logo

కూలుతున్న కలల గూడు

ఇల్లు లేని పేదలెవరూ ఉండకూడదు.. నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి.. పది కాలాలపాటు ఆ గూడులో పేదలు ఆనందంగా జీవించాలన్న సీఎం జగన్‌రెడ్డి మాటలు క్షేత్రస్థాయిలో సత్యదూరంలా ఉన్నాయి.

Updated : 09 Mar 2024 06:08 IST

ఆప్షన్‌-3 ఇళ్ల నాణ్యత ప్రశ్నార్థకం
కొరవడిన అధికారుల పర్యవేక్షణ

ఇల్లు లేని పేదలెవరూ ఉండకూడదు.. నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి.. పది కాలాలపాటు ఆ గూడులో పేదలు ఆనందంగా జీవించాలన్న సీఎం జగన్‌రెడ్డి మాటలు క్షేత్రస్థాయిలో సత్యదూరంలా ఉన్నాయి. మూడో ఆప్షన్‌ కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. పునాదులు చెదురుతున్నాయి. గృహ నిర్మాణాలకు అనుమతి పొందిన సంస్థలు ఆదిలో హడావుడి చేసి తర్వాత చేతులెత్తేశాయి.. క్యూరింగ్‌ చేసే వారు లేరు.. నిర్దేశించిన నిష్పత్తిలో సిమెంటు కలిపారో లేదో తెలియడం లేదు.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అని అధికారులు పర్యవేక్షించడం లేదు. అడిగేవారు లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు.

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం, ఆదోని పురపాలకం, ఎమ్మిగనూరు

పునాదులకు నెర్రెలు

ఎమ్మిగనూరు పట్టణంలోని జగనన్న కాలనీలో ఇంటి పునాది పరిస్థితి. సిమెంట్‌ ఇటుకలను అక్కడే తయారుచేసి నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. పునాది సక్రమంగా వేయకపోవడం.. ఇసుక, సిమెంట్‌ సమపాళ్లలో వాడకపోవడంతో అప్పుడే పగుళ్లిచ్చాయి. దీనికితోడు క్యూరింగ్‌ చేయడం లేదు.

సిమెంటు పూసి.. నాణ్యతకు మసక

ఎమ్మిగనూరు పట్టణంలోని జగనన్న కాలనీలో నిర్మాణాలు పూర్తికాకముందే గోడలు దెబ్బతింటున్నాయి. నెర్రెలిస్తుండటంతో అవి కనిపించకుండా మాయ చేస్తున్నారు. ఈ కాలనీలోని మూడో వరుసలో ఓ ఇంటిని పైకప్పు వరకు నిర్మించారు. అక్కడక్కడా పగుళ్లు ఉండటంతో సిమెంటు పూత పూశారు. ఇలా 22 ఇళ్లకు పగుళ్లు రావడం గమనార్హం. ఇసుక, సిమెంటు సరిగా ఉపయోగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

పనులు పూర్తవ్వక మునుపే పగుళ్లు

ఆదోని పట్టణ శివారులో సుమారు వంద ఎకరాల్లో ప్లాట్లు వేసి పది వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. మొదటి విడతగా 5,101 ఇళ్లు నిర్మిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులన్నీ నాసిరకంగా జరుగుతున్నాయి. పనులు పూర్తికాక మునుపే గోడలు పగుళ్లిచ్చాయి. నాసిరకమైన సిమెంటు ఇటుకలు ఉపయోగిస్తుండటంతో అవి పగిలిపోయి పిండి.. పిండిగా మారుతున్నాయి.

క్యూరింగ్‌ మాట మరిచారు

ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్ననగర్‌ కాలనీలో 1,075 నిర్మాణాలు ప్రారంభించారు. 19 చివరి దశకు చేరుకున్నాయి. ఏనుగుబాల కాలనీ కోసం 163 ఇళ్లు నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటికి 21 రోజులపాటు క్యూరింగ్‌ చేస్తేనే గోడలు బలంగా ఉంటాయి. కాలనీలో దానిమాటే మరిచిపోయారు. నీళ్లు పడుతున్న దాఖలాలు లేవు.

గుత్తేదారులకు రూ.60 కోట్లు

ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు, పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రూ.35 వేలను గుత్తేదారులకు చెల్లించాలి. వ్యక్తిగతంగా నిర్మించుకుంటున్న ఇళ్లకు ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా.. గుత్తేదారులు నిర్మించి ఇచ్చే ఇళ్లకు లబ్ధిదారులు అదనంగా మరో రూ.35 వేలు చెల్లించాల్సి ఉంది. అదనపు పైకం చెల్లిస్తున్నా.. పురోగతి కానరావడం లేదు. ఇప్పటికే గుత్తేదారులకు రూ.60 కోట్లకుపైగా చెల్లింపులు చేసినా ఫలితం శూన్యమే.

రెండు పట్టణాలు.. 13 మండలాలు

  • కర్నూలు జిల్లాలో ఆప్షన్‌-3 కింద 11,143 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత వాటిని 10,968 వరకు కుదించారు. తాజాగా 9,558 గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు పట్టణ ప్రాంతాలు, 13 మండలాల్లో 16 మంది గుత్తేదారులు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వీటిని ప్రభుత్వ నమూనాలో నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది.
  • ప్రస్తుతం బేస్‌మెంటులో 6,332, రూఫ్‌ లెవెల్‌ నుంచి రూఫ్‌ క్యాస్ట్‌ దశలో 827 నిర్మాణాలు జరుగుతున్నాయని గృహ నిర్మాణశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఆదోని అర్బన్‌, ఎమ్మిగనూరు అర్బన్‌, నందవరం, హాలహర్వి, హొళగుంద, దేవనకొండ ప్రాంతాల్లో 16 ఇళ్లకు పైకప్పు వేశారు.
  • మంత్రాలయం, ఆదోని రూరల్‌, కోసిగి, ఆలూరు, గోనెగండ్ల, కౌతాళం, చిప్పగిరి, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు రూరల్‌లో జరుగుతున్న పనులు పరిశీలిస్తే నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఒక్కటీ లేకపోవడం గమనార్హం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని