logo

నేడు రాములోరి చెంతకు సీఎం రేవంత్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నానికి హెలీకాప్టర్‌లో సారపాకకు చేరుకుని, అక్కడ్నుంచి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దర్శనానికి బయల్దేరతారు.

Updated : 11 Mar 2024 08:28 IST

భద్రాచలం, భద్రాచలం పట్టణం, మణుగూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే

ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నానికి హెలీకాప్టర్‌లో సారపాకకు చేరుకుని, అక్కడ్నుంచి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దర్శనానికి బయల్దేరతారు. రాములోరి దర్శనం అనంతరం మార్కెట్‌ యార్డులో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించి, అనంతరం మణుగూరులో సాయంత్రం జరిగే ప్రజా దీవెన సభకు హాజరుకానున్నారు. తొలిసారి సీఎం హోదాలో జిల్లాకు రానున్న రేవంత్‌రెడ్డికి అట్టహాసంగా స్వాగతం పలికేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. భద్రాచలంతో పాటు సభ జరిగే మణుగూరులో పోలీసు యంత్రాంగం పటిష్ఠ భద్రత చర్యలను చేపట్టింది. రామాలయ ప్రధాన వీధులు, వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద ఆదివారం నుంచే బందోబస్తు ఏర్పాటు చేశారు. జాగిలాలు, మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీలు జరిపారు. సీఎం రామాలయ సందర్శన సందర్భంగా మాడవీధుల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సారపాక నుంచి ఆలయం వరకు రోడ్డు మార్గంలో వాహన శ్రేణి సులభంగా చేరుకునేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సారపాకలో హెలిప్యాడ్‌, బందోబస్తు ఏర్పాట్లను కలెక్టర్‌ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్‌రాజు పర్యవేక్షించారు. భద్రాద్రి అభివృద్ధిపై సీఎం వరాలు కురిపిస్తారని ఆశిస్తున్న తరుణంలో ఈఓ రమాదేవి సైతం ప్రత్యేకంగా రూపొందించిన ప్రతిపాదనలను సమీక్షలో ఆయనకు అందజేయనున్నారు.  

మణుగూరు ఐటీఐ కళాశాలలో ముస్తాబవుతున్న సభా ప్రాంగణం

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యేలు

భద్రాచలం వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణం, మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జరిగే సభా కార్యక్రమాల ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు డా.తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తదితరులతో కలిసి సోమవారం పరిశీలించారు. ప్రజా దీవెన బహిరంగ సభా వేదిక, హెలిప్యాడ్‌ల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని పోలీసులకు మంత్రి సూచించారు. సీఎం పర్యటన విజయవంతానికి నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ ఛైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, గిరిజన సంక్షేమ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శరత్‌, కలెక్టర్‌ ప్రియాంక అల, ఏఎస్పీ పరితోశ్‌ పంకజ్‌, ఐడీడీఏ పీఓ ప్రతీక్‌ జైన్‌, భద్రాచలం ఆర్డీఓ దామోదర్‌రావు, తహసీల్దారు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


నేటి పర్యటనలో భద్రాద్రికి వరాలు దక్కేనా?

ఈనాడు, ఖమ్మం: తొలిసారి సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి రాములోరి సందర్శనకు రానుండటంతో ఆలయ వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పుణ్యక్షేత్రం దశ తిరిగేలా వరాలు కురిపిస్తారని భక్తజనం కూడా ఎదురుచూస్తున్నారు. యాదాద్రి తరహాలో భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రకటించినా, గోదావరికి ఇరువైపులా రూ.వెయ్యి కోట్లతో కరకట్టలు నిర్మించి వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పినా.. వాటిల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. మరోవైపు ఆలయ ప్రాకారాలు, నూతన వసతి గదులు, థీమ్‌ పార్క్‌, కాటేజీల నిర్మాణంతో పాటు కల్యాణ మండపం, మాడవీధులు విస్తరించాల్సి ఉంది. గోశాల అభివృద్ధి, 108 అడుగుల హనుమంతుడి విగ్రహ ఏర్పాటు ఆవశ్యకత నెలకొంది. పుణ్యక్షేత్ర అనుబంధ ఆలయాల వైభవం, భూముల పరిరక్షణకు తగిన కార్యాచరణ చేపట్టాలనే డిమాండ్‌ ఉంది. ఇన్నేళ్లుగా ముందుకు సాగని ఆయా అభివృద్ధి పనుల్లో సీఎం పర్యటనతో కదలిక వస్తుందని అంతా భావిస్తున్నారు.


వచ్చే అయిదేళ్లలో 20 లక్షల ‘ఇందిరమ్మ ఇళ్ల’ నిర్మాణం

భద్రాచలం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి, కలెక్టర్‌ ప్రియాంక అల, అధికారులు

కాంగ్రెస్‌ హామీలన్నీ నెరవేర్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలంలో ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 చొపున ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగు అమలయ్యాయని, అయిదో గ్యారంటీగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాములవారి చెంత సీఎం ప్రారంభిస్తారన్నారు. వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తొలి విడత స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు అందిస్తామన్నారు. ఆ తర్వాత స్థలం లేనివారికి దాన్ని కేటాయించడంతో పాటు ఎస్టీ, ఎస్సీ లబ్ధిదారులైతే రూ.6 లక్షలు అందజేయనున్నట్లు చెప్పారు. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక నియోజకవర్గంలోని కొందరు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.  పాత్రికేయులకు ఇళ్ల స్థలాలను కేటాయించి ఇళ్లు నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని, త్వరలో మరింత స్పష్టత వస్తుందని పొంగులేటి తెలిపారు.  


సీఎం పర్యటన కొనసాగుతుందిలా..

ఉ.8.45: హైదరాబాద్‌ నుంచి హెలీకాప్టర్‌లో యాదాద్రికి పయనం
9.00-10.30: యదాద్రి శ్రీలక్ష్మీనర్సింహాస్వామి దర్శనం
11.00: యాదగిరిగుట్ట నుంచి హెలీకాప్టర్‌లో బూర్గంపాడు మండలం సారపాకకు పయనం
మ.12.00: సారపాకకు రాక
12.10-12.50: రోడ్డు మార్గంలో భద్రాచలం రాక.. శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయ దర్శనం, అనంతరం ప్రత్యేక పూజలు..
1.00-2.00: ఆలయం నుంచి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు చేరిక.. ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు
2.00-2.30: భోజన విరామం
2.45-3.30: రామాలయ అభివృద్ధిపై సమీక్ష
3.30: వ్యవసాయ మార్కెట్‌ నుంచి రోడ్డు మార్గంలో సారపాక హెలిప్యాడ్‌కు రాక
3.50: హెలికాప్టర్‌లో మణుగూరుకు పయనం
సా.4.00: మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రజా దీవెన సభకు హాజరు
4.00-5.00: బహిరంగ సభలో ప్రసంగం
5.00: మణుగూరు నుంచి హైదరాబాద్‌కు హెలీకాప్టర్‌లో తిరుగు పయనం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని