logo

గాలివాన బీభత్సంతో గాఢాంధకారం

ఈదురుగాలులు, పిడుగులతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.

Published : 06 May 2024 01:49 IST

ఖమ్మం నగరంలో జలమయమైన రహదారి

ఖమ్మం రోటరీనగర్‌, న్యూస్‌టుడే: ఈదురుగాలులు, పిడుగులతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సాయంత్రం 5 గంటల తదుపరి నగరంతోపాటు, వివిధ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. చెట్లు, చెట్ల కొమ్మలు పడి విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. పిడుగుపాటుతో ఇన్సులేటర్లు కాలిపోయాయి. ఖమ్మం టౌన్‌, ఖమ్మం రూరల్‌ డివిజన్ల పరిధిలో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. గంటల తరబడి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో గాఢాంధకారం నెలకొంది. టేకులపల్లి, అల్లీపురం, ధంసలాపురం ఉప కేంద్రాల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి     పొద్దుపోయే వరకు సరఫరాను ఇవ్వలేకపోయారు.

ఖమ్మం గ్రామీణం: నంద్యాతండా శివారులో విరిగిపడ్డ స్తంభం

ఖమ్మం గ్రామీణం: మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అక్కడక్కడా వడగళ్లు పడ్డాయి. వెంకటగిరి, గుదిమళ్ల, నంద్యాతండా గ్రామాల పరిధిలో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి.  నియంత్రికలు నేలకూలాయి. 20 విద్యుత్తు స్తంభాలు, నాలుగు నియంత్రికలకు నష్టం వాటిల్లింది. నంద్యాతండాలో మూడు ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. మరో ఇంటి ఎదుట ఉన్న రేకులు కొట్టుకుపోయాయి. ఇళ్లలోని సామగ్రి ధ్వంసమైంది. ఓ ఇంటిపై విద్యుత్తు స్తంభం విరిగిపడింది. విద్యుత్తు సరఫరాను అధికారులు నిలిపివేశారు. వర్షం తీవ్రత తగ్గగానే మరమ్మతులు ప్రారంభించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని