logo

ఓటు మేలు తలపెట్టవోయ్‌

‘ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీని సద్వినియోగం మనందరి బాధ్యత. అయిదేళ్లు పాలించాల్సిన ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో నిర్ణయించుకునే అవకాశాన్ని ప్రజాస్వామ్యం మన చేతుల్లోనే పెట్టింది.

Published : 09 May 2024 03:21 IST

ఇది గమనించారా..రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు కీలక హామీలను గమనించండి. అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకోండి.
‘ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీని సద్వినియోగం మనందరి బాధ్యత. అయిదేళ్లు పాలించాల్సిన ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో నిర్ణయించుకునే అవకాశాన్ని ప్రజాస్వామ్యం మన చేతుల్లోనే పెట్టింది. అలాంటి విలువైన ఓటును వినియోగించుకోవాలన్న ఆసక్తే మనలో లేకుండా పోతే ఎలా? ఇదెంత వరకు సమంజసం?’

- ప్రతి ఓటరూ తమకు తాము విధించుకోవాల్సిన ప్రశ్న ఇది. కొన్నిదేశాల్లో ఓటేయడం నిర్బంధం. లేదంటే ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారు. కానీ, నిర్బంధం లేకుండా, స్వేచ్ఛగా ఓటేసే అవకాశాన్ని మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ కల్పిస్తోంది. అయినా లోక్‌సభ స్థాయి ఎన్నికల్లో పోలింగ్‌ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కావడంలేదు. ఓటర్లలో సగానికి పైగా వాటా యువతదే. ఉభయ జిల్లాల్లో ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో పాల్గొనే దిశగా వీరంతా సమాయత్తం కావాలి. కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు ఓటర్లను చైతన్యవంతుల్ని చేయాలి. అన్నివర్గాల వారు వట్టిమాటలు కట్టిపెట్టి.. ఓటు మేలు తలపెట్టాలి.  
పాల్వంచ, న్యూస్‌టుడే: యువ సంఘాల చైతన్యం: గ్రామస్థాయిలో మహిళా మండళ్లు, పొదుపు సమాఖ్యలు, యువ సంఘాల కార్యవర్గాలు తమ పరిధిలోని ఓటర్లను పోలింగ్‌ రోజు సమీకరించేలా బూత్‌ లెవల్‌ అధికారులు చైతన్యం కలిగించాలి. సంఘాల వారూ పౌరులుగా తమ బాధ్యతను గుర్తించాలి. కరపత్రాలు, గోడపత్రాలతో ప్రచారం చేయాలి. లోకల్‌ కేబుల్‌ నెట్‌వర్క్స్‌, సామాజిక మాధ్యమ గ్రూప్‌లు వేదికగా ఓటు ప్రాధాన్యాన్ని తెలియజెప్పాలి.
శ్రామిక ‘శక్తి’ మేల్కొలుపు: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిశ్రమలకు నెలవు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కార్మిక ఓటర్లు వేలల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి, కేటీపీఎస్‌, నవభారత్‌, గ్రానైట్‌ తదితర రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులంతా పోలింగ్‌ సెలవును ఓటేసేందుకే వినియోగించుకునేలా ఆయా సంఘాల బాధ్యులు, యాజమాన్యాలు దిశానిర్దేశం చేయాలి.  

మీ విద్యార్థులు ఓటేస్తున్నారా?

ఇటీవల ఓటు నమోదుకు చొరవచూపిన ఉమ్మడి జిల్లాలోని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులంతా ఓటేసేలా చైతన్యం తేవాలి. విద్యా సంస్థల్లో ఈవీఎంలతో మాక్‌ పోలింగ్‌ ఏర్పాట్లు చేయించాలి. వీలైతే విద్యార్థులు, తల్లిదండ్రులతో నిర్వహించే వాట్సాప్‌ గ్రూప్‌లలో పోలింగ్‌ వివరాలు, చైతన్య సందేశాలు పంపాలి.
భావి ఓటర్లే వారధులుగా..: భవిష్యత్‌ ఓటర్లైన 18 ఏళ్లలోపు విద్యార్థులకు మాక్‌ పార్లమెంట్‌, నమూనా ఎన్నికలు, విద్యార్థి కమిటీలు, ఓటు ప్రతిజ్ఞ కార్యక్రమాల ద్వారా ఎన్నికల సంఘం అవగాహన కల్పిస్తోంది. పిల్లల ద్వారా తల్లిదండ్రుల సంతకంతో కూడిన ఓటరు ప్రతిజ్ఞ పత్రాలు ఇటీవల జిల్లా ఎన్నికల యంత్రాంగం స్వీకరించింది. ఇప్పుడు తల్లిదండ్రులంతా ఓటేసేలా విద్యాలయాల నిర్వాహకులు చైతన్యపరచాలి.

సభాముఖంగా..

బూత్‌ లెవల్‌ అధికారులు, కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామసభలు, ఉపాధి పని ప్రదేశాలు, ఇతర సమావేశాలకు హాజరైన వారికి ఓటుహక్కుపై చైతన్యం కలిగించాలి. నమూనా ఈవీఎంల సాయంతో ఓటేయడంపై అవగాహన కల్పించాలి. పారిశుద్ధ్య వాహనాలు మైకులతో ప్రచారం చేసేలా చూడాలి.  
సామాజిక బాధ్యత: పట్టణాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీ సంక్షేమ సంఘాలు స్థానిక ఎన్నికల యంత్రాంగానికి సహకరిస్తూ.. తమ పరిధిలోని ఓటర్లంతా పోలింగ్‌కు తరలివెళ్లేలా కీలకపాత్ర పోషించాలి. సీనియర్‌ సిటిజన్స్‌, ఇతర సేవా, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో కలిసి చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. నాటకాలు, కళాజాత, తోలుబొమ్మల ప్రదర్శనలు, ఉద్యానవనాలు, కూడళ్లలో ఫ్లెక్సీలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు వంటివి ఏర్పాటు చేయించాలి.  
ఉద్యోగ సంఘాలూ..: ఓటర్లలో ఎక్కువగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఆయా ఉద్యోగులు సభ్యులుగా ఉన్న సంఘాలు సమావేశాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించి వంద శాతం మంది ఓటేసేలా అవగాహన కల్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని