logo

మండేకాలం.. వద్దు నిర్లక్ష్యం!

వేసవి కాలంలో వాహనాల్లో పొగలు రావడం.. కార్లలో మంటలు ఎగిసిపడటం.. ద్విచక్ర వాహనాల టైర్లు పేలిపోవడం చూస్తుంటాం.. వాహనం ఇంజిన్‌లో నిప్పురవ్వలు వచ్చి పెద్దఎత్తున మంటలు వస్తే ఏకధాటిగా ప్రయాణం

Updated : 28 Mar 2024 05:24 IST

వాహనాల నిర్వహణలో జాగ్రత్తలు అవసరం
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం

వేసవి కాలంలో వాహనాల్లో పొగలు రావడం.. కార్లలో మంటలు ఎగిసిపడటం.. ద్విచక్ర వాహనాల టైర్లు పేలిపోవడం చూస్తుంటాం.. వాహనం ఇంజిన్‌లో నిప్పురవ్వలు వచ్చి పెద్దఎత్తున మంటలు వస్తే ఏకధాటిగా ప్రయాణం చేయడంతోనే ఇలా జరిగిందని చాలా మంది భావిస్తుంటారు. అది తప్పని, వాహనంలో మంటలకు అనేక కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వేసవి నేపథ్యంలో ప్రమాదాల బారిన పడకుండా వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ ‘న్యూస్‌టుడే’ కథనం.


కార్లలో జాగ్రత్తలు ఇలా..

కూలెంట్‌లో నీరు కీలకం

కారు ఇంజిన్‌లో కూలింగ్‌ విధానం ఉంటుంది. రేడియేటర్‌లో నీరు తగ్గకుండా చూసుకోవాలి. కూలెంట్‌ లెవల్‌ తక్కువగా ఉంటే డిస్టిల్‌ వాటర్‌తో సరిచేసుకోవాలి. లీకేజీ ఉంటే మరమ్మతు చేసుకోవాలి. ఇంజిన్‌ ఓవర్‌ హీట్‌ అయితే కూలెంట్‌ లీకేజీలు ఏమైనా ఉన్నాయా పరిశీలించి మెకానిక్‌ను సంప్రదించాలి.


ఇంజిన్‌ ఆయిల్‌ పరిశీలన

కూలెంట్‌ మాదిరిగానే కారులో ఇంజిన్‌ ఆయిల్‌ను కూడా తరచూ చూసుకోవాలి. ఆయిల్‌ లీకేజీలు ఉన్నా వాహనం వేడెక్కుతుంది. ఓవర్‌ హీట్‌ వల్ల మంటలు వచ్చే ప్రమాదముంటుంది. ఇంజిన్‌ ఆయిల్‌ తక్కువగా ఉన్నా ఇంజిన్‌ వేడెక్కుతుంది. ఆగకుండా వాహనం నడిపితే ఇంజిన్‌పై భారం పడుతుంది.


తగినంత గాలి ఉండాలి

కార్ల నాలుగు చక్రాలను గమనిస్తూ ఉండాలి. టైర్ల కండీషన్‌ బాగా లేకుంటే మార్చేయాలి. నిపుణులు సూచించిన మేర టైర్లలో గాలి నింపాలి.


బ్యాటరీలో వైర్లు

కారుకు అదనంగా లైట్లు, హారన్లు ఇతరాలు అమర్చుకోవద్దు. కంపెనీ నుంచి వచ్చిన లైట్లకే అనుకూలంగా వైర్లు ఉంటాయి. స్థానికంగా దొరికే మన్నిక లేని తీగలు అమరిస్తే బ్యాటరీకి షార్ట్‌సర్క్యూట్‌ తలెత్తి  మంటలు వస్తాయి.


ద్విచక్ర వాహనదారులకు సూచనలు

పెట్రోలు లీకేజీలతో ప్రమాదం..

వేసవిలో పెట్రోలు, డీజిల్‌ కార్లతో పాటు ద్విచక్రవాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాల్లో ఏ చిన్నపాటి లీకేజీలున్నా అగ్గికి ఆజ్యం పోసినట్లే అవుతుంది. ఏ చిన్న మరమ్మతులు అవసరమైనా వెంటనే చేయించాలి.


ట్యాంకు నిండా పెట్రోలు వద్దు

వేసవిలో ద్విచక్ర వాహనాల్లో ఒకటి, రెండు కంటే ఎక్కువ లీటర్లు పెట్రోల్‌ ఉండొద్దు. నిండా ఇంధనం ఉంటే ఉష్ణోగ్రతతో పీడనం పెరిగి ట్యాంకు పేలిపోయే ప్రమాదముంటుంది.


  • బంకులో పెట్రోలు పోయించుకునేందుకు వరుస క్రమంలో వాహన చోదకులు బారులు తీరుతుంటారు. తమ వంతు రాకముందే ట్యాంకు మూత తీసి ఉంచొద్దు.
  • ఆయిల్‌గా తక్కువగా ఉంటే ఇంజిన్‌ వేడెక్కుతుంది. ద్విచక్ర వాహనం చైన్‌కు తరచూ లూబ్రికేషన్‌ చేయించాలి. ఎండకు లూబ్రికేంట్లు ఎండటంతో వాహనం వేడెక్కుతుంది. ప్రీమియం వాహనాల్లో కూలెంట్‌ క్రమం తప్పకుండా పరిశీలిస్తుండాలి.
  • బ్యాటరీ కరెంట్‌, పెట్రో లీకేజీలను పరిశీలించాలి. చిన్న చిన్న మంటలు రాజుకునే ప్రమాదం ఉంటుంది. పెట్రోలు ట్యాంక్‌పై కవర్‌ కప్పి ఉండాలి.

సామర్థ్యం లేని టైర్లతో ముప్పు

వేసవిలో టైర్లు పేలిపోతుంటాయి. గ్రిప్‌లేని పాత టైర్లు ఉంటే తొలగించి మంచివి వేసుకోవాలి. నైట్రోజన్‌ గాలి నింపుకోవాలి. వాహనం నీడలో నిలపాలి. అవసరమైతే కవర్‌ కప్పాలి.


ఆగుతూ ప్రయాణించాలి  
- శివకుమార్‌, సహాయ వర్క్స్‌ మేనేజర్‌, మారుతి షోరూం

కార్లు బయటకు తీసే సమయంలోనే ఇంజిన్‌ ఆయిల్‌, కూలెంట్‌ పరిశీలించుకోవాలి. వాహనం కండీషన్‌ ఉంటే ఆగకుండా 200 నుంచి 300 కి.మీ.ల మేర ఆగకుండా ప్రయాణం చేయొచ్చు. వేసవిలో వాహనాలకు షోరూంలోలో సాధారణ చెకప్‌లు చేయించుకోవాలి.  


అన్నీ సరిచూసుకోవాలి..
- షేఖ్‌ ఖలీల్‌, మెకానికల్‌ మేనేజర్‌, హీరో షోరూం

వేసవిలో ద్విచక్ర వాహనాల్లోనూ సమస్యలు వస్తుంటాయి. ట్యాంకు నిండా పెట్రోలు కొట్టించినా ప్రమాదం వాటిల్లే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. టైరు సామర్థ్యాన్ని బట్టి గాలి నింపుకోవాలి. తరచూ ఆయిల్‌ చెక్‌ చేసుకోవాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని