకాలు లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. దాతలు ఇచ్చిన కొన్ని వస్త్రాల విషయంలోనూ ఇదే తంతు. టికెట్ల విషయంపై ఈఓ రమాదేవి మాట్లాడుతూ.. కొత్త రుసుములు అమల్లోకి వచ్చాక పాత రుసుము టికెట్లు  కొన్ని ఉన్నట్లు తెలిసిందన్నారు. ఇందులో ఎలాంటి మాయాజాలం లేదని, పూర్తి వివరాలను తెలుసుకుంటున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని