logo

గడప గడపనా జగన్‌ ధోకా

దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు.

Updated : 26 Apr 2024 06:16 IST

పూర్తయిన పనులకూ బిల్లులు చెల్లించని వైనం
ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు ఇవ్వలేని పరిస్థితి

  • దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు.
  • తుగ్గలి మండలంలో రూ.6.63 కోట్లతో 175 పనులు మంజూరు చేయగా.. 174 పనులు వివిధ దశలో ఉన్నాయి.
  • సి.బెళగల్‌ మండలంలో 64 పనులు మంజూరు చేయగా.. 37 పనులు వివిధ దశల్లో ఉండగా.. కేవలం ఒకటి   పూర్తైంది.
  • ఎమ్మి గనూరులో రూ.2.59 కోట్లతో 27 పనులు మంజూరు చేయగా 11 పనులు వివిధ దశల్లో నత్తనడకన సాగుతున్నాయి.
  • చిప్పగిరి, దేవనకొండ, హొళగుంద,  కోడుమూరు, నందవరం మండలాలతోపాటు ఎమ్మిగనూరు పట్టణంలో ఒక్క పనీ పూర్తి కాలేదు.

గడపలో గారడీ

ఒక్కసారి అవకాశం అంటూ గద్దెనెక్కారు.. నాలుగేళ్లు పల్లె ముఖం చూడలేదు.. ఎన్నికలకు ఏడాది గడువు ఉండగా.. గడప.. గడపకు అంటూ పల్లెబాట పట్టారు.. జనం నిలదీస్తుంటే కంగారు పట్టారు.. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ఇస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. ఎమ్మెల్యేలు హామీలు గుప్పించారు.. వీటినైనా విడుదల చేశారా? పనులు పూర్తి చేయించారా? అంటే అదీ లేదు. పూర్తయిన పనులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు.


ప్రశ్నించేందుకు జనం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల నామినేషన్‌ ఘట్టం పూర్తయ్యింది... అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు.. వైకాపా అభ్యర్థులను ప్రశ్నించేందుకు జనం సిద్ధమయ్యారు. ఇప్పటికే కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, డోన్‌, ఆలూరు, నంద్యాల నియోజకవర్గాల్లో పలు చోట్ల జనం ప్రశ్నల వర్షం కురిసింది. సమస్యలపై నిలదీశారు.. ఒక్క సమస్యా పట్టించుకోలేదని.. ఇప్పుడు మా ఓట్లు కావాల్సి వచ్చిందా అంటూ ముఖం మీదే అడిగేస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక నాయకులు సతమతమవుతున్నారు.

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం


మురుగులో వదిలేశారు

కర్నూలు జిల్లాలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో గ్రామ, పట్టణాల్లో కల్వర్టులు, డ్రైన్‌లు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.30.32 కోట్ల అంచనాతో 691 పనులు మంజూరయ్యాయి. 233 పనులు పూర్తి చేయగా 458 వరకు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.9.39 కోట్లు ఖర్చు చేశారు.

పెండింగ్‌లో బిల్లులు

కర్నూలు జిల్లాలో 26 మండలాల పరిధిలో 674 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం పథకం కింద 3,671 పనులకు రూ.195.07 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 3,132 పనులకు జిల్లా కలెక్టర్‌ ఆమోదం తెలిపి రూ.163.05 కోట్లతో ఉత్తర్వులు జారీ చేశారు. అందులో రూ.87.73 కోట్లతో 1,779 పనులు ప్రారంభమయ్యాయి. అతికష్టంమీద ఇప్పటివరకు రూ.24.06 కోట్లతో 441 పనులు మాత్రమే పూర్తి చేశారు. రూ.7.82 కోట్లతో పూర్తి చేసిన 133 పనులకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్‌ చేశారు.

స్తంభాలు మరిచారు

  • ఇళ్ల మధ్య నుంచి వెళ్తున్న విద్యుత్తు లైన్ల మార్పు, కొత్తవి ఏర్పాటు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాల ఏర్పాటుకు సంబంధించి పనులను గుత్తేదారుల ద్వారా చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో రూ.లక్షల విలువ చేసే పనులు చేపట్టగా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాని పరిస్థితి నెలకొంది.  
  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2022-23లో కొత్త విద్యుత్తు స్తంభాలు వేయడం, లైన్లు మార్చేందుకు రూ.6.95 కోట్లతో 245 పనులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా అందులో రూ.2.09 కోట్లతో 92 పనులు చేపట్టేందుకు ఆమోదించారు.
  • విద్యుత్తు లైన్లు మార్చడం, కొత్త లైన్లు వేసేందుకు రూ.64.33 కోట్లతో 2,255 పనులకు ప్రతిపాదనలు రాగా.. రూ.40.10 కోట్లతో 1,528 పనులను ఆమోదించారు. ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడినా పనులు పూర్తి కాలేదు.

బిందె నింపని హామీలు

కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికిగాను రూ.22.81 కోట్లతో 539 పనులు మంజూరు కాగా 113 పనులు పూర్తయ్యాయి.. 426 వరకు పురోగతిలో ఉన్నాయి. నంద్యాల జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి 2022-23లో రూ.14.75 కోట్లతో 362 పనులకు పరిపాలన ఆమోదం లభించగా అందులో 194 పనులు పూర్తి చేశారు. 135 పనులు పురోగతిలో ఉన్నాయి. 27 వరకు ప్రారంభానికి నోచుకోలేదు. మరో ఆరు టెండరు దశలో ఉన్నాయి.  మంత్రాలయం నియోజకవర్గంలోని కల్లుదేవకుంటలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నాలుగు కి.మీ. దూరంలో ఉన్న చిలకలడోన, మంత్రాలయానికి వెళ్లి నీటిని తెచ్చుకొనే పరిస్థితి నెలకొంది.

రూ.297.02 కోట్లు.. 5,087 పనులు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెలుగులోకి వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం.. ఇందులో భాగంగా ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో రూ.297.02 కోట్లతో 5,704 పనులకు ప్రతిపాదనలు పంపగా రూ.297.02 కోట్లతో 5,087 పనులను కలెక్టర్లు ఆమోదం తెలిపారు. కర్నూలు జిల్లాలో 441, నంద్యాల జిల్లాలో 717 పనులు మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో కేవలం 720 పనులకు సంబంధించి రూ.34.69 కోట్ల బిల్లులను మాత్రమే అప్‌లోడ్‌ చేశారు.

పిలుపులే.. పనుల్లేవ్‌

  • గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా గుర్తించిన సమస్యల పరిష్కారానికిగాను ఒక్కో సచివాలయానికి తొలుత రూ.20 లక్షలు, గిరిజన ప్రాంతాలకు రూ.40 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ప్రతిపాదిత పనులు చేపట్టకుండానే.. ప్రజలు ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కరించండి.. ఎంత నిధులైనా ఇస్తామంటూ సచివాలయానికి అదనంగా మరో రూ.20 లక్షల చొప్పున ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ నిధులతోనూ పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. గతంలో ప్రతిపాదించిన పనులు చేపట్టేందుకు ఎవరూ రావడం లేదు. టెండర్లు పదేపదే పిలవడం తప్ప ఎలాంటి కదలిక లేదు.
  • ప్రభుత్వం ప్రతి నెలా రూ.కోట్లలో అప్పులు చేయడం.. ప్రభుత్వోద్యోగులకు వేతనాలు చెల్లించలేకపోవడం తదితర పరిణామాలను గమనించిన గుత్తేదారులు పనులు చేపట్టేందుకు ముందుకురాలేదు. ప్రభుత్వం మారితే పరిస్థితి ఏమిటోనని భావించి పనులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని