logo

అమ్మఒడి.. మామ చిక్కుముడి

అక్కచెల్లెమ్మలు.. అవ్వాతాతలు అంటూ తీయని మాటలతో బురిడీ కొట్టించడంలో సీఎం జగన్‌ది అందె వేసిన చేయి.. ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన పథకాల పేరుతో అలవికాని హామీలు ఇచ్చి.. అమలు విషయంలో మాత్రం మాయ చేయడం.. ఏవేవో నిబంధనలంటూ కోతలు వేయడం పరిపాటిగా మారింది.

Updated : 06 May 2024 06:32 IST

ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పి ఒక్కరికే పరిమితం
కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యలో కోత

అక్కచెల్లెమ్మలు.. అవ్వాతాతలు అంటూ తీయని మాటలతో బురిడీ కొట్టించడంలో సీఎం జగన్‌ది అందె వేసిన చేయి.. ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన పథకాల పేరుతో అలవికాని హామీలు ఇచ్చి.. అమలు విషయంలో మాత్రం మాయ చేయడం.. ఏవేవో నిబంధనలంటూ కోతలు వేయడం పరిపాటిగా మారింది. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం పేరుతో ఏటా రూ.15 వేలు ఇస్తానని ఊదరగొట్టిన జగన్‌.. ఏటేటా ఆ మొత్తాన్ని తగ్గిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల కత్తి ఝుళిపించడంతో చాలామంది అర్హత కోల్పోయారు. అర్హులకైనా పూర్తి మొత్తం ఇవ్వకుండా.. కోత విధిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల కాలంలో అయిదుసార్లు పథకం లబ్ధి చేకూర్చాల్సి ఉండగా.. హాజరు పేరుతో ఏకంగా ఏడాది మొత్తం ఎగవేతకు ప్రణాళిక వేశారు.

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే:

అంతా అంకెల బడాయి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి 4,199 వరకు ఉన్నాయి. 7,45,303 మంది చదువుకుంటున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 5,16,893 మంది ఉన్నారు. ఏటా 3.68 లక్షల మందికి అమ్మఒడి ఇస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఒకవైపు జీఈఆర్‌ సర్వేలో దేశంలోనే నంద్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని విద్యాశాఖ ప్రకటించుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బడిఈడు పిల్లలంతా పాఠశాలల్లోనే ఉన్నారని, ఏటా ప్రవేశాలు పెరుగుతున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. మరోవైపు హాజరు తగ్గిందని, ఇతర కారణాలు చూపుతూ అమ్మఒడి లబ్ధిదారులను తగ్గిస్తుండటం గమనార్హం.

పొరుగు సేవల ఉద్యోగులకు సెగ

పొరుగుసేవల ఉద్యోగులకు రూ.15 వేల వేతనం ఇచ్చినట్లే ఇస్తూ.. జగన్‌ మార్కు షాక్‌ రుచి చూపించారు. వివిధ శాఖల పరిధిలో పని చేస్తున్న పొరుగుసేవల ఉద్యోగుల మేలు కోసమే ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్స్‌డ్‌ సర్వీసెస్‌(ఆప్కాస్‌) తెచ్చినట్లు గొప్పలు చెప్పి.. దీని పరిధిలోకి వచ్చిన లక్ష మందికి అమ్మఒడి పథకాన్ని దూరం చేశారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీలోకి వచ్చినట్లేనని అధికారులు సమాధానమిస్తుండడం గమనార్హం. అలాగని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేవన్నీ పొరుగుసేవల వారికి ఇస్తున్నారా.. అంటే అదీ లేదు.

రూ.121.75 కోట్లు మిగుల్చుకున్నారు

అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు జమ చేస్తామని ఎన్నికల ముందు సీఎం జగన్‌ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మాత్రమే రూ.15 వేలు జమ చేశారు. 2020- 21లో పాఠశాల నిర్వహణ కోసమని రూ.1000 కోత పెట్టారు. 2021-22లో పారిశుద్ధ్య నిర్వహణ పేరుతో మరో రూ.వెయ్యి కోతపెట్టి రూ.13 వేలు అందించారు. రెండు జిల్లాల్లో 2020-21 సంవత్సరంలో 2,47,730 విద్యార్థులకు రూ.371.59 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం 2021-22లో 2,42,645 మంది విద్యార్థులకు రూ.363.96 కోట్లు మాత్రమే అందించింది. 2022-23లో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గించి 2,42,241 మందికి రూ.363.36 కోట్లు మాత్రమే అందజేసింది. ఇప్పటి వరకు అమ్మఒడి పథకం కింద గత నాలుగేళ్లలో రూ.121,75,02,000 మిగుల్చుకొంది.

ఎగనామం ఎత్తుగడ

ఏటా అమ్మఒడి పథకం అమలు చేస్తామని గొప్పలు చెప్పిన జగన్‌ ‘కోత’ పెట్టి తల్లిదండ్రులను బురిడీ కొట్టించారు. మొదట 2020-21 విద్యా సంవత్సరానికి గాను జనవరిలో ఖాతాల్లో డబ్బు జమచేసింది. 2022- 23లో జనవరిలో కాకుండా విద్యా సంవత్సరం ప్రారంభం పేరుతో జూన్‌లో వేసింది. 2024లో విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు గనుక ఖాతాల్లో డబ్బులు వేయలేదు. తొలి రెండేళ్లు జమ చేసిన ప్రకారం చేసుంటే ఈ ఏడాది కూడా అమ్మఒడి అందేది. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక ఏడాది సాయం ఎగవేసింది.

హాజరు అయోమయం

పిల్లలు రకరకాల సాకులు చెప్పి బడికి ఎగ్గొట్టే తరహాలో.. జగన్‌ కూడా ఒక సంవత్సరం అమ్మఒడి పథకం నిధులను మిగుల్చుకున్నారు. ఐదేళ్ల పాలనలో ఐదు పర్యాయాలు ఇవ్వాల్సి ఉండగా.. నాలుగేళ్లే ఇచ్చారు. ఇందుకోసం విద్యార్థులకు 75 శాతం హాజరు నిబంధనను తీసుకొచ్చారు. మొదటి రెండేళ్లు జనవరిలో పథకం డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం తర్వాత దాన్ని జూన్‌కు మార్చేసింది. 2021-22లో 75శాతం హాజరు పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్‌లో అమ్మఒడి డబ్బులు వేశారు. 2022-23కీ అదే లెక్కన గత జూన్‌లో జమ చేశారు. ఇలా నాలుగేళ్లు మాత్రమే ఇచ్చినట్లయింది.

మినహాయించుకున్న సొమ్ము ఎటెళ్లుతోంది

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసమని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకూ కోత పెట్టారు. వాటిని ప్రభుత్వ పాఠశాలలకు మళ్లిస్తామని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అమలు కావడంలేదు. ఈ మొత్తం నేరుగా కలెక్టర్ల ఖాతాల్లోకి చేరుతుంది. తర్వాత పాఠశాలల నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికులు, ఆయాల వేతనాలకు చెల్లించాల్సి ఉంటుంది. గత అయిదేళ్లలో కార్మికులకు వేతనాలు రెండు మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారు. మరోవైపు పాఠశాలల నిర్వహణకూ నిధులు మంజూరు కావడంలేదు. మరి విద్యార్థుల నుంచి రూ.2 వేల చొప్పున మినహాయిస్తున్న మొత్తం ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని