logo

గెలిస్తే చాలు.. వసతులు వేలు

ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? వారికి వచ్చే నిధుల సంగతేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.!

Updated : 07 May 2024 06:28 IST

ధరూరు, గద్వాల న్యూటౌన్‌, న్యూస్‌టుడే:  ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? వారికి వచ్చే నిధుల సంగతేంటి? అనే విషయాలను తెలుసుకుందాం. 

  • నెలకు రూ.లక్ష(అన్ని అలవెన్సులతో కలిపి) వేతనం లభిస్తుంది. పదవి అనంతరం రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు పింఛను వస్తుంది. 
  • ఏడాదికి 34 సార్లు ఎంపీతో పాటు, జీవిత భాగస్వామికి ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తారు. అలాగే ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లో రైలు ప్రయాణం ఉచితం. రహదారి మీదుగా ప్రయాణిస్తే కిలోమీటరుకు రూ.16 చొప్పున బిల్లు చెల్లిస్తారు.  ఏడాదికి రూ.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తుంది..
  • నియోజకవర్గం కార్యాలయ నిర్వహణ ఖర్చు నెలకు రూ.45 వేలు, పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటే రోజుకు రూ.2 వేలు అదనంగా ఇస్తారు.ఫర్నిచర్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఇతర అవసరాల నిమిత్తం ప్రతి మూడు నెలలకు రూ.75 వేలు అందిస్తారు.
  • ప్రథమ శ్రేణి అధికారుల కేంద్ర పౌరసేవల కింద కేంద్రం వైద్యారోగ్య పథకం ద్వారా ఆరోగ్య సేవలు పొందవచ్చు.పాథాలాజికల్‌ లాబొరేటరీ సౌకర్యం, ఈసీజీ, దంత, కంటి ఈఎన్‌టీ, చర్మ ఆరోగ్య సేవలు ఉచితంగా పొందవచ్చు
  • దిల్లీలో నివాస వసతిని కల్పిస్తారు. మొదటి సారి గెలిచిన ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాలను కేటాయిస్తారు. దిల్లీలో బీకేఎస్‌ మార్గ్‌లోని ఎంఎస్‌ ప్లాట్‌ను కేటాయిస్తున్నారు. సీనియర్‌ ఎంపీలకు వ్యక్తిగత బంగ్లాను కేటాయిస్తారు. 50 వేల యూనిట్ల ఉచిత విద్యుత్తు వినియోగించుకోవచ్చు.
  • మూడు టెలిఫోన్లు పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. దిల్లీలోని ఇంటి వద్ద కార్యాలయంలో, రాష్ట్రంలోని నివాసం వద్ద తనకు ఇష్టమున్న చోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదిలో 50వేల ఉచిత కాల్స్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా 3జీ ప్యాకేజీలో అదనంగా 1.50 లక్షల కాల్స్‌ను మాట్లాడుకునే వీలు ఉంటుంది.

ఓట్ల కసరత్తు!

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం: ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్‌ భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పార్టీ నాయకులతో కలిసి సోమవారం మహబూబ్‌నగర్‌ పట్టణంలోని స్టేడియం మైదానం, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానాలను చుట్టొచ్చారు. వాకర్స్‌ను ఆప్యాయంగా పలకరించి ఓటు అభ్యర్థించారు. ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.  


రూ. 2తో ఛాలెంజ్‌ ఓటుకు అవకాశం

న్యూస్‌టుడే, అచ్చంపేట: పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన వ్యక్తి నిజమైన ఓటరు కాదని పోలింగ్‌ ఏజెంట్‌ ఓటు వేసేందుకు అభ్యంతరం తెలిపినప్పుడు అతనికి ఛాలెంజ్‌ (సవాల్‌) ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఓటును సవాల్‌ చేసే అవకాశం పోలింగ్‌ కేంద్రంలో ఏదో ఒక రాజకీయ పార్టీ అభ్యర్థి తరఫున కూర్చున్న ఏజెంట్‌కు మాత్రమే ఉంటుంది. పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఓటరు జాబితాలో ఉన్న పేరుకు సరిపోవడం లేదని అనుమానం కలిగినప్పుడు ప్రిసైడింగ్‌ అధికారి (పీవో)కి ఏజెంట్‌ రూ. 2 చెల్లించి సవాలు చేసేందుకు అవకాశం ఉంది. ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి పేరు, వయసు, తండ్రి పేరు, అతడు వెంట తెచ్చుకున్న గుర్తింపు కార్డును పరిశీలించాలి. అతడి బంధువులు లేదా ఓటరు జాబితాలో అతని ఇంటి పక్క వారిని సాక్షులుగా నియమించి వారితో ప్రమాణం చేయించి విచారణ చేపడతారు. సదరు ఓటరు బోగస్‌ అని తేలితే అతడిపై ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగిస్తారు. ఒకవేళ అతడు జాబితాలో ఉన్న విధంగా నిజమైన ఓటరు అని రుజువైతే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. అతడి ఓటును ఛాలెంజ్‌ చేసిన ఏజెంటు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తీర్మానించి అతడు చెల్లించిన రూ. 2ను ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. ఒకవేళ ఏజెంట్‌ చేసిన ఫిర్యాదు నిజమని రుజువైతే అతడు చెల్లించిన రుసుము రూ. 2ను ప్రిసైడింగ్‌ అధికారి సంబంధిత ఏజెంట్‌కు వాపసు ఇచ్చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని