logo

నేర వార్తలు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని కొసనాపల్లి గ్రామంలో పెద్దబోడెన్నగారి లక్ష్మన్న(43) అనే రైతు అప్పుల బాధతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 21 Mar 2023 02:26 IST

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

వెల్దుర్తి, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని కొసనాపల్లి గ్రామంలో పెద్దబోడెన్నగారి లక్ష్మన్న(43) అనే రైతు అప్పుల బాధతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మణ్న గ్రామంలో తనకున్న నాలుగు ఎకరాలు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల కిందట గ్రామసమీపంలోని హాంద్రీ వాగులో బోరు వేసి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలానికి పైపులైను వేసుకున్నారు. వీటితో పాటు వ్యవసాయ అవసరాల కోసం అప్పులు చేశారు. ఈ ఏడాది సాగుచేసిన మిరప, ఆముదం పంటలు కలిసి రాలేదు. సుమారు రూ.15లక్షల మేర అప్పులు ఉండటంతో వాటిని చెల్లించలేక మనస్తాపానికి గురయ్యారు. పొలంలోని పురుగు మందు తాగారు. ఇది గమనించిన భార్య వాసుదేవమ్మ చుట్టుపక్కల వారితో కలిసి చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మణ్నకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.


రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు సంతోష్‌నగర్‌ ఈద్గా వద్ద 44వ నంబరు జాతీయ రహదారి ఉపరితల వంతెనపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధాకర్‌ (47) మృతి చెందారు. నగర శివారులోని నందికొట్కూరు రోడ్డు ఒమేగా ఆసుపత్రి వద్ద కాలనీలో నివాసం ఉన్న సుధాకర్‌ పెయింటర్‌గా జీవనం సాగించేవారు. ఇతనికి భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను ద్విచక్ర వాహనంపై సంతోష్‌ నగర్‌వైపు వెళ్తూ ఉపరితల వంతెన ఎక్కే క్రమంలో వెనుక వైపు నుంచి కర్ణాటకకు చెందిన లారీ ఢీకొట్టింది. కిందపడిన ఇతనిపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సుధాకర్‌ తండ్రి జయరాం 15 రోజుల క్రితమే చనిపోగా అంతలోనే ఇతడు మృత్యువాత పడటంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కర్నూలు ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


రైలు నుంచి జారిపడి దుర్మరణం

ఆదోని పట్టణం, న్యూస్‌టుడే: ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతిచెందినట్లు ఆదోని రైల్వే పోలీసు స్టేషన్‌ ఇన్‌ఛార్జి ఎస్సై గోపాల్‌ సోమవారం తెలిపారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా, షాపూర్‌ తాలుకా, హయ్యల్‌ గ్రామాని చెందిన హయ్యలప్ప కుమారుడు డి.కెంచెప్ప(45) మృతిచెందినట్లు తెలిపారు. కోసిగి-కుప్పగల్‌ రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ. సంఖ్య 520-30-32 వద్ద మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. కెంచెప్ప తన భార్య, కుమార్తెతో యాదగిరి రైల్వే స్టేషన్‌ నుంచి బెంగళూరుకు సాధారణ టికెట్‌ కొనుగోలుతో జనరల్‌ బోగీలో ప్రయాణిస్తున్నారు. కోసిగి రైల్వే స్టేషన్‌ దాటిన కొద్ది సమయంలో రైలు నుంచి జారి పడి మృతిచెందినట్లు తెలిపారు. ఆదోని ఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై లక్ష్మణ్న, సిబ్బంది సాయి ఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు..


భార్యపై కత్తితో దాడి

మద్దికెర, న్యూస్‌టుడే: ఆరు నెలల కిందట విడాకులు తీసుకున్న భర్త భార్యపై కత్తితో దాడి చేసి గాయపరచిన ఘటన మద్దికెరలో సోమవారం జరిగింది. స్థానిక మోమిన్‌ వీధికి చెందిన మెహముదాబేగానికి గుంతకల్లుకు చెందిన అహమ్మద్‌తో 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి మధ్య సఖ్యత లేని కారణంగా ఆరు నెలల కిందట విడాకులు తీసుకున్నారు. సోమవారం భార్య ఉంటున్న ఇంటికెళ్లి గొడవ పెట్టుకుని, ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. నిందితుడు మద్దికెర పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి విచారణ చేపడతామని ఎస్సై నాగేంద్రప్రసాద్‌ తెలిపారు.


ఉరేసుకుని ఆత్మహత్య

వెల్దుర్తి, న్యూస్‌టుడే: మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో క్షణికావేశానికి గురైన వెంకటరమణ(40) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల మండలం ఎమ్‌.పెండేకల్లు గ్రామానికి చెందిన లక్ష్మీదేవితో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతను కూలిపనితో పాటు వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. వీరి మధ్య పిల్లల పాఠశాల ఫీజుం చెల్లించే విషయంలో ఘర్షణ జరిగింది. దీంతో క్షణికావేశానికి గురైన వెంకటరమణ పొలంలోని వేపచెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. భార్య లక్ష్మీదేవి వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని