logo

అ.. ఆ లు రాయలేని.. ఆరో తరగతి విద్యార్థులు

బాల బాలికల్లారా రారండి.. ఆటలు, పాటలు పాడండి.. పలకా, బలపం తీసుకొని రారండి.. అ ఆ ఇ ఈ లు,  క్యాట్‌, రెడ్‌, సన్‌, న్యూ ఫ్యాన్‌, బస్‌’ ఆంగ్ల పదాలు స్పెల్లింగ్‌ చెప్పండి.

Published : 20 Jan 2023 01:55 IST

అసర్‌ నివేదిక-22 వెల్లడి

బాల బాలికల్లారా రారండి.. ఆటలు, పాటలు పాడండి.. పలకా, బలపం తీసుకొని రారండి.. అ ఆ ఇ ఈ లు,  క్యాట్‌, రెడ్‌, సన్‌, న్యూ ఫ్యాన్‌, బస్‌’ ఆంగ్ల పదాలు స్పెల్లింగ్‌ చెప్పండి.. తీసివేత లెక్కలు చేయండని’’ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6,7,8 తరగతి తరగతి విద్యార్థులకు ప్రశ్నలు సంధించగా సమాధానాలు చెప్పేందుకు తడబడ్డారు.


ప్రథమ్‌ సంస్థ చేపట్టిన సర్వే ఫలితాలను అసర్‌ నివేదిక-22 రూపంలో జనవరి 18న విడుదల చేసింది. రెండో తరగతికి చెందిన తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్యాంశాలను 6, 7, 8 తరగతి విద్యార్థులు అంతంత మాత్రంగానే చదవగలుగుతున్నారని.. లెక్కలు చేయడంలో తడబడుతున్నట్లు తేలింది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యమైన బోధన అందించాలని ప్రభుత్వాలు చెబుతున్నా ఫలితం కనిపించడం లేదు.

న్యూస్‌టుడే, కర్నూలు విద్య

ఉమ్మడి జిల్లాలో చదువు పరంగా పదో తరగతిలో విద్యార్థులు పలు అంశాల్లో వెనుకబడి ఉన్నారంటూ గతేడాది నవంబరులో నిర్వహించిన జాతీయ సాధన సర్వేలో వాస్తవాలు బయట పెట్టింది. పదో తరగతిలో మోడరన్‌ ఇండియన్‌ లాంగ్వేజీలో 38 శాతం, గణితంలో 29, సైన్సులో 33, సాంఘిక శాస్త్రంలో 35, ఆంగ్లంలో 48 శాతం మంది వెనుకబడి ఉన్నారని తేల్చింది. రేఖా గణిత నిర్మాణ దశలను పరిశీలించడం, ప్రతి దశను వివరించే అంశంలో 19 శాతం మాత్రమే లెక్కలు చేస్తున్నట్లు తేలింది. ఈ సర్వే ఆధారంగా ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.

ఇలా ఉంది తీరు

* ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లం, గణితాల్లో విద్యార్థుల సామర్థ్యాలు, విద్యాలయాల్లో సదుపాయాల పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రథమ్‌ సంస్థ సర్వే నిర్వహించింది.

* ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఆంగ్ల వాక్యాలను 21.5 శాతం, ప్రైవేటు బడుల్లో 48.3 శాతం మంది చదవగలిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో 78.5 శాతం, ప్రైవేటులో 51.5 శాతం మంది విద్యార్థులు వాక్యాలను చదవలేకపోయారు.

* ప్రభుత్వ బడుల్లో 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థులు 80 శాతం చదువుతున్నారు. ఈ వయస్సు ఉన్న పిల్లలు 3.3 శాతం మంది బడులకు దూరంగా ఉన్నట్లు సర్వేలో పేర్కొంది.

* గణితంలో తీసివేత లెక్కలను 3, 4, 5 తరగతుల విద్యార్థులు 45.4 శాతం, విభజన లెక్కలను 6, 7, 8 తరగతి విద్యార్థులు 31.6 శాతం చేశారు.

* తీసివేత లెక్కల్లో ఉన్న తెలుగు పదాలను 20.2 శాతం, విభజన లెక్కల్లో ఉన్న తెలుగు అక్షరాలను 48.3 శాతం మంది విద్యార్థులు చదవగలిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని