logo

రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా

నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్‌ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు.

Published : 26 Apr 2024 06:05 IST

ఎన్నికల్లో సహకరించేది లేదన్న కార్పొరేటర్లు

‘‘ నాకు సహకరించండి.. ఎంపీగా గెలిస్తే మేయర్‌గా మరొకరికి అవకాశం ఉంటుంది. రానున్న ఎన్నికల్లో మీ సంపూర్ణ మద్దతు కావాలి. నన్ను గెలిపించేందుకు కృషి చేయండి.’’

 కార్పొరేటర్లకు మేయర్‌ బీవై రామయ్య అభ్యర్థన.

మూడేళ్లుగా మమ్మల్ని పట్టించుకోలేదు.. వార్డుల్లో అభివృద్ధి పనులు చేయమంటే వినిపించుకోలేదు.. ప్రజా సమస్యలు పరిష్కరించమంటే వినలేదు. కనీస గౌరవం ఇవ్వలేదు..   ఎన్నికల్లో సహకరించాలని కోరుతున్నారు. సహకరించే ప్రసక్తే లేదు.

 కార్పొరేటర్ల స్పష్టీకరణ

నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్‌ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ, ఆయా వార్డులకు చెందిన కార్పొరేటర్లు హాజరయ్యారు. రామయ్య తీరుపై కార్పొరేటర్లు మండిపడ్డారు.. మూడేళ్లుగా పట్టించుకోలేదు.. ఎన్నికల వేళ గుర్తుకొచ్చామా అంటూ నిలదీశారు. వార్డుల్లో అభివృద్ధి కోసం నిధులు కేటాయించమని కోరితే ఏమాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అధికారులు సహకరించడం లేదని విన్నవించినా పట్టించుకోలేదు.. ఇప్పుడేమో ఎన్నికల్లో సహకరించమని అడుగుతున్నారని మండిపడ్డారు. ‘‘ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుకే నిధులు మళ్లించుకున్నారు.. మా వార్డుల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లకాలంలో నువ్వు ఎక్కడెక్కడ ఎంతెంత సంపాదించావో లెక్క మొత్తం తేలుస్తామని కార్పొరేటర్లు పేర్కొన్నట్లు సమాచారం.

న్యూస్‌టుడే, కర్నూలు నగరపాలకసంస్థ, కర్నూలు నగరం

ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుందాం

సమస్యలు పరిష్కరించుకుందామని, నగరపాలక సంస్థలో ఎలా సహకారం అందిస్తున్నారో.. అలానే ఎన్నికల్లో సహకారం అందించాలని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి, మేయర్‌ బీవై రామయ్య కోరారు. మనస్పర్థలు వీడి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని, మరో రెండు రోజుల్లో సమావేశమై ’ఆర్థిక‘ సమస్యలు సైతం పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు