logo

హంద్రీ నీవా కట్టపై జగన్‌ కనికట్టు

దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్‌.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి.

Published : 26 Apr 2024 06:31 IST



బాబు హయాంలో అడుగులు

 

‘‘ హంద్రీనీవాతోనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి సాధ్యమని గత పాలకులు గుర్తించారు. అనంతపురం, వైఎస్సార్‌, చిత్తూరు జిల్లాల వరకు కృష్ణా జలాలు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో హంద్రీనీవా కాల్వ విస్తరణ పనులకు 2014లో తెదేపా శ్రీకారం చుట్టింది.


జగన్‌ జమానాలో ఆగింది

‘‘హంద్రీనీవా కాల్వ ద్వారా ప్రతి రైతుకు సాగునీటితో పాటు, సమీప గ్రామాలకు మంచినీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రతి ఎకరాకు సాగునీరు అందే దిశగా పంట కాల్వలు నిర్మిస్తామని’’ 2017లో మహా సంకల్ప యాత్రలో భాగంగా పత్తికొండలో బహిరంగ సభలో మాటిచ్చారు. గద్దెనెక్కిన జగన్‌ ఐదేళ్లుగా పైసా విడుదల చేయలేదు.. 


న్యూస్‌టుడే, పత్తికొండ

దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్‌.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. కాల్వలు సరిగా లేక, వాటికి మరమ్మతులు చేపట్టక, స్లూయిజ్‌లు పూర్తి చేయకపోవటంతో రైతులు సాగునీరు వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం


ఒక్క చెరువు నింపితే ఒట్టు

‘‘ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 77 చెరువులను హంద్రీనీవా నీటితో నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం.’’

గతేడాది సెప్టెంబరు 19న కృష్ణగిరి మండలం ఆలంకొండ పంప్‌హౌస్‌ వద్ద బటన్‌నొక్కి నీటి విడుదల ప్రారంభించిన అనంతరం డోన్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలివి.

ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలయ్యాయి. పశ్చిమ ప్రాంతంలోని 106 చెరువుల్లోకి హంద్రీనీవా(కృష్ణా) జలాలు మళ్లించే ప్రక్రియను తెదేపా హయాంలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తొలి విడత 68 చెరువుల్లోకి నీటిని నింపాలని నిర్ణయించి పనులు ప్రారంభించారు. 10,130 ఎకరాలకు సాగు, 57 గ్రామాలకు తాగు నీరు ఇవ్వాలన్నది పథకం లక్ష్యం.  జగన్‌ గద్దెనెక్కిన తర్వాత నాలుగేళ్లు నిర్లక్ష్యం చేశారు. నిధులు విడుదల చేయలేదు. కనీసం పైపులైన్‌ పనులూ పూర్తి చేయలేదు. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో  ప్రారంభోత్సవం చేశారు.

న్యూస్‌టుడే, కృష్ణగిరి


 

పత్తికొండ-మద్దికెర మధ్యలో హంద్రీనీవా కాల్వ విస్తరణ చేపట్టలేదు.. ముళ్లపొదలు పెరిగి నీటి ప్రవాహ వేగం తగ్గింది.. లైనింగ్‌ పనులే చేపట్టని కారణంగా కాల్వ మట్టి కోతకు గురవుతోంది.

న్యూస్‌టుడే, మద్దికెర


పదెకరాలు వదిలేశా
- లక్ష్మన్న, కరడికొండ

హంద్రీనీవా కాల్వ మా ఊరి సమీపంలో వెళ్లాల్సి ఉంది. కాల్వ నీళ్లురాక 10 ఎకరాల పొలం బీడుగా వదిలేశా. మరో మూడు ఎకరాల్లో పంటలు వేసినా తీవ్ర వర్షాభావ పరిస్థితికి నష్టాలపాలవుతున్నాం.


పందికోన మాట మరిచితివి

‘‘ పెండింగ్‌లో ఉన్న పంట కాల్వలన్నీ పూర్తిచేసి పందికోన జలాశయం (హంద్రీనీవా) పరిధిలోని రైతులకు ప్రస్తుత ఖరీఫ్‌లోనే సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.’’

గతేడాది జూన్‌ 1న పత్తికొండ బహిరంగ సభలో ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ మాటలివి.!!

ఖరీఫ్‌ ‘కరవు’లో కలిసినా.. చుక్కనీరు ఇవ్వలేదు. నీటి జాడలేక రైతులు వేరుశనగ, పత్తి, మిరప, ఉల్లి వంటి పంటలు దున్నేశారు. రబీ ముగుస్తున్నా ఆలోచించలేదు.. పంట కాల్వల సంగతి దేవుడెరుగు.. కనీసం ప్రధాన కాల్వల్లో పెరిగిన ముళ్లపొదలు తొలగించలేదు.. స్లూయీజ్‌లకు మరమ్మతులు చేపట్టలేదు.

పందికోన- కొత్తపల్లి గ్రామాల మధ్య పందికోన జలాశయాన్ని నిర్మించారు. 1,227 హెక్టార్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.. హంద్రీ నీవా కాల్వ ద్వారా 1.20 టీఎంసీల నీటిని తీసుకొచ్చి నిల్వ చేయాల్సి ఉంది.. కానీ 0.75 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. పత్తికొండ, కృష్ణగిరి, దేవనకొండ, కోడుమూరు మండలాల్లో 67 వేల ఎకరాలకు సాగు నీరందించాలని ప్రణాళిక రూపొందించారు. జలాశయం కట్ట రివిట్‌మెంటు పనులతోపాటు పంట కాల్వలు, స్లూయీజ్ పనులు పూర్తి కాలేదు. పంట కాల్వ పనులు 80 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.


రక్షణ కట్టను ఖతం చేసిన నేతలు

ఐదేళ్లుగా పంట కాల్వలను బాగు చేయలేదు. ప్రధాన కాల్వకు రక్షణగా ఉన్న మట్టి కట్టలను తోడేసి వైకాపా నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. వరదల సమయంలో కాల్వ నిండి సమీప ప్రాంతాలను ముంచెత్తకుండా ఇరువైపులా రక్షణలా మట్టికట్టలు వేశారు. కాల్వ లోతును బట్టి 30 మీటర్ల ఎత్తు వరకు అడ్డుకట్టగా మట్టిని పోశారు. కాల్వ వెంట ఉన్న గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్థానికంగా బలమైన నాయకులు మట్టి దందా సాగిస్తూ కాలువ కట్టను ఖతం చేస్తున్నారు. అడ్డుకున్న రైతులపై కేసులుపెట్టి బెదిరింపులకు దిగుతున్నారు.


పెద్దమంత్రి పెత్తనం

హంద్రీనీవా కాల్వపై ‘పెద్ద’మంత్రి పెత్తనం చేస్తున్నారు. ఇక్కడి రైతులకు నీళ్లు ఇవ్వకుండా తన సొంత జిల్లాకు తీసుకెళ్లినా జిల్లా ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ మాట్లాడలేదు.  దీంతో దేవనకొండ, కుంకనూరు, గద్దరాళ్ల, పల్లెదొడ్డి, జిల్లెలబుడకల, కరివేముల, కప్పట్రాళ్ల, దూదేకొండ, కోతిరాళ్ల, కనకదిన్నె తదితర గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడింది.


కొత్తపేట సమీపంలో పిల్వ కాల్వ పరిస్థితి. మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కాల్వ గట్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మరమ్మతులు చేపట్టకపోవడంతో కాల్వ పరిస్థితి అధ్వానంగా మారింది.

న్యూస్‌టుడే, దేవనకొండ


ముందుకెళ్లని నీరు.. మునుగుతున్న తీరు

  • నందికొట్కూరు నియోజకవర్గం మల్యాల నుంచి పత్తికొండ నియోజకవర్గం మద్దికెర వరకు హంద్రీనీవా కాల్వ విస్తరించి ఉంది. ఇరువైపులా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరిగాయి. ఇవి నీటి ప్రవాహానికి అడ్డుగా మారాయి.
  • ప్రధాన కాల్వ పనులు పూర్తి చేసినా.. పిల్ల కాల్వలు పూర్తికాకపోవడంతో పొలాలకు సాగునీరు అందడం లేదు.
  • విస్తరణ పనులు ఎక్కడికక్కడ ఆగాయి. కాల్వకు అధికంగా నీరు వదిలితే గట్టుదాటి పొలాల్లోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి.
  • ఓ చోట వెడల్పు, మరో చోట్ల ఇరుకుగా ఉండటంతో నీరు సరిగా పారడం లేదు. కొన్ని చోట్ల గట్లు తెగి నీరంతా పొలాల్లోకి వస్తోంది.

సాగు లక్ష్యం:  6.05 లక్షల ఎకరాలు
మంచినీరు: 33 లక్షల మందికి
ప్రధాన కాల్వ : 216.300 కి.మీ
ఎత్తిపోతలు: 12
జలాశయాలు: కృష్ణగిరి, పందికోన, జీడిపల్లి
మొత్తం టీఎంసీలు : 40
జిల్లా వాటా : 7.5
సాగు లక్ష్యం: 87వేల ఎకరాలు


పత్తికొండలో పందికోన జలాశయాన్ని 2007లో రూ.70 కోట్లతో శ్రీకారం చుట్టారు. నీటిసామర్థ్యం 1.126 టీఎంసీలు. కుడి కాలువ 35.65 కి.మీ. పొడవు నిర్మించాలి. ఎడమ కాలువ పరిధిలో 10,774 ఎకరాలు ఆయకట్టుకు నీరందించే విధంగా పనులు పూర్తిచేయాల్సి ఉంది.

  • ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో 61,394 ఎకరాలకు సాగునీరు అందాలి. ఒక్క దేవనకొండ మండలానికే 45 వేల ఎకరాలకు సాగు నీరందించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు