logo

బ్రహ్మోత్సవాల రాబడి.. తేలేదెప్పుడండీ..?

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 9 నుంచి 23 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించినా ఈ క్రతువుపై వచ్చిన ఆదాయం ఎంతన్నది ఇప్పటికీ తేలలేదు.

Published : 06 May 2024 01:48 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 9 నుంచి 23 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించినా ఈ క్రతువుపై వచ్చిన ఆదాయం ఎంతన్నది ఇప్పటికీ     తేలలేదు. ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి కల్యాణ వేడుకలకు భక్తులు తరలివచ్చారు. ఆరోజు ఎంత రాబడి వచ్చిందనేది వారంలోపే వెల్లడించాల్సి ఉంటుంది. ఈసారి రెండు వారాలు దాటినా దీని ఊసెత్తటం లేదు. ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకొస్తారని ప్రచారం జరిగినా లోక్‌సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్‌) కారణంగా ప్రజాప్రతినిధులకు    ప్రొటోకాల్‌   అమలుచేయలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం హాజరుకాలేదు. ముఖ్యమంత్రి రాకపోవటంతో   ప్రజాప్రతినిధులకు కేటాయించిన సెక్టార్‌ను ఆలయాధికారులు రెండు విభాగాలు చేసి టికెట్లు విక్రయించారు. ఇందులో ఎన్ని అమ్మారో, ఎన్ని మిగిలాయో వెల్లడించలేదు.

గోప్యత వీడాలి

బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకాలేదు. సీఎం సెక్టార్‌కు రూ.10 వేల విలువైన 100 టికెట్లను అధికారులు కేటాయించారు. దీనికి ఆనుకుని ఉన్న మరో విభాగానికి రూ.5 వేల విలువైన 200 టికెట్లను విక్రయానికి ఉంచారు. ముగ్గురు మంత్రులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో రావటంతో ఈ విభాగానికి ఆదరణ లభించింది. వీటిపై రూ.20 లక్షలు రావాల్సి ఉంది. ఈ టికెట్లను రెవెన్యూశాఖ తరఫున విక్రయించటంతో ఆ లెక్కలపై స్పష్టత రావటం లేదు.ఇవికాకుండా రూ.7,500, రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150 విలువైన సెక్టార్‌ టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు కౌంటర్లలో విక్రయించారు. వీటిలో భారీగానే మిగిలాయి.

సెక్టార్‌ ఆదాయమే శ్రీరామరక్ష

  • 2 లక్షల లడ్డూలు అమ్మినప్పటికీ ప్రసాదాల తయారీకి ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే లాభాలు సాధారణ స్ధాయిలోనే ఉంటాయి.
  • రెండ్రోజుల క్రితం హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.1.31 కోట్ల కానుకలు వచ్చాయి. గతంతో పోల్చితే కానుకలు పెరిగాయి.
  • శ్రీరామనవమికి ప్రధానాలయంలో ఉచిత దర్శనాలు మాత్రమే ఉంటాయి. అందుకే ఆరోజు దర్శనంపై రాబడి సమకూరదు.
  • వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే సెక్టార్‌ టికెట్లపై సమకూరే రాబడే శ్రీరామరక్షగా ఉంటుంది.

ఖర్చులను వెల్లడించాలి

ఈసారి అన్ని విధాలుగా రూ.2 కోట్లకు పైగా ఖర్చయ్యింది. ఇందులో కొన్ని శాఖలకు నిబంధనల ప్రకారం రామాలయం నుంచి కొంత మొత్తాన్ని చెల్లించారు. తాము సమర్పించే ప్రతి పైసాకు పారదర్శకత రావాలంటే ప్రతి శాఖ చేసిన ఖర్చులను వెల్లడించాలని భక్తులు కోరుతున్నారు. పట్టాభిషేకం ఆదాయాన్నీ వెల్లడించి లోపాలేమైనా జరిగి ఉంటే గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని