logo

అంతా.. పోలింగ్‌ కేంద్రాలకు కదలాలంటే...!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మధ్యాహ్నం బయట తిరగలేని పరిస్థితి. ఏ రోడ్డు చూసినా నిర్మానుష్యమే. 2019లో పోలింగ్‌ ఏప్రిల్‌ 11వ తేదీనే జరిగింది.

Updated : 07 May 2024 06:24 IST

మెరుగైన వసతులు, ఓటు విలువపై చైతన్యం అవసరం

పాల్వంచ, న్యూస్‌టుడే: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మధ్యాహ్నం బయట తిరగలేని పరిస్థితి. ఏ రోడ్డు చూసినా నిర్మానుష్యమే. 2019లో పోలింగ్‌ ఏప్రిల్‌ 11వ తేదీనే జరిగింది. ఆ సమయంలో ఇప్పుడున్నంత అధిక ఉష్ణోగ్రతల్లేవు. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. భానుడి ప్రతాపాన్ని తట్టుకుని, గంటలపాటు వరుసలో నిల్చునే ఓపిక ఎంతమంది ఓటర్లకు ఉంటుందన్నదే ప్రశ్నగా మారింది. ఎన్నికలేవైనా ముఖ్యంగా పట్టణ ఓటర్లలో అనాసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది, ఓటర్లకు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించేలా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి. ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేలా అన్ని వసతులు కల్పించడమే కాకుండా, పోలింగ్‌ ప్రాధాన్యాన్ని గుర్తించేలా అవగాహన పెంపొందించాలి.

ఇలా చేస్తే బాగుంటుంది

  •  ఖమ్మం జిల్లాలో 1,459, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,105 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిల్లో బూత్‌ల ఎదురుగా, క్యూలైన్లు ఉండే ప్రాంతంలో బారుగా షామియానాలు నిలపాలి. తాత్కాలిక చలువ పందిళ్లు వేయాలి. ప్రతి కేంద్రంలో కూలర్లు, ఫ్యాన్లు తప్పకుండా ఉండేలా చూడాలి. దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక వరుస, బల్లలు వంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
  •  విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిన సందర్భాల్లో ఇబ్బందిలేకుండా జనరేటర్‌ సదుపాయం ఏర్పాటు చేయాలి. ప్రతి కేంద్రం వద్ద చల్లని తాగునీరు, వైద్య శిబిరం వంటి సౌకర్యాలు కల్పించాలి.
  • ‘సాక్ష్యం’ యాప్‌లో ఓటర్లు వివరాలు నమోదు చేసి సమస్య వివరిస్తే.. ఇంటి వద్దకే వాహనం పంపి, ఓటేశాక మళ్లీ తీసుకొచ్చేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వెసులుబాటుపై ప్రచారం చేయాలి.
  • ఈవీఎంల మొరాయింపు, సిబ్బంది ఆలస్యం వంటి కారణాలతో గత ఎన్నికల్లో రాత్రి వరకు పోలింగ్‌ జరిగిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఎన్నికల సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేయాలి.
  • ‘స్వీప్‌’ విభాగం ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టాలి. ‘ఉపాధి’ పని ప్రదేశాల్లో కూలీలకు అవగాహన కల్పించాలి. ప్రహరీలపై ఓటు ప్రాధాన్యం, పోలింగ్‌ సమాచారం తెలిపేలా చిత్రాలు గీయించాలి. పట్టణాల్లో యువత, సీనియర్‌ సిటిజన్స్‌, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో 2కె రన్‌, 5కె రన్‌, సైకిల్‌ ర్యాలీ వంటి కార్యక్రమాలు నిర్వహించాలి.
  • ‘ఇంటి నుంచి ఓటేసే’ సౌకర్యానికి దూరంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ఇతర అసహాయులు సులభంగా ఓటేసే వెసులుబాటును పోలింగ్‌ యంత్రాంగం కల్పిస్తే పోలింగ్‌ శాతం మెరుగవుతుంది.
  • పోలింగ్‌ నెమ్మదిగా కొనసాగే కేంద్రాలపై సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ వ్యవస్థల ద్వారా ఎన్నికల అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలి.
  • విద్యుత్తు, సింగరేణి, గ్రానైట్‌ వంటి భారీ పారిశ్రామిక సంస్థల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు. వీరంతా ఓటుహక్కు వినియోగించుకునేలా విధుల నిర్వహణపరంగా యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకోవాలి. మహిళా ఉద్యోగులకు రంగవల్లులు, ఇతరులకు క్విజ్‌ వంటి పోటీలు నిర్వహించాలి.
  • స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలతో పాటు ఏ పార్టీ, క్రైం నేపథ్యం లేని యువతతో ‘పోల్‌ వాలంటీర్‌’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఓటర్లను చక్రాల కుర్చీల్లో తీసుకెళ్లడం, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరందించడం, బూత్‌ల వివరాలు తెలుపడం వంటి సేవల్లో వినియోగించుకోవాలి.  
  • రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముందే జరిగాయి. ప్రస్తుతం లోక్‌సభకు కావడంతో ఓటు వినియోగంపై కొందరిలో అనాసక్తి ఉంటుంది. బూత్‌ స్థాయి సిబ్బంది, రాజకీయ పార్టీల సహకారంతో ఓటువిలువ గుర్తించేలా చైతన్యపరచాలి.

2004 నుంచి 2019 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఓటుహక్కు వినియోగించుకోని ఓటర్లు 11.30 (20.3%) లక్షల మంది ఉన్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు పోలింగ్‌ కేంద్రానికి దూరంగా ఉన్నవారే కావడం గమనార్హం. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా, పట్టణ ప్రాంతాల్లో అత్యల్ప ఓటింగ్‌ శాతం నమోదవుతోంది. ఈసారి ఎన్నికల్లో పుర ఓటర్లు చైతన్యంతో పోలింగ్‌ కేంద్రాలకు కదలిరావాలి.

ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గంలో...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు