logo

జగన్‌ తాత్సారం.. నేల నిస్సారం

మాది రైతు ప్రభుత్వమని మాటిమాటికి చెప్పుకొనే జగన్‌ వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ప్రతి మూడు నెలలకోసారి భూసార పరీక్షలు చేయిస్తాం.. వాటి ఫలితాల ఆధారంగా రైతులకు ఎరువులు, సూక్ష్మధాతు పోషకాలను రైతులకు అందిస్తాం..

Published : 09 May 2024 03:10 IST

భూసార పరీక్షలకు మంగళం పలికిన ప్రభుత్వం
పంట దిగుబడి తగ్గి ఏటా నష్టపోతున్న రైతులు

న్యూస్‌టుడే, ఆత్మకూరు: మాది రైతు ప్రభుత్వమని మాటిమాటికి చెప్పుకొనే జగన్‌ వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ప్రతి మూడు నెలలకోసారి భూసార పరీక్షలు చేయిస్తాం.. వాటి ఫలితాల ఆధారంగా రైతులకు ఎరువులు, సూక్ష్మధాతు పోషకాలను రైతులకు అందిస్తాం.. అంటూ గొప్పలు చెప్పారు. అయిదేళ్ల పాలనలో భూసార పరీక్షకు పూర్తిగా మంగళం పాడారు. నేలను నిస్సారం చేశారు. నియోజకవర్గానికి ఒక అగ్రీల్యాబ్‌ను ఏర్పాటు చేశామని గొప్పలు చెబుతున్నా.. అవసరమైన సిబ్బంది, పరికరాలు, వసతుల్లేక అవి నిరుపయోగంగా మారాయి. దీంతో రైతులకు భూమి స్వభావం తెలియక.. ఎలాంటి ఎరువులు వాడాలి.. ఏ విత్తనం వేయాలి.. ఎంత మోతాదులో సూక్ష్మపోషకాలు అందించాలో అవగాహన లేక పంటలు నష్టపోతున్నారు.

లక్ష్యాలు ఇచ్చారు.. కాసులు విదిల్చరు

వ్యవసాయ భూములు కర్నూలు జిల్లాలో 5.39 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 3.67 లక్షల హెక్టార్లు ఉన్నాయి. వీటిలో 72 శాతం నల్లరేగడి, 22 ఎర్రరేగడి, 6 శాతం ఇతర భూములున్నాయి. గత ప్రభుత్వంలో ఏటా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు ఫలితాల పత్రాలు అందజేసేవారు. వైకాపా ప్రభుత్వంలో ఈ పరీక్షలు నిలిచిపోయాయి. 2023- 24లో లక్ష్యాలు నిర్దేశించినా బడ్జెట్‌ కేటాయించలేదు. కర్నూలు జిల్లాలో 52,128, నంద్యాల జిల్లాలో 28,197 పరీక్షలు చేయాలని లక్ష్యాలు నిర్దేశించారు. సెంట్రల్‌ స్కీం ద్వారా ఉమ్మడి జిల్లాల్లో 1,729 నమూనాలు మాత్రమే సేకరించి పరీక్షించారు. వికసిత్‌ భారత్‌ కార్యక్రమాల్లో భాగంగా కొందరు రైతులకు పత్రాలు ఇచ్చి వెంటనే వెనక్కి తీసేసుకున్నారు.

పెరిగిపోతున్న క్షారత్వం

2018 సెంట్రల్‌ స్కీం భూసార పరీక్షల నివేదిక ప్రకారం కొన్ని మండలాల్లో ఉదజని మధ్యస్థంగా ఉంది. కొన్ని మండలాల్లోని పొలాల్లో ఉదజని సూచిక (పీహెచ్‌ వాల్యూ) పెరిగిపోతున్నట్లు పరీక్షల్లో తేలింది. క్షారత్వం 7 శాతం వరకు ఉండటం సాధారణ స్థితి. ప్రస్తుతం 62 శాతం భూముల్లో క్షారత్వం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనివల్ల భూమిలో పోషకాలు తగ్గిపోయి చౌడుబారిపోతాయి. దిగుబడి తగ్గిపోతుంది.

  • జిల్లాలో భూసార పరీక్షా కేంద్రాల నివేదికల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని భూముల్లో నత్రజని లోపించింది. 31 మండలాల్లో ఐరన్‌, 33 మండలాల్లో జింక్‌, 4 మండలాల్లో కాపర్‌, మాంగనీస్‌ లోపం ఉంది. పోటాషియం లోపం 14 మండలాల్లో తీవ్రంగా 13 మండలాల్లో మధ్యస్థంగా ఉంది. ఏడు మండలాల్లో సల్ఫర్‌ లోపం తీవ్రంగా ఉండగా.. 13 మండలాల్లో మధ్యస్థంగా ఉంది.

నత్రజని కొరత వందశాతం

ఉమ్మడి జిల్లాలోని వందశాతం సాగు భూముల్లో సేంద్రియ కర్బనం (నత్రజని) కొరత తీవ్రంగా ఉంది. నత్రజని పంటకు అవసరమైన ప్రధాన పోషకం. దీనిని నేల ద్వారా అందిస్తే మొక్క పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. సేంద్రియ ఎరువులను వాడటం ద్వారా పొలాల్లో ఈ పోషకాన్ని పెంచే అవకాశం ఉంది. భూసార పరీక్షలు చేయని కారణంగా రైతులకు నేల స్వభావం తెలియడం లేదు. ఫలితంగా ఎలాంటి ఎరువులు వాడాలో అవగాహన లేక నష్టపోతున్నారు.

సూక్ష్మపోషకాలు ఇవ్వలేదు

పి.ప్రభాకర్‌, కరివేన

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూసార పరీక్షలు చేయలేదు. ప్రతి నియోజకవర్గంలో అగ్రీల్యాబ్‌లు ఏర్పాటు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ ఏడాది పొలాల్లో సూక్ష్మధాతు లోపాలు స్పష్టంగా కనిపించాయి. ధాతు లోపాల వల్ల మొక్కజొన్న పంట ఎర్రబారింది. జింక్‌, జిప్సం వంటి సూక్ష్మ పోషకాలు రాయితీపై ఇవ్వకపోవడంతో రైతులు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని