logo

కరుగుతున్న గుట్టలు

జిల్లా సరిహద్దు మండలాలైన జూలూరుపాడు, ఏన్కూరు ప్రాంతాల నుంచి మట్టి రవాణా జోరందుకుంది. కొత్తగూడెం, పాల్వంచ చుట్టు పక్కల ప్రాంతాలకు సైతం రవాణా అవుతోంది.

Updated : 06 May 2024 05:56 IST

ఏన్కూరు, జూలూరుపాడు, న్యూస్‌టుడే

ఏన్కూరు: గార్లఒడ్డు సమీపంలో గుట్టకు తవ్వకాలు

జిల్లా సరిహద్దు మండలాలైన జూలూరుపాడు, ఏన్కూరు ప్రాంతాల నుంచి మట్టి రవాణా జోరందుకుంది. కొత్తగూడెం, పాల్వంచ చుట్టు పక్కల ప్రాంతాలకు సైతం రవాణా అవుతోంది. ఏన్కూరు మండలం నుంచి రోజూ జూలూరుపాడుకు టిప్పర్లు నడుస్తున్నాయి. రెండు మండలాల పరిధిలో అటవీ ప్రాంతాలు విస్తరించి ఉండటం అక్రమార్కులకు వరంగా మారింది. సీతారామ ప్రాజెక్టు మట్టిని అనుమతులు లేకుండానే తరలిస్తున్నారు. ఇప్పటికే చాలాచోట్ల మట్టి కట్టలు  తరిగిపోయాయి. అయినా ఆ ప్రాజెక్టు ఇంజినీర్లు స్పందించిన దాఖలాలు లేవు. భవిష్యత్తు అవసరాలకు ఈ కట్ట పటిష్ఠతకు మట్టి ఎంతో అవసరం. అయినా కాలువ నిర్మాణం పూర్తికాకుండానే మట్టి తరలిపోతుండటం గమనార్హం.

సెలవు రోజుల్లో మరింతగా..

కార్యాలయాలకు సెలవు ఉంటే చాలు. ఇక ముందు రోజు నుంచే తవ్వకాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మట్టి తవ్వకాలపై ఎవరైనా ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీన్నే అవకాశంగా భావించి ఒకేసారి పెద్దసంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు ఏర్పాటు చేసి తమ పనికానిచ్చేస్తున్నారు.

ఏన్కూరు కేంద్రంగా..

ఏన్కూరు మండలంలోని జన్నారం, గార్లఒడ్డు, నరసింహారావుపేట, భద్రుతండా, తిమ్మారావుపేట, నాచారం, హిమాంనగర్‌, అక్కినాపురంతండా సమీపంలోని గుట్టల నుంచి అనుమతులు లేకుండా మట్టి రవాణా చేస్తున్నారు. ఏన్కూరు మండలంలో గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి పేరిట అనుమతులకు మించి తవ్వకాలు జరుపుతున్నారనే ఆరోపణలున్నాయి.

ఎక్కడెక్కడంటే..

  • ఏన్కూరు మండలంలోని జన్నారం, కోనాయపాలెం, గార్లఒడ్డు, భద్రుతండా, తిమ్మారావుపేట, ఏన్కూరు ప్రాంతాల్లో మట్టి దందా కొనసాగుతోంది. గార్లఒడ్డు సమీపంలో    అనుమతులు లేకుండా గుట్టల వద్ద యంత్రాలు సిద్ధంగా ఉండటం గమనార్హం.
  • కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగు, సింగరాయపాలెం, శ్రీనివాసనగర్‌, గద్దలగూడెం, అంజనాపురం సమీపంలో మట్టి తవ్వకాలు రాత్రిపూట జరుగుతున్నాయి. తనికెళ్ల, గుబ్బగుర్తి, బోడ్యాతండా, రామనర్సయ్యనగర్‌లతో ఎన్నెస్పీ భూముల్లో మట్టి తవ్వుతున్నారు.  
  • కారేపల్లి మండలం బస్వాపురం, పోలంపల్లి, అప్పాయిగూడెం, ముత్యాలగూడెంతోపాటు పలుచోట్ల తవ్వకాలు జరుపుతున్నారు. రెండో శనివారం, ఆదివారం, సెలవు రోజుల్లో తోలకాలు ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నారు.
  • రఘునాథపాలెం మండలంలో పలుచోట్ల, పెనుబల్లి మండలం లంకాసాగర్‌లో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారు.

ఎన్నికల విధుల్లో ఉన్నాం

సాయినాథ్‌, ఏడీ మైనింగ్‌ ఖమ్మం

మట్టితోలకాల వివరాలు భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని