logo

ఈ ఏడాది లేనట్లేనా?

విద్యా సంవత్సరం ప్రారంభానికి 9 రోజులే మిగిలింది. అప్పటి లోగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల వద్ద చేపట్టిన భవన నిర్మాణాలు పూర్తయ్యేలా కనిపించడం లేదు. వారంలో రెండు రోజులు పనులు చేస్తే.. నాలుగు రోజులు నిలిపేస్తున్నారు.

Published : 04 Jun 2023 03:29 IST

అసంపూర్తిగా పాఠశాల భవన నిర్మాణాలు

అయిజ బాలుర ఉన్నత పాఠశాల వద్ద భవన నిర్మాణ పరిస్థితి

అయిజ, న్యూస్‌టుడే: విద్యా సంవత్సరం ప్రారంభానికి 9 రోజులే మిగిలింది. అప్పటి లోగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల వద్ద చేపట్టిన భవన నిర్మాణాలు పూర్తయ్యేలా కనిపించడం లేదు. వారంలో రెండు రోజులు పనులు చేస్తే.. నాలుగు రోజులు నిలిపేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. కొత్త విద్యా సంవత్సంలో కొత్త భవనాల్లో విద్యనభ్యసించాల్సిన విద్యార్థులు ఈఏడాది కూడా పాత ఇబ్బందులు తప్పేలా లేవు. ఉమ్మడి జిల్లాలో కొన్ని పాఠశాలలను పరిశీలిస్తే వచ్చే విద్యా సంవత్సరానికి కూడా పూర్తికావేమోనన్న అనుమానం తలెత్తుతోంది. మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లో కలిపి 3,205 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలి విడతగా 1,099 పాఠశాలలను ఎంపిక చేసినప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపికైన వాటిలో 30 శాతం భవనాలు కూడా పూర్తికాలేదు.

సమస్యలు ఎక్కడెక్కడ

* గద్వాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద రూ.46 లక్షలతో పనులు కొనసాగుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణానికి స్లాబు వేశారు. ఈఏడాది పనులు పూర్తయ్యే అవకాశాలు లేవు. పాత భవనానికి ప్యాచ్‌ వర్క్‌ చేశారు. తలుపులు, కిటికీలు, ఫ్యాన్‌లు, ఫర్నీచర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది.

* అయిజ బాలుర ఉన్నత పాఠశాలలో 600 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.36 లక్షలతో భవన నిర్మాణానికి పనులు మొదలు పెట్టారు. ఎస్సీ కాలనీలోని పీఎస్‌ పాఠశాలలో 180 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.32 లక్షలతో పనులు ప్రారంభించారు. ఇప్పట్లో పూర్తయ్యేలా పరిస్థితి కనిపించడం లేదు.

* నారాయణపేట జిల్లాలోని బలబద్రాయపల్లిలో ప్రాథమిక పాఠశాలలో రూ.12 లక్షలతో పనులు చేస్తున్నారు. మరుగుదొడ్లు ఇంకా పూర్తికాలేదు. సుమారు 300 మంది విద్యార్థులున్నారు. సంజగంపేటలోని పీఎప్‌ పాఠశాలలో రూ. 18 లక్షలతో పనులు మొదలు పెట్టారు. ఇక్కడ కూడా మరుగుదొడ్లు పూర్తికాలేదు. ప్రహరీ నిర్మాణం కొనసాగుతోంది.

* నాగర్‌కర్నూల్‌ మండలం గగ్గలపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.25 లక్షలతో పనులు మొదలు పెట్టారు. స్లాబు పనులు పూర్తి కాలేదు. ప్రహరీ నిర్మాణం చేపట్టాలి. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని పీఎస్‌ పాఠశాల ఆవరణలో రూ.15 లక్షలతో పనులు ప్రారంభించారు. సుమారు 80 మంది విద్యార్థులున్నారు. ఈఏడాది వీరికి ఇబ్బందులు తప్పేలా లేవు.

* వనపర్తి జిల్లాలోని జూరాలలో పీఎస్‌ పాఠశాల భవనాన్ని రూ.23 లక్షతో ప్రారంభించారు. గోడలు నిర్మించాల్సి ఉంది. మరుగుదొడ్లు, ప్రహరీని నిర్మించలేదు. పెబ్బేరులోని చెలిమిల్ల గ్రామ పీఎస్‌ పాఠశాల ఆవరణలో రూ. 24 లక్షలతో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు.

* మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌లో ఉన్నత పాఠశాలలో రూ.30 లక్షలతో పనులు మొదలు పెట్టారు. పాతభవనంలోని నాలుగు గదులను కూల్చి అదే స్థానంలో కొత్త భవవం నిర్మిస్తున్నారు. సుమారు 400 మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.

పూర్తయ్యేలా చూస్తాం

పాఠశాలల వద్ద మొదలైన భవన నిర్మాణాలను త్వరగా పూర్తయ్యేలా చూస్తాం. సంబంధిత అధికారులు, గుత్తేదారులతో మరోసారి మాట్లాడతాం. పనులు వేగవంతం చేసి సాధ్యమైనంత వరకు పూర్తిచేసే ప్రయత్నం చేస్తాం. జిల్లాలో భవన నిర్మాణ పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

సిరాజుద్దీన్‌, జిల్లా విద్యాధికారి, జోగులాంబ గద్వాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని