logo

బీసీలను అణచివేయడమే సీఎం జగన్‌ ధ్యేయం

బీసీలను అణచివేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని కర్నూలు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు.

Published : 07 Dec 2022 03:26 IST

ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపిన తెదేపా బీసీ నాయకులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: బీసీలను అణచివేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని కర్నూలు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. మంగళవారం తెదేపా జిల్లా కార్యాలయం ఆవరణలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని  నిరసన చేపట్టారు. బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ ఉన్నత పదవులు అగ్రవర్ణాలకు కట్టబెట్టారన్నారు. బీసీలకు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులిచ్చారు.. నిధులు మంజూరు చేయకుండా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పైసా ఖర్చు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం వెచ్చించాల్సిన నిధులు నవరత్నాలకు మళ్లించడం దారుణమన్నారు. పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లను కోత కోసి బీసీలకు పదవులు దూరం చేశారన్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన బీసీ సంక్షేమ పథకాలు తిరిగి అమలు చేయాలి.. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. తెదేపా బీసీ సెల్‌ రాష్ట్ర నాయకులు నంది మధు, తిరుపాల్‌బాబు, సంజీవలక్ష్మి, కార్పొరేటర్‌ పరమేశ్‌, తారానాథ్‌, రామాంజనేయులు, జేమ్స్‌, బాబురావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని