logo

టన్నుల బియ్యం.. ట్రక్కుల్లో మాయం

పేదల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి అధిక ధరలకు తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 03 Oct 2022 01:57 IST

కర్ణాటకకు పెద్దఎత్తున రవాణా


ఆదోనిలో పట్టుబడిన రేషన్‌ బియ్యం వాహనాలు, నిందితులను చూపుతున్న డీఎస్పీ వినోద్‌కుమార్‌, సీఐ గుణశేఖర్‌బాబు (పాత చిత్రం)

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: పేదల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి అధిక ధరలకు తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణా అరికట్టాల్సిన ఆయా శాఖల అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో నియంత్రించడంలో వైఫల్యం చెందుతున్నారు. పేదల బియ్యం యథేచ్ఛగా కర్నూలు జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రానికి ట్రక్కుల్లో  తరలిస్తూ.. రూ.కోట్లు గడిస్తున్నారు.

కర్నూలు జిల్లాకు 18 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. కిలో బియ్యం రూపాయి చొప్పున ఒక్కో లబ్ధిదారుడికి ఐదు కిలోలు బియ్యం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం ఒక్కో లబ్ధిదారుడికి ప్రతి నెలా ఐదు కిలోల ప్రకారం ఉచితంగా బియ్యం ఇస్తోంది. ఈ బియ్యాన్ని అక్రమార్కులు బొక్కేస్తున్నారు.

* రేషన్‌ బియ్యం తరలిస్తున్న అక్రమార్కుల్లో కొందరికి అధికార పార్టీ నేతలు కొందరు అండగా ఉంటున్నారు. ఫలితంగా అధికారులు పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.

ఇలా సేకరించి..

ప్రభుత్వం సరఫరా చేస్తున్న రాయితీ బియ్యానికి కర్ణాటక రాష్ట్రంలో మంచి డిమాండు ఉండడంతో కొందరు ఈ వ్యాపారం ఎంచుకొని యథేచ్ఛగా తరలించి జేబులు నింపుకొంటున్నారు. కొందరు ఏజెంట్లను నియమించుకొని ఇంటింటికి పంపి బియ్యం సేకరిస్తున్నారు. తర్వాత వాహనాల్లో కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. మరికొందరు డీలర్ల వద్దకే వెళ్లి నేరుగా కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. కిలో బియ్యానికి రూ.5 నుంచి రూ.8 వరకు చెల్లిస్తుండగా.. వాటిని కర్ణాటక రాష్ట్రంలో రూ.12 నుంచి రూ.14 వరకు డిమాండు బట్టి విక్రయిస్తున్నారు.

రాత్రివేళలో తరలిస్తూ..

కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలు కర్ణాటక రాష్టాన్ని ఆనుకుని ఉండటంతో శిరుగుప్ప, రాయచూరు, బళ్లారి వంటి ప్రాంతాలకు వాహనాల్లో బియ్యాన్ని తరలిస్తున్నారు. ఆదోని మండలం పెద్దహరివాణం చెక్‌పోస్టు మీదుగా, మంత్రాలయం నియోజకవర్గం మాధవరం, హొళగుంద మండలం మార్లమడికి, హాలహర్వి మండలం ఛత్రగుడి, కౌతాళం మండలం బాపురం చెక్‌పోస్టుల మీదుగా ఎవరికీ అనుమానం రాకుండా వాహనాల ముందుగా కొందరు పైలట్లను నియమించి అధికారులు దాడులు చేస్తున్నారా అన్న విషయం ఆరా తీస్తూ సరకును దాటించేస్తారు.

పలు వాహనాల సీజ్‌

కర్నూలు జిల్లా నందవరం మండలం గంగవరం సమీపంలో గత నెల 3వ తేదీన అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల రాయితీ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి 470 బస్తాల రేషన్‌ బియ్యం, 2 ట్రాక్టర్లు సీజ్‌ చేశారు.

ఆదోని పట్టణంలో ఆగస్టు 13వ తేదీన అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం రవాణాపై రెండో పట్టణ పోలీసులు దాడులు జరిపి 170 బస్తాల రేషన్‌ బియ్యం, 2 లారీలు, 2 ఆటోలను సీజ్‌ చేసి ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

ఆదోని పట్టణ శివారు ప్రాంతంలో ఏప్రిల్‌లో కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న లారీ రాయితీ బియ్యాన్ని ఇస్వీ పోలీసులు పట్టుకున్నారు. లారీతో పాటు దాదాపు 200 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి భారీగా రేషన్‌ బియ్యం తరలిపోతున్నా పూర్తిస్థాయిలో దాడులు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో నిఘా ఉంచి తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని