logo

అద్దె మాటలు.. వైద్యవిద్యకు అవస్థలు

‘‘మా వల్లే నంద్యాలకు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఇందుకు సంబంధించిన పనులూ శరవేగంగా జరుగుతున్నాయంటూ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి గొప్పలు చెబుతున్నారు.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా తిప్పలు పెడుతున్నారు.

Published : 05 May 2024 02:44 IST

అందుబాటులోకి రాని శాశ్వత భవనాలు
మూడు నెలల్లో కొత్త విద్యార్థులకు ప్రవేశాలు

అద్దె భవనాల్లో ఉన్న నంద్యాల మెడికల్‌ కళాశాల వసతిగృహం

‘‘మా వల్లే నంద్యాలకు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఇందుకు సంబంధించిన పనులూ శరవేగంగా జరుగుతున్నాయంటూ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి గొప్పలు చెబుతున్నారు.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా తిప్పలు పెడుతున్నారు. సొంత భవనం లేక ప్రథమ ఏడాది విద్యార్థులు ప్రైవేటు భవనాల్లో ‘వసతి’ ఉంటున్నారు. సెప్టెంబరులో కొత్త విద్యార్థులు రానున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు చూస్తే అప్పటి వరకు పూర్తయ్యేలా లేవు.. మరి ఆ విద్యార్థులను ఎక్కడ ఉంచాలో తెలియడం లేదు.

న్యూస్‌టుడే, నంద్యాల పాతపట్టణం

రూ.475 కోట్లు కేటాయింపు

నంద్యాల ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవనాలు, ల్యాబ్స్‌, వసతిగృహాలతో పాటు 330 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.475 కోట్లు కేటాయించారు. 2022 సెప్టెంబరులో ఆర్‌ఏఆర్‌ఎస్‌ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. విద్యార్థులకు తరగతుల నిర్వహణ కోసం తాత్కాలికంగా గదులు నిర్మించారు. ప్రస్తుతం వాటిలో మొదటి ఏడాది విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నారు. మొదటి విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపు శాశ్వత భవనాలను అందుబాటులోకి తెస్తామని ప్రజాప్రతినిధులు చెప్పారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన పనులు మాత్రమే చేయగలిగారు.

రూ.లక్షల్లో అద్దెభారం

ప్రస్తుతం 150 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. వీరిలో 80 విద్యార్థినులకు వ్యవసాయ శాఖకు సంబంధించిన పాత భవనాలను ఆధునికీకరించి వసతిగృహం నిర్వహిస్తున్నారు. 70 మంది విద్యార్థులకు ప్రైవేటు భవనంలో వసతి కల్పించారు. ఇందుకు గాను నెలకు రూ.1.30 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. దీంతో ఏడాదికి రూ.15.60 లక్షల మేరకు భారం పడుతోంది. ఏడాది పూర్తవుతున్నా శాశ్వత భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి.

కొత్త వారొస్తే పరిస్థితేంటి

ప్రస్తుతం ఉన్న 150 మంది విద్యార్థులకే తాత్కాలిక భవనాల్లో వసతిగృహాలు, తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో మరో ఏడాది ఎంబీబీఎస్‌ విద్యార్థులు 150 మంది ప్రవేశాలు పొందనున్నారు. వారికి అవసరమైన తరగతి గదులు, వసతిగృహాల నిర్మాణాలు పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

నూతన ప్రవేశాలపై ప్రభావం!

మెడికల్‌ కళాశాలకు సంబంధించిన భవనాలు, వసతిగృహాల నిర్మాణాలు నత్తనడక జరుగుతుండటంతో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) బృందం పరిశీలనకు వస్తే పరిస్థిటేంటని కళాశాల ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాటికే ఎన్‌ఎంసీ బృందం పరిశీలనకు రావాల్సి ఉన్నా ఆలస్యమైంది. వారి పరిశీలనలో ఇక్కడ వైద్య కళాశాల నిర్వహణకు మౌలిక వసతులు లేవని నిర్ధారణ జరిగితే వచ్చే ఏడాది ప్రవేశాలపై ప్రభావం చూపే ప్రమాదముంది. మరోవైపు పనులు సకాలంలో పూర్తి కాకపోతే కొత్త విద్యార్థులకు కూడా భవనాలను అద్దెకు తీసుకుని వసతిగృహాలు నిర్వహించాల్సి వస్తుంది. దీనివల్ల అద్దె భారం తడిసి మోపెడవుతుంది.

రూ.47 కోట్ల బిల్లుల బకాయితో నత్తనడకన పనులు

మెడికల్‌ కళాశాలకు ప్రస్తుతం సుమారు రూ.100 కోట్ల మేరకు పనులు చేశారు. అందులో రూ.47 కోట్ల బిల్లులు బకాయిలో ఉన్నట్లు సమాచారం. అందులో కొంత మేరకు నింధులు మంజూరు కావడంతో కొద్దిపాటి పనులు చేస్తున్నారు. దీంతో సకాలంలో పూర్తి కావాల్సిన కళాశాల తరగతులు, వసతిగృహాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆ నిధులు విడుదల చేస్తే తప్ప పనులు వేగవంతమయ్యే విధంగా కనిపించడం లేదు. దీంతో పనులు మందగించడంతో ఇంజినీర్లు సైతం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి దాపరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని